భవిష్యత్తు గురించి ఆలోచించను

నటన నేర్చుకోలేదు. అసలు నటి అవ్వాలనే అనుకోలేదు. కుటుంబంలో అందరూ టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు.  కానీ ఒక మేక్‌పమ్యాన్‌ ఆమెలో కొత్త ఆలోచన రేకెత్తించాడు.  అదే ఆమె జీవితానికి మలుపై... అభినయానికి పిలుపయింది. అనూహ్యంగా ‘తెర’పైకి వచ్చి... ‘మిఠాయి కొట్టు చిట్టెమ్మ’గా మురిపిస్తున్న అంజనా శ్రీనివా్‌సను కదిలిస్తే... ఇంకా ఎన్నో ఊసులు... 


‘‘ఈ కాలం పిల్లని నేను. సినిమాలు చూస్తూ... అందులో డ్యాన్స్‌లు ఇష్టపడుతూ... అనుకరించడం అలవాటు. చిన్నప్పటి నుంచి నా వ్యాపకం నాట్యం. కానీ సంప్రదాయ నృత్యాలేవీ నేర్చుకోలేదు. స్కూల్లో, కాలేజీలో... ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో మాత్రం పాల్గొనేదాన్ని. డ్యాన్స్‌లు అదరగొట్టేదాన్ని. మా సొంతూరు కర్ణాటకలోని కోలార్‌. ప్రస్తుత నివాసం బెంగళూరులో. మా అమ్మ ఉపాధ్యాయురాలు. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. నా కోరిక కూడా అమ్మలా టీచర్‌ అవుదామనే! నా జీవితం మరో మార్గంలో పయనిస్తుందని అప్పుడు ఊహించలేదు. 


వందలో వడగడితే... 

ఫస్ట్‌ పీయూసీలో ఉండగా... ఓ కాలేజీ ఈవెంట్‌లో మా డ్యాన్స్‌ కార్యక్రమం ఉంది. మా మేకప్‌ కోసం మేక్‌పమ్యాన్‌ ఒకరు వచ్చారు. నన్ను చూడగానే ఆయన అడిగారు... ‘సీరియల్స్‌లో చేస్తావా’ అని! ఆ మాట వినగానే నాలో ఏదో ఉత్సాహం. ‘సరే..’ అన్నాను. ఆయన వెంటనే ‘ఒక ఆడిషన్‌ జరుగుతోంది... వెళ్లు’ అన్నారు. వెళ్లాను. ఓ కన్నడ సీరియల్‌ కోసం. అక్కడ దాదాపు వంద మంది ఉన్నారు. అందులో నుంచి మొదట పదిమందిని ఎంపిక చేశారు. వాళ్లని వడపోసి సంఖ్యని సగానికి తగ్గించారు. ఆఖరికి మిగిలింది ఒక్కరు. అది ఎవరో కాదు... నేనే! నమ్మడానికి చాలా సమయం పట్టింది. అలా 2012లో ‘కృష్ణా రుక్మిణి’ కన్నడ సీరియల్‌తో నటిగా పరిచయమయ్యా. 


ఊహించలేదు... 

అంతవరకు నాకు నటనంటే తెలియదు. చెప్పాను కదా... అసలు అది నా ఊహల్లోనే లేదని. మా అమ్మా, నాన్నలే కాదు... మా కుటుంబంలో దాదాపు అందరూ వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్నవారే. నా కెరీర్‌ని కూడా వారి దారిలోనే ఊహించుకున్నాను. అయితే ‘కృష్ణా రుక్మిణి’ తరువాత వెనక్కి తిరిగి చూసుకొనే అవసరమే రాలేదు. అది పెద్ద హిట్‌ అయింది. నాకు మంచి పేరు వచ్చింది. అందులో నన్ను చూసి తెలుగులో చేయమని అడిగారు. కొంచెం భయపడ్డాను. ఎందుకంటే కొత్త ప్రదేశం. నాకు తెలియని భాష. వెనకాడుతూనే హైదరాబాద్‌కి వచ్చా. రాగానే ఒకే ఒక్క డైలాగ్‌ ఇచ్చారు. అది కూడా వాళ్లే ప్రామ్టింగ్‌ చేశారు. ఓకే అనేయడం, అగ్రిమెంట్‌ అయిపోవడం, మూడు రోజుల్లోనే షూటింగ్‌ మొదలవ్వడం... అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. అదే ‘గోరంత దీపం’ సీరియల్‌. 2014లో ప్రారంభమై రెండున్నరేళ్లపాటు నడిచింది. ‘పద్మావతి’గా అందులో నా పాత్రకు మంచి ఆదరణ లభించింది. 


మళ్లీ అటు వెళ్లలేదు... 

