Abn logo
Aug 4 2020 @ 01:56AM

తొలి ఆహ్వానం ఇక్బాల్‌ అన్సారీకి

  • వేదికపై మోదీ సహా ఐదుగురే!
  • కరోనాతో అతిథుల సంఖ్యలో కోత
  • 208 నుంచి 170కి కుదింపు
  • ఆన్‌లైన్‌లో ఆడ్వాణీ, జోషీ హాజరు
  • 50మంది సాధువులకు పిలుపు
  • ఆలయ కొత్త నమూనాపై స్టాంపుఅయోధ్య, ఆగస్టు 3: రామాలయ భూమిపూజకు తొలి ఆహ్వానం అందుకున్నది ఓ ముస్లిం ప్రముఖుడు కావడం విశేషం. అయోధ్య కేసులో ప్రధాన పిటిషనర్లలో ఒకరైన ఇక్బాల్‌ అన్సారీకి తొలి ఆహ్వాన పత్రిక అందజేశారు. శంకుస్థాపనకు కచ్చితంగా హాజరవుతానని.. ఇది శ్రీరాముడి సంకల్పమని అన్సారీ హర్షం వ్యక్తంచేశారు. కాగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల సంఖ్యను నిర్వాహకులు కుదించారు. గతంలో 208 మందిని పిలవాలని నిర్ణయించగా ఇప్పుడు 170 మందినే పిలుస్తున్నట్లు తెలిసింది. వేదికపై ప్రధాని మోదీతో ఐదుగురికే.. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అధినేత మోహన్‌ భాగవత్‌, ట్రస్టు చైర్మన్‌ మహంత నృత్యగోపాల్‌ దాస్‌, యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు చోటు దక్కనుంది. రామజన్మభూమి ఉద్యమ సారథి ఎల్‌కే ఆడ్వాణీ, బీజేపీ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్‌ జోషీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరవుతారు. బీజేపీ నాయకురాలు ఉమాభారతి కూడా రావడం లేదు. మోదీ, ఇతరులు శంకుస్థాపన చేసి వెళ్లిన తర్వాత తాను వెళ్లి రామ్‌లల్లాను దర్శించుకుంటానని ట్వీట్‌ చేశారు. భోపాల్‌ నుంచి సోమవారం బయల్దేరుతున్నానని.. మధ్యలో కరోనా సోకిన వ్యక్తిని పరామర్శించాల్సి ఉందని.. అందుకే ప్రధాని హాజరయ్యే కార్యక్రమానికి భౌతిక దూరం పాటించాలనుకుంటున్నానని ఆమె తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా రావలసి ఉన్నా.. ఆయనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. సంఘ్‌ నాయకులు భయ్యాజీ జోషీ, దత్తాత్రేయ హోసబోలే, లఖ్‌నవూ శాఖ నేత అనిల్‌కుమార్‌ అయోధ్యకు రానున్నారు. 50 మంది సాధువులను ఆహ్వానిస్తున్నారు. ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ రవిశంకర్‌, మొరారీ బాపు ఆహ్వానితుల జాబితాలో లేరు.


వెండి తమలపాకులు..

వెండితో తయారుచేసిన తమలపాకులను భూమిపూజలో ఉపయోగించనున్నారు. వారాణసీలోని చౌరాసియా వర్గీయులు వీటిని తయారుచేశారు. కాశీ చౌరాసియా కమ్యూనిటీ అధ్యక్షుడు నాగేశ్వర్‌ చౌరాసియా వాటిని విద్వత్‌ పరిషత్‌కు సమర్పించారు. పరిషత్‌ సభ్యులు వాటితో అయోధ్యకు బయల్దేరారు. తమలపాకులను హిందువులు అతిపవిత్రంగా భావిస్తారు. అనేక పూజల్లో వాటిని విరివిగా వినియోగిస్తుంటారు.కీలకం వారిద్దరే..

ఆలయ నిర్మాణ బాధ్యతలన్నీ ట్రస్టు అధ్యక్షుడు మహంత నృత్యగోపాల్‌ దాస్‌, ప్రధాని మోదీకి మాజీ ముఖ్య సలహాదారు నృపేంద్ర మిశ్రాయే చూసుకుంటున్నారు. వీహెచ్‌పీ, సంఘ్‌ నేతలను సమన్వయం చేసుకోవడం మహంత విధి కాగా.. పనులు నిరాటంకంగా జరిగేలా చూసే బాధ్యత మిశ్రాది. 

Advertisement
Advertisement
Advertisement