Advertisement
Advertisement
Abn logo
Advertisement

కన్నతండ్రే కాటేయబోయాడు!

పదేళ్ల కూతురిపై లైంగిక వేధింపులు 

ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీసులకు తల్లి ఫిర్యాదు 

పరారీలో నిందితుడు 


ఖమ్మం : కంటిరెప్పలా కాపాడుకోవాల్సిన వాడే కన్నేశాడు. పదేళ్ల కూతురికి తండ్రి ప్రేమను పంచాల్సిన వ్యక్తే మానవత్వం మరిచి కాటేయబోయాడు. అభం శుభం తెలియని చిన్నారిపై తండ్రే లైంగిక వేధింపులకు పాల్పడిన అమానవీయ సంఘటన ఖమ్మం నగరంలో జరిగింది. బాలిక తల్లి మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగర పరిధిలోని గొల్లగూడేనికి చెందిన ఓవ్యక్తి ఇళ్లలో కరెంటు పనులు చేస్తూ ఉంటాడు. అతడికి నగరానికి చెందిన ఓ మహిళతో 13ఏళ్ల క్రితం వివాహం కాగా.. వారికి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత మనస్పర్థలు రావడంతో ఐతేళ్ల క్రితం విడిపోయారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆడపిల్లల్లో పదేళ్ల పెద్ద కుమార్తె తండ్రి దగ్గర, చిన్న కూతురు తల్లి దగ్గర ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి పెద్ద కూతురు తన తండ్రి వద్దే ఉంటూ గొల్లగూడెంలోని ఓస్కూల్‌లో 4వతరగతి చదువుతోంది.


ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆ తండ్రి తన దగ్గర ఉంటున్న కూతురిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఆ వేధింపులు తట్టుకోలేక పోయిన ఆ చిన్నారి తన వరుసకు అత్త అయిన మహిళకు విషయం చెప్పగా.. ఆమె టేకులపల్లిలో నివాసం ఉంటున్న బాలిక తల్లికి ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో మంగళవారం రాత్రి తల్లి తన బంధువులను తీసుకుని గొల్లగూడెం వెళ్లగా.. అప్పటికే విషయం తెలుసుకున్న తండ్రి తరపు బంధువులు.. ఆ చిన్నారిని తీసుకొని గొల్లగూడెం ఉరి శివారుకు తీసుకొచ్చి తల్లి, ఆమె బంధువులకు అప్పగించారు. వారు ఆ చిన్నారిని విషయం గురించి ఆరా తీయగా.. చెప్పుకోలేని విధంగా తన తండ్రి ప్రవర్తించిన వేధింపుల గురించి ఆ బాలిక వారికి వివరించింది. వెంటనే వారు ఖమ్మం ఖనాపురం హవేలి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సీఐ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడైన ఆ బాలిక తండ్రి పరారీలో ఉన్నట్టు తెలిసింది.

Advertisement
Advertisement