Abn logo
Nov 25 2021 @ 03:16AM

వడ్లకు మొలకలు.. గుండెకు చిల్లులు!

  • వడ్లకు మొలకలు.. గుండెకు చిల్లులు! 
  • తడిసిన ధాన్యంతో దిక్కుతోచని స్థితిలో రైతులు
  • సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో వర్షం
  • తడిసిపోయిన 8వేల బస్తాల ధాన్యం 
  • సమస్యలను అధిగమించి ప్రతి గింజా కొనాలి.. 
  • డబ్బులను రైతుల ఖాతాల్లో వెంటనే జమచేయాలి
  • అన్నదాతలకు మద్దతుగా కాంగ్రెస్‌ ఆందోళనలు
  • అప్పుల బాధతో భూపాలపల్లిలో రైతు ఆత్మహత్య


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : వానలు తగ్గినా అన్నదాతల వెతలు తగ్గడంలేదు. ఎండొస్తలేదు.. ఆపై మంచు అదేపనిగా కురుస్తుండటంతో తడిసిన ధాన్యం ఆరడం లేదు. పైగా ఆ వడ్లు మొలకలొస్తున్నాయి! మంచి దిగుబడొచ్చిందన్న ఆశతో కొనుగోలు కేంద్రాలకు పంటతో వచ్చిన రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, తడిసిన వడ్లు మొలకలొస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కాగా బుధవారం భారీ వర్షం పడటంతో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని వ్యవసాయ మార్కెట్‌, కొనుగోలు కేంద్రాల్లో 8వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. మరోవైపు ధాన్యం కొనుగోళ్ల పరంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి.. కొనుగోళ్లలో వేగం పెంచాలని.. ఈ వానాకాలంలో పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో అన్నదాతలకు మద్దతుగా బుధవారం కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కొన్నిచోట్ల రహదారులపై ధర్నా చేపట్టా రు.  అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. కాగా, భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం బంగ్లాపల్లి గ్రామంలో రూప్‌సింగ్‌ (30) అనే యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూప్‌సింగ్‌ ఐదెకరాలను కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి పంటలు వేశాడు. పెట్టుబడికే రూ.8లక్షల అప్పు అయింది. దిగుబడి రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలనే బెంగతో ఆందోళన చెంది మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. పరకాలలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. 

దంపతులకు ఎంత కష్టం 

సిద్దిపేట జిల్లా ముండ్రాయికి చెందిన లక్ష్మయ్య-నర్సవ్వ దంపతులు. 8 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట వేశారు. కల్లం అయ్యాక వర్షం పడింది. ఒకసారి కాదు.. మూడుసార్లు పడింది. తడిసిన ధాన్యం ఆరడం లేదు. 15 రోజులుగా ధాన్యాన్ని ముండ్రాయి శివారులో గల రోడ్డుపై ఆరబోస్తున్నారు. ధాన్యం ఎప్పుడు ఆరుతుందో తెలియక రోడ్డు పక్కనే ఓ గుడారం వేసుకొని కాపలాగా ఉంటున్నారు.