Abn logo
Jun 19 2021 @ 21:00PM

నాన్నకు ప్రేమతో..

నేడు ఫాదర్స్‌ డే!మనమెరిగిన తొలి నేస్తం నాన్న. మన చేతలకు చేయూతనిచ్చి.. ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నా నీ వెంట నేనున్నానంటూ అండగా నిలబడే ధైర్యం నాన్నే.  లక్ష్యం వైపు దూసుకెళ్లే బాణం మనం అయితే దానిని నడిపించే విల్లే నాన్న. మన కోసం జీతాన్ని కాదు జీవితాన్నే అంకింతం చేసేది నాన్న. మన భవిష్యత్తు కోసం అనుక్షణం తపించి శ్రమించే రూపం నాన్న. కాఠిన్యపు ముసుగు తొడిగిన కరుణామయుడు నాన్న. తన బిడ్డల క్షేమం కోసం తను శిలువ ఎక్కడానికి సైతం వెనుకాడని త్యాగశీలి నాన్న.. 

ఏ రెండు అక్షరాలయితే మనకు తెలియని ధైర్యాన్ని ఇస్తాయో.. ఏ అడుగులు మనకు జీవితకాలం తోడుగా ఉండే స్నేహంగా మిగులుతాయో, ఏ పిలుపు మనలో కుంగుబాటును పారద్రోలి కొత్త ఉత్సాహాన్నిస్తుందో, ఏ రూపు మనకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందో.. దానిపేరే నాన్న. అలాంటి నాన్నలకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, మన కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తుకు తెచ్చుకోవడానికి ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా తండ్రుల దినోత్సవం (ఫాదర్స్‌ డే) సంబరాలు జరుపుకొంటున్నారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాలలో ఉన్న  మహిళా అధికారులు తమ మనోభావాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.కనిపించని దైవం తండ్రి 


తండ్రి అంటే కనిపించని దైవం. మా నాన్నకు ఇద్దరు పిల్లలం. నేను నా సోదరుడు. చిన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య తారతమ్యం లేకుండా పెంచారు. ఆడిపల్లనైనా అన్ని రంగాల్లో రాణించాల్సిందేనని ప్రోత్సాహం అందించి నన్ను ఈ స్థాయికి ఎదిగేందుకు మా తండ్రే ప్రధాన కారకుడు.  ధైౖర్యం, క్రమశిక్షణలను ఆయన చిన్ననాటి నుంచే నేర్పారు. అలాగే నా పేరులోనూ మా నాన్న పేరు కలిసి ఉంటుంది.  ఆయన పేరు పార్థసారధి.. నా పేరు పార్థసుశీల. మా నాన్న అంటే నాకు అత్యంత గౌరవం. 

- సుశీల, జడ్పీ సీఈవో 


మా నాన్నే స్ఫూర్తి


మాది చిత్తూరు జిల్లా పుంగనూరు. మా తల్లిదండ్రులకు నా సోదరుడు, నేను ఇద్దరమే. చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను అన్నివిధాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆయన స్ఫూర్తితోనే ఈ స్థాయికి ఎదిగాను. ప్రతి ఫాదర్స్‌ డేకి ఎక్కడ ఉన్నా నేను మా నాన్నకు గిఫ్ట్‌ పంపడం అలవాటు. అలాగే నా బర్త్‌డేకు ఆయన గిఫ్ట్‌ పంపడం ఆనవాయితీ. అయితే కరోనా కాలంలో ఫాదర్స్‌డేని తండ్రి వద్ద ఉండి చేయకపోవడం ఒక్కటే బాధాకరం. 

- ధనలక్ష్మి, డీపీవో నాన్న ప్రోత్సాహంతోనే...


నేను గ్రూప్‌-1లో మంచి ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక కావడానికి నాన్న ప్రోత్సాహం ఎంతో కీలకం. వృత్తిరీత్యా నాన్న వెటర్నరీ డాక్టర్‌. ప్రస్తుతం ఏడీగా ఉన్నారు. అడ్మినిస్ర్టేషన్‌ అంటే  ఆయనకెంతో ఇష్టం. ఆయన ప్రోత్సాహంతో నేను ఎటువంటి కోచింగ్‌ తీసుకోకుండా ఇంటి వద్దనే ఉండి ప్రిపేరయ్యాను. ఎంత ఒత్తిడిలో ఉన్నా ప్రతి నిత్యం నాన్నతో మాట్లాడతా. ఉద్యోగ రీత్యా నాకు ఏవైనా సందేహాలు ఉన్నా నాన్నతో మాట్లాడి సలహాలు తీసుకుంటుంటా. నా ఉన్నత స్థితికి కారణమైన నాన్న అంటే ప్రాణం. సంవత్సరంలో ఒకరోజు కాదు.. ప్రతినిత్యం ఫాదర్స్‌డేనే.

- చైత్ర వర్షిణి, ఆత్మకూరు ఆర్డీవోనాలో ధైర్యం నింపారు!


మా నాన్నేగారే నాలో ధైర్యం నింపారు. టీచరు వృత్తిలో ఉన్న ఆయన నైతిక విలువలు నేర్పించారు. ఆడపిల్ల అనే  భేదం చూపించకుండా ఉన్నత చదువు చదివించారు. తండ్రి చూపించిన దారే నన్ను ఈ స్థాయిలో నిలిపింది.

- కేఎం రోజ్‌మండ్‌, ఐసీడీఎస్‌ పీడీ