నా కెరీర్‌ కన్నడలోనే మొదలైనా అక్కడ నేను చేసింది ఒకేఒక్క సీరియల్‌. తెలుగు, తమిళంలో వరుసు ప్రాజెక్ట్‌లతో మళ్లీ అటు వైపు వెళ్లడం కుదరలేదు. ప్రస్తుతం ‘జీ తెలుగు’లో ప్రసారమవుతున్న ‘మిఠాయి కొట్టు చిట్టెమ్మ’ సీరియల్‌ చేస్తున్నా. ఇందులో నాది ‘చిట్టెమ్మ’ పాత్ర. గతంలో నటించిన వాటి కంటే చాలా భిన్నమైనది. అంతా కాకినాడ యాసలో సాగుతుంది. అంతకముందు ఎప్పుడూ, ఏ పాత్రకూ హోమ్‌వర్క్‌ చేయలేదు. కానీ ‘చిట్టెమ్మ’గా మెప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రఫ్‌ కేరెక్టర్‌. కొంచెం డీగ్లామర్‌గా కూడా ఉంటుంది. కథ విషయానికి వస్తే చిట్టెమ్మ మిఠాయి కొట్టు ఓనరు. అమ్మ, నాన్న, మిఠాయి కొట్టు... ఇవే ఆమె జీవితం. అలాంటి అమ్మాయి రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకొనే కాంతమ్మకు కోడలవుతుంది. బంధాలే ప్రపంచంగా బతుకుతున్న చిట్టెమ్మ... కాంతమ్మ ఇంట్లో ఎలా నెట్టుకొచ్చిందన్నదే కథాంశం. 


ఇప్పటికీ అలాగే పిలుస్తారు... 

తెలుగుతోపాటు తమిళంలో కూడా ఒక ప్రాజెక్ట్‌ చేస్తున్నా. దీంతో హైదరాబాద్‌- చెన్నైల మధ్య ప్రయాణాలు ఎక్కువయ్యాయి. అలసటగా అనిపించినా... ప్రేక్షకుల అభినందనలు చూడగానే కొత్త ఉత్సాహం వస్తుంది. నా బడలిక అంతా పోయిన అనుభూతి కలుగుతుంది. మొత్తంగా ఇది నా ఆరో సీరియల్‌. అయితే అంజనా శ్రీనివాస్‌ అనగానే గుర్తుకు వచ్చే పాత్ర ‘పున్నాగ’. ‘గోరంత దీపం’ తరువాత చేసిన ప్రాజెక్ట్‌ అది. ఇప్పటికీ బయట కనిపిస్తే చాలామంది ‘పున్నాగ’ అని పిలుస్తుంటారు. 


మళ్లీ ఆ పరిస్థితి రాలేదు... 

కెరీర్‌లో ఇబ్బందులనేవి ఎవరికైనా సహజమే. ఆరంభంలో నాకూ అనుభవమే. కన్నడలో నా మొదటి సీరియల్‌ చేస్తున్నప్పుడు సంగతి ఇది. ‘ఈ అమ్మాయికి నటన రాద’నే లాంటి కామెంట్స్‌ సెట్‌లో చాలా ఎదుర్కొన్నాను. దాదాపు రెండేళ్లు ఆ ప్రాజెక్ట్‌లో ఉన్నాను. నాపై విసుక్కోవడం, చికాకుపడడం తప్ప ఆ రెండేళ్లలో ఒక్కసారి కూడా ‘బాగా చేశావ’ని ఎవరూ అనలేదు. అయితే వాటిని నేను పాజిటివ్‌గా తీసుకున్నాను. నేర్చుకోవడానికి ఒక స్కూల్‌గా భావించాను. ఎంతో నేర్చుకున్నాను. కష్టపడడం అలవాటు చేసుకున్నాను. ఆ తరువాత ఎప్పుడూ అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు.’’ 


                                                                                                            హనుమాచేసుకొంటూ పోవడమే...

మొదట్లో సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. తెలుగులో ‘మామ మంచు అల్లుడు కంచు’, ‘మల్లిగాడు మ్యారేజ్‌ బ్యూరో’ చిత్రాల్లో నటించాను. కన్నడలో కూడా ఒకటి చేశాను. ప్రస్తుతం బిజీ షెడ్యూల్స్‌ వల్ల సినిమాల వైపు వెళ్లడంలేదు. అంతేకాదు తీరిక లేక నా అభిరుచులు, పనులు కూడా పక్కన పెట్టేయాల్సివచ్చింది.  నాకు కలలు, లక్ష్యాలంటూ లేవు... ఉండవు. భవిష్యత్తు గురించి ఆలోచించను. ముందుగా ప్రణాళికలు వేసుకోను. వచ్చింది చేసుకొంటూ వెళ్లిపోతానంతే.

Advertisement
Advertisement