రైతుల నిరసనకు మద్ధతు
చండీఘడ్ (పంజాబ్): కొత్త కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు పంజాబీ గాయకుడు, నటుడు హర్భజన్ మన్ సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శిరోమణి పంజాబీ అవార్డును తాను తిరస్కరిస్తున్నట్లు హర్భజన్ ప్రకటించారు. పంజాబ్ భాషా విభాగం గురువారం సాహిత్యరత్న, శిరోమణి అవార్డులను హర్భజన్ కు ప్రకటించింది. ‘‘నేను శిరోమణి అవార్డుకు ఎంపికైనందుకు కృతజ్ఞుడను, అయినప్పటికీ పంజాబ్ భాషా విభాగం నుంచి శిరోమణి అవార్డును నేను అంగీకరించలేను. ప్రజల ప్రేమ నా కెరీర్లో అతిపెద్ద అవార్డు, ప్రస్తుతం మనం శాంతియుత రైతుల నిరసనకు మద్ధతు ఇవ్వాలి’’అని హర్భజన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. పలువురు పంజాబీ గాయకులు, కళాకారులు రైతుల ఆందోళనకు మద్ధతు ఇస్తున్నారు. హర్భజన్ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలో పాల్గొన్నారు.