Abn logo
Jun 19 2021 @ 10:26AM

వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకున్న సిబ్బందితో.. ఢిల్లీ టు దుబాయ్ తొలి అంత‌ర్జాతీయ విమానం!

న్యూఢిల్లీ: పూర్తి స్థాయిలో వ్యాక్సినేష‌న్ పొందిన సిబ్బందితో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ త‌న తొలి అంత‌ర్జాతీయా విమానాన్ని శుక్రవారం ఢిల్లీ- దుబాయ్ మార్గంలో న‌డిపింది. నిన్న ఉద‌యం 10.40 గంట‌ల‌కు ఎయిరిండియా IX 191 విమానం ఢిల్లీ నుంచి దుబాయ్ బ‌య‌ల్దేరింది. ఇందులోని సిబ్బందంతా పూర్తిగా వ్యాక్సినేష‌న్ అయిన‌వారే. కెప్టెన్ డీర్ గుప్తా, కెప్టెన్ అలోక్ కుమార్ నాయ‌క్‌ల‌తో పాటు క్యాబిన్ సిబ్బంది వెంక‌ట్ కెల్లా, ప్ర‌వీణ్ చంద్ర‌, ప్ర‌వీణ్ చౌగ్లే, మ‌నీషా కాంబ్లే అంద‌రూ వ్యాక్సినేష‌న్‌ పూర్తి చేసుకున్నారు. ఇదే సిబ్బందితో దుబాయ్‌-జైపూర్‌-ఢిల్లీ మార్గంలో  IX 196 విమానం రిట‌ర్న్ వ‌స్తుంద‌ని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్ర‌కటించింది. వందే భార‌త్ మిష‌న్ ప్రారంభమైన త‌ర్వాత ఓ విమానం పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ జ‌రిగిన సిబ్బందితో భార‌త్ నుంచి వెళ్లిన‌ తొలి అంత‌ర్జాతీయ విమానం త‌మ‌దేన‌ని ఈ సంద‌ర్భంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వెల్ల‌డించింది.


కెప్టెన్ అలోక్ కుమార్ నాయ‌క్ మాట్లాడుతూ వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకున్న సిబ్బందితో ఇండియా నుంచి వెళ్తున్న మొద‌టి ఇంట‌ర్నెష‌న‌ల్ ఫ్లైట్ ఇదేన‌ని అన్నారు. వందే భార‌త్ మిష‌న్‌లో భాగంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 7వేల‌కు పైగా విమానాలు న‌డిపింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అన్ని విమానాలు కూడా ప్రీ అండ్ పోస్ట్ టెస్టులతో ర‌న్ చేసిన‌ట్లు చెప్పారు. కాగా, దేశంలో మ‌హ‌మ్మారి ప్ర‌భావం ప్రారంభమైన త‌ర్వాత నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 17 మంది పైల‌ట్లు క‌రోనా బారినప‌డి చ‌నిపోయినట్లు ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ పైల‌ట్స్ స‌మాచారం.