Advertisement
Advertisement
Abn logo
Advertisement

మిగిలింది మొండిగోడలే

రేమల్లె అగ్ని ప్రమాదంలో రూ.కోట్లలో నష్టం


హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, డిసెంబరు 1 : రేమల్లె మోహన్‌ స్పింటెక్స్‌ కర్మాగారంలో బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. నష్టం అంచనా వేసే క్రమంలో మొండిగోడలు మాత్రమే దర్శనమిచ్చాయి. చుట్టుపక్కల గ్రామాల్లోని ఎంతో మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమలోని యూనిట్‌-3 గోడౌన్‌లో 10వేల కాటన్‌ బేళ్లు, యంత్ర సామాగ్రి మొత్తం కాలి బూడిదయింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఏడు అగ్నిమాపక శకటాలు, జిల్లా ఫైర్‌ అఫీసర్‌ ధర్మారావు, ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజు ఆధ్వర్యంలో ఫైర్‌ సిబ్బంది, ఫ్యాక్టరీ యాజమాన్యం, కార్మికులు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించినా, ప్రాణనష్టం లేకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. తొమ్మిది గంటలకు దాదాపు 100 మందికి పైగా కార్మికులు అగ్ని ప్రమాదం సంభవించిన ప్రాంతంలో పనిచేస్తుంటారని, ముందే ప్రమాదం జరగడంతో వారు క్షేమంగా ఉన్నట్లు ఫ్యాక్టరీ ప్రతినిధి తెలిపారు. అగ్ని ప్రమాద కారణాలు ఇంతవరకు తెలియరాలేదని, విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ అయ్యే అవకాశం లేదని, రసాయనాలతో నిండిన కాటన్‌ బేళ్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు. రేమల్లె శివారులోని పెద్ద పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించిందని తెలియడంతో గ్రామస్థులు భయంతో ఆందోళన చెందారు. కాటన్‌ వల్లే మంటలను అదుపు చేయలేక పోయామని కార్మికులు తెలిపారు. 

Advertisement
Advertisement