Abn logo
Sep 26 2020 @ 09:07AM

చేపల పెంపకంతో.. నిరుద్యోగానికి చెక్!

Kaakateeya

గ్యాంగ్‌టక్: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగితకు చెక్ పెట్టాలంటే మార్గం ఒకటే. అదే విద్యావంతులు ఉద్యోగాలు కాకుండా వ్యాపారాలు చేయడం. చదువుకున్న నిరుద్యోగులు సొంతంగా బిజినెస్ చేసుకుంటే నిరుద్యోగిత గణనీయంగా తగ్గిపోతుంది. ఎందుకంటే సదరు వ్యాపారాల వల్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుంది కదా! కానీ ఇలా సొంత వ్యాపారాలు చేయడం అందరి వల్లా అయ్యే పని కాదు. దీనికి ప్రధాన కారణం పెట్టుబడి లభించకపోవడం. ఈ సమస్యకు ప్రభుత్వం గనుక పరిష్కార మార్గం చూపితే దేశంలో నిరుద్యోగితను నియంత్రించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఇదే నిర్ణయానికి వచ్చిన సిక్కిం ప్రభుత్వం.. నిరుద్యోగులను చేపల పెంపకం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తోంది.

ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా చేపలు తినేవారు కనబడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ట్రోట్ జాతి చేపలకు ఎక్కడైనా డిమాండే. మంచినీటిలో పెరిగే ఈ చేపలను గనుక పెంచగలిగితే మంచి ఆదాయం వస్తుంది. కానీ ఇటువంటి ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సుమారు 5 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇంత సొమ్మును తీసుకొచ్చి ప్లాంట్ ప్రారంభించడం నిరుద్యోగులకు సాధ్యం కాని పని. సరిగ్గా ఇక్కడే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన పథకం ఉపయోగపడుతుంది. ఆ పథకం పేరే 'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన'

దేశంలో ఓ మోస్తరుగా ఉండే నిరుద్యోగిత కరోనా కారణంగా పెరిగిపోయింది. రికార్డులు తిరగరాస్తున్న నిరుద్యోగితను నిలువరించడానికి కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలు ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే వీధివ్యాపారుల కోసం 'స్వనిధి' పథకాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా వీధి వ్యాపారులకు అవసరమైన మూలధనం బ్యాంకుల ద్వారా అందే ఏర్పాటు చేసింది. ఈ పథకం అమలు తీరుపై ప్రధాని స్వయంగా కొందరు వీధి వ్యాపారులతో కూడా ముచ్చటించారు. 

ఇదే క్రమంలో భారత ప్రభుత్వం ప్రకటించిన మరో పథకం 'ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన'. దేశంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించి, నిరుద్యోగులు ఈ వైపుగా అడుగులు వేసేలా చేసే యోచనతో కేంద్రం ఈ నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం రూపంలో దక్కిన అవకాశాన్ని సిక్కిం ప్రభుత్వం రెండు చేతులా అందిపుచ్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగితను ఓడించడానికి మత్స్య సంపద యోజనను ఉపయోగించుకుంటోంది. నిరుద్యోగులకు ఈ పథకం ఫలాలను అందజేస్తోంది.

సిక్కింలోని చాలామంది నిరుద్యోగులు ప్రస్తుతం చేపల పెంపకంపై దృష్టిపెట్టారు. 'పీఎం-మత్స్య సంపద యోజన'కు ఇక్కడి ప్రభుత్వం కల్పించిన ప్రచారమే దీనికి కారణం. ఈ పథకం ప్రకారం, చేపలు పెంచడానికి అవసరమైన ప్లాంట్ ఏర్పాటులో 40శాతం భారాన్ని  కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న నిరుద్యోగులు ప్రభుత్వానికి దరఖాస్తులు పంపుతున్నారు. ప్రభుత్వ అనుమతి లభించగానే చేపల పెంపకం మొదలెట్టేస్తున్నారు.

సిక్కింలో పెరుగుతున్న చేపల పెంపకం ప్లాంట్లపై ఉన్నతాధికారులు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం-మత్స్య సంపద యోజనలో భాగంగా ప్లాంట్ ఏర్పాటులో 40శాతం ఖర్చును కేంద్రం భరిస్తుందని వాళ్లు చెప్పారు. అదే ఎస్సీ, ఎస్టీ వర్గాల యువత, మహిళలు ప్లాంటు ఏర్పాటు చేయదలిస్తే 60శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుందట. అంటే వీళ్లు కేవలం 40శాతం ఖర్చు భరిస్తే చాలు. ఈ పథకాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో నిరుద్యోగితను తగ్గించాలని సిక్కిం ప్రభుత్వం భావిస్తోందని, ఇప్పటి వరకూ ఈ పథకం సత్ఫలితాలనే ఇచ్చిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి ఈ పథకం కింద రాష్ట్రంలో సుమారు 70 చేపల పెంపకం ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

చేపల పెంపకం ప్రారంభించిన నిరుద్యోగులు కూడా తమ ఆదాయం పట్ల ఆనందంగానే ఉన్నారు. ఏటా రూ.5 నుంచి రూ.8లక్షల వరకూ సంపాదిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు చేసినా ఇంత సంపాదించడం కష్టమేనని, ఈ చేపల పెంపకం వల్ల పని చేస్తున్న భావన కూడా లేదని వివరించారు. రోజులో కొంత సమయం పార్ట్‌టైం ఉద్యోగంలా చేసినా కూడా ఫుల్ జీతం వచ్చినట్లుందని సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్న ట్రోట్ జాతి చేపలనే తాము ఎక్కువగా పెంచుతున్నట్లు చెప్పారు. దాంతో తమకు ఏమాత్రం నష్టం జరగడం లేదన్నారు. అంతేగాక సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కుతున్నాయని తెలియజేశారు.

ఈ పథకం గురించి తెలిసి.. బీఏ, బీఎస్సీ వంటి డిగ్రీలు చేసి ఉద్యోగాలు లభించని యువత కూడా చేపల పెంపకం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల సొంత కాళ్లపై నిలబడే అవకాశం తమకు లభిస్తోందని, కుటుంబసభ్యులు కూడా అండగా ఉంటున్నారని యువత అంటోంది. చేపల పెంపకం కోసం పొలాల్లో వృధాగా పోయే నీటిని ఉపయోగించుకుంటున్నామని, దీంతో నీటి వృధా కూడా చాలావరకు తగ్గుతోందని వివరించారు. ఏది ఏమైనా చేపల పెంపకం తమకు మేలే చేస్తోందని, ఉద్యోగాల కోసం పడిగాపులు పడకుండా ధైర్యంగా జీవించే అవకాశం కల్పిస్తోందని ఆనందం వ్యక్తంచేశారు.

Advertisement
Advertisement
Advertisement