Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎట్టకేలకు దిగొచ్చారు

  1. శిథిల పాఠశాలకు తాళం వేయడంతో..
  2. ఆరు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు


ఎమ్మిగనూరు, డిసెంబరు 8: శిథిలమైన పాఠశాలకు తమ పిల్లలను పంపేదిలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం పాఠశాలకు తాళం వేశారు. ఎమ్మిగనూరు మండలం సోగనూరు ఎంపీయూపీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని పైకప్పు పెచ్చులు ఊడిపడడంతో రెండు రోజులుగా వారు ఆందోళన చేస్తున్నారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో బుధవారం ‘శిథిల బడి’ అన్న శీర్షికన వార్త ప్రచురితమైంది. బుధవారం గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. కొత్త భవనాలు నిర్మించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో హెచఎం, ఉపాధ్యాయులు విద్యార్థులను పాఠశాల పక్కనున్న గుడి, సమీపంలోని దర్గాలో కూర్చోబెట్టి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహించారు. ఎమ్మిగనూరు ఎంఈవో ఆంజనేయులు హుటాహుటిన సోగనూరుకు వెళ్లి పాఠశాల భవనాలను పరిశీలించారు. హెచఎం, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. 1,2,3 తరగతుల విద్యార్థులను ఉర్దూ పాఠశాలలోకి, 4,5,6,7,8 తరగతుల విద్యార్థులను పాఠశాలలోనే బాగున్న ఒక గదిలో కూర్చోబెట్టేలా చర్యలు తీసుకున్నారు. ఆరు గదుల కోసం ప్రతిపాదనలు పంపుతున్నామని ఎంఈవో తెలిపారు. 

అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం

ఏడాది నుంచి పాఠశాల గదుల పైకప్పుల నుంచి పెచ్చులూడి పడుతున్నాయి. ఈ విషయాన్ని డీఈవో, ఎంఈఓతో పాటు ఎమ్మెల్యే దృష్ణికి కూడా తీసుకెళ్లాం. అయితే ఎవరి నుంచి స్పందనలేదు. దీంతో సహనం నశించిన గ్రామస్థులు బడికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.                                                                                                -  వెంకటరమణ, ఇనచార్జి హెచఎం


Advertisement
Advertisement