Abn logo
Sep 24 2021 @ 08:16AM

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

          - ఒకరి మృతి - ముగ్గురు ఆస్పత్రిపాలు 


విజయపురం(చిత్తూరు): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ కుటుంబం బుధవారం రాత్రి బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. సమీపంలోని చెక్‌పోస్టు సిబ్బంది ముగ్గురిని రక్షించగా, ఒకరు మృతి చెందారు. చిత్తూరు జిల్లా విజయపురం మండలం కేశవాపురం గ్రామం నెడుబరం వద్ద జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ రాజశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు... తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లా, పాండూరుకు చెందిన కరుణాకరన్‌(48), భువనేశ్వరి (42) దంపతులకు దుర్గ(19), మోహనప్రియ (22)అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కరుణాకరన్‌ కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నారు. దీనికి తోడు పెద్దకుమార్తె మోహన మానసిక పరిస్థితి సరిగా లేక పోవడంతో పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. ఈ నేపథ్యంలో ఆవేదన చెంది కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బంధువులతో చిత్తూరు జిల్లా విజయపురం మండలం రామకమ్మ గుడికి వెళుతున్నామని చెప్పి ఓ పాఠశాల వ్యానులో బుధవారం రాత్రి  బయలుదేరారు. ఆంధ్రా సరిహద్దుల్లోకి వచ్చిన తరువాత కూల్‌ డ్రింక్స్‌లో క్రిమి సంహారక మందు కలిపి తాగారు. అనంతరం కేశవపురం సమీపంలోని నెడుబరం వద్ద పెద్ద బావిలో దూకేశారు. పెద్ద ఎత్తున శబ్ధం రావడంతో సమీపంలో ఆంధ్రా చెక్‌పోస్టు వద్ద పనిచేస్తున్న సిబ్బంది హుటాహుటిన వెళ్లి వారిని రక్షించే ప్రయత్నంలో భువనేశ్వరి మృతి చెందింది. మిగిలిన ముగ్గురిని నగరి ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి తిరుపతి రుయాకు తరలించారు. దుర్గా చికిత్స పొందుతుండగా మోహనప్రియ, కరుణాకరన్‌ను డిశ్చార్జి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ భారతి తెలిపారు.

క్రైమ్ మరిన్ని...