Abn logo
Sep 8 2020 @ 04:27AM

విషపు దందా!

Kaakateeya

బషీరాబాద్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో నిషేధిత గ్లైపోసెట్‌ గడ్డి మందు వ్యాపారం


బషీరాబాద్‌: ఎరువులు, పురుగుల మందులు విక్రయించే ఫర్టిలైజర్‌ దుకాణాలు నియంత్రిత (నిషేధం) గడ్డిమందు దందాకు అడ్డాగా మారాయి. ఈ ప్రాంతం కర్ణాటక సరిహద్దు కావడంతో స్థానిక ఫర్టిలైజర్‌ వ్యాపారులు కొందరు అక్కడి నుంచి నిషేధిత గడ్డిమందును దిగుమతి చేసుకుని రైతులకు విక్రయిస్తున్నారు. కొంతకాలంగా బషీరాబాద్‌లోని ఫర్టిలైజర్‌ దుకాణాల్లో  గ్లైపోసెట్‌ (గ్లైసీల్‌), ఎక్సెల్‌ మెరా71, ఇతరత్రా పేరుతో పిలిచే నిషేధిత గడ్డి మందులు అమ్ముతూ విషపు దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అన్నదాతల ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రతికూలమైన  గ్లైపోసెట్‌ గడ్డిమందు విక్రయంతోపాటు, ఇతర ప్రాంతాలకు వ్యాపారులు తరలిస్తూ ఫర్టిలైజర్‌ దుకాణాలను అడ్డాగా మార్చుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మండలవ్యాప్తంగా ఈసారి అఽధికంగా రైతులు పత్తిని సాగు చేశారు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు కలుపుతీత పనులు సక్రమంగా కొనసాగలేదు. దీంతో రైతులు పత్తి పొలాల్లో కలుపు తొలగించేందుకు ప్రమాదకరమైన గ్లైపోసెట్‌ గడ్డిమందును పంటలో పిచికారీ చేసేందుకు ఫర్టిలైజర్‌ దుకాణాల బాట పట్టారు.


ఈ గ్లైపోసెట్‌ కారణంగా పత్తి పంటతోపాటు చుట్టుపక్కల మిగతా పంట పొలాలు విషపూరితంగా మారుతాయని శాస్త్రవేత్తలు తెలపడంతో ప్రభుత్వం ఈ మందును నిషేధించింది. ఈ మందు మానవాళికి ప్రమాదకరమని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. గడ్డిమందును కర్ణాటక నుంచి తెచ్చి అధిక ధరలకు అమ్ముతున్నారు. వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రెండేళ్ల కిందట నిషేధించిన గ్లైపోసెట్‌ను నిర్ణీత దశలో ఉపయోగించుకునేలా ప్రభుత్వం సడలింపునిచ్చింది. వ్యవసాయాధికారి ప్రిస్ర్కిప్షన్‌ ఉంటేనే ఇవ్వాలని సూచిస్తూ సెప్టెంబర్‌ వరకు గడ్డి మందును వాడరాదని స్పష్టం చేసింది. అక్టోబర్‌ నుంచి ఈ మందును అవసరమైతే పొలం గట్ల మీద వాడాల్సి ఉండగా అలాంటి నిబంధనలేవీ ఇక్కడ అమలు కావడం లేదు.  ఈ విషయమై స్థానిక వ్యవసాయాధికారి నాగంకృష్టను వివరణ కోరగా.. తన దృష్టికి రాలేదని, నిషేధిత గడ్డి మందు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పుకొచ్చారు. 


దౌల్తాబాద్‌ మండలంలో..

దౌల్తాబాద్‌: పత్తి చేలులో కలుపు తీసేందుకు కూలీల కొరత ఏర్పడటంతో నిషేధిత గడ్డి మందులపై రైతులు ఆధారపడుతున్నారు. సకాలంలో కలుపు తీయకపోతే ప్రధాన పంటకు పోషకాలు అందక దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. దీంతో విత్తనం వేసిన మూడోరోజు నుంచే రసాయనాలను పిచికారి చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు నిషేధిత గ్లైపోసెట్‌ తదితర కలుపు మందులను దౌల్తాబాద్‌ మండలంలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇలాంటి మందులను వినియోగిస్తే భూమిలో భూసారం తగ్గిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 


విక్రయాలు జరగడం లేదు - వినయ్‌కుమార్‌, వ్యవసాయ శాఖ

సహాయ సంచాలకులు, కొడంగల్‌  

కొడంగల్‌ నియోజకవర్గంలో  నిషేధిత గ్లైపోసెట్‌ మందును ఫర్టిలైజర్‌ దుకాణ యజమానులు అమ్మవద్దు. ఈ మందు ప్రమాద కరమైంది. దీనిని వినియోగంతో టీబీ, క్యాన్సర్‌, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఫర్టిలైజర్స్‌ దుకాణాలపై తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. దుకాణాల్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 

Advertisement
Advertisement