Abn logo
Dec 2 2020 @ 00:30AM

రైతు మునిగిపోయాడు..!

వర్షానికి తడిసి మోసులు వచ్చిన వరిని చూపుతున్న మహిళారైతు సువార్తమ్మ

తుఫాన్‌ వల్ల 1.37 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు

మరో 5,021 హెక్టార్లలో ఉద్యాన పంటలు


స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ ప్రకారం నష్టం అంచనా రూ.164.63 కోట్లు

వాస్తవానికి ఎకరాకు రూ.75 వేల చొప్పున నష్టం రూ.2,768 కోట్లు

ఎకరాకు ప్రభుత్వ పరిహారం రూ.6,500లోపే

రూ.25 వేలు ఇవ్వాలని అన్నదాత విన్నపం


మట్టిని నమ్ముకున్న కష్టజీవులు నివర్‌ తుఫాన్‌ దెబ్బకు కోలుకోలేని నష్టం చవిచూశారు. చేతికొచ్చి వచ్చిన పంటలు ఇల్లు చేరకుండానే కళ్లముందే నీటిపాలయ్యాయి. వరి రైతుల పరిస్థితి మరీదారుణం. ఒక్క గింజ కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. పొలంలో ఎటు చూసినా నీళ్లు. రైతు కళ్లలో కన్నీటి వరద. 1.42 లక్ష హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ మేరకు రూ.164.63 కోట్లు నష్టం జరిగిందని అధికారుల అంచనా. అయితే.. పెట్టుబడి దిగుబడి రూపంలో రూ.2,768 కోట్లు కోల్పోయామని కష్టజీవుల వేదన. ఎకరాకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు దిగుబడి నష్టపోతే సర్కారు ఇచ్చే సాయం రూ.6,500లోపే. పిసరంత సహాయంతో పెట్టుబడి అప్పులు తీర్చేదెలా..? ఏ రైతును కదిపినా నివర్‌ తుఫాన్‌కు మించిన కన్నీటి వరద.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటివల మూడు రోజులుగా ఎడతెరిపిలేని తుఫాన్‌ రైతులను అప్పుల వరదలో ముంచేసింది. కోలుకోని దెబ్బతీసింది. ఏఒక్క గ్రామంలోనో కాదు 913 గ్రామాల్లో కష్టజీవుల వ్యథలు అక్షరాలకందని వేదన. జిల్లాలో వ్యవసాయ పంటలు 1.37 లక్షల హెక్టార్లలో పూర్తిగా దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరి, శనగ, వేరుశనగ, పత్తి, కంది పంటలు ఉన్నాయి. స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ ప్రకారం హెక్టారుకు రూ.5,000-15,000 (ఎకరాకు రూ.2,000-6,000)లు  నష్టపరిహారం ఇస్తారు. ఈ లెక్కన రూ.154.66 కోట్లు నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఎకరాకు రూ.25-35 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. రేపోమాపో పంట ఇల్లు చేరుతుంది అనుకుంటున్న సమయంలో నివర్‌ నిలువునా ముంచేసింది. ఎకరాకు రూ.75 వేల నుంచి రూ.లక్షకు పైగా దిగుబడి రూపంలో నష్టపోయామని రైతన్నల ఆవేదనచెందుతున్నారు. సగటున రూ.75 వేల ప్రకారం లెక్కించినా 1.37 లక్షల హెక్టార్ల (3.42 లక్షల ఎకరాలు)కు రూ.2,568 కోట్ల నష్టం జరిగిందని అంటున్నారు. వరి రైతుల పరిస్థితి మరీదారుణం. కోత సమయంలో పైరు నీటిపాలైంది. ఎకరాకు 34 క్వింటాళ్లు దిగుబడి వచ్చేది. 27,225 హెక్టార్ల (68,062.5 ఎకరాలు)కు 23.14 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి కోల్పోవలసి వస్తోంది. ఇందులో 25 శాతం కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని, వర్షానికి తడిసిందని కొనేవారు ముందుకురారని అంటున్నారు.

ఉద్యాన పంటలకు తీరని నష్టం

జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ఈ పంటలను తుఫాన్‌ నిలువునా ముంచింది. 8818 మంది రైతులకు చెందిన 5021.1 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ సాయం అరటికి హెక్టారుకు రూ.20 వేలు, ఇతర పంటలకు రూ.15 వేలు ప్రకటించింది. ఈ లెక్కన 9.97 కోట్లు నష్టం అంచనా వేశారు. వాస్తవంగా అరటి సాగుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల చొప్పున హెక్టారుకు రూ.4 లక్షలు పెట్టుబడి వస్తుంది. దిగుబడి 75-80 టన్నులు వస్తే.. టన్నుకు రూ.10 వేల ప్రకారం రూ.7.5 లక్షలు వస్తుంది. ఇతర ఉద్యానవన పంటలతో హెక్టారుకు రూ.2.5-4 లక్షల దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. ఈ లెక్కన హెక్టారుకు సగటున రూ.4 లక్షల ప్రకారం రూ.200 కోట్లు దిగుబడి కోల్పోవాల్సి వచ్చిందని అన్నదాతల ఆవేదన.  ఈ లెక్కన వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి రైతులు రూ.2,768 కోట్లు నష్టపోయామని అంటున్నారు. అయితే అధికారులు మాత్రం వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి 913 గ్రామాల్లో 1,42,025.28 హెక్టార్లలో పంటలు నీట మునిగి రూ.164.63 కోట్లు నష్టపోయారని నివేదికలు పంపించారు.


ఒక్క గింజా చేతికి రాదు  

- నిమ్మకాయల భరత్‌రెడ్డి, గాలివారిపల్లె, వల్లూరు మండలం

కేసీ కాలువ కింద ఐదు ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరాకు రూ.35 వేల ప్రకారం రూ.1.75 లక్షలు భూమిలో వేశాను. పైరు కోతకు వచ్చింది. మిషన్‌ దొరకకపోవడంతో కోత ఆలస్యం అయింది. ఇంతలో మాయదారి తుఫాన్‌ వచ్చి నిలువునా ముంచింది. ఒక్కగింజ కూడా చేతికి రాదు. నాలుగైదు రోజులు ఆగిఉంటే ఎకరాకు 34 క్వింటాళ్ల చొప్పున 170 క్వింటాళ్ల ధాన్యం ఇంటికి వచ్చేది. క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.1,888 ప్రకారం రూ.3.20 లక్షలు చేతికి వచ్చేది. పెట్టుబడి రూ.175 లక్షలు పోనూ రూ.1.45 లక్షలు మిగిలేది. వ్యాపారులకు ఇచ్చినా క్వింటా రూ.1,350 ప్రకారం రూ.2.30 లక్షలు చేతికొచ్చేది. పెట్టుబడి పోనూ రూ.55 వేలు, తిండిగింజలు మిగిలేవి. సర్వం నీటిపాలైంది. 4 ఎకరాల్లో బుడ్డశనగ నీటిపాలైంది. ఎకరాకు రూ.25 వేలు సాయం చేస్తే కష్టాల నుంచి కొంతైనా గట్టెక్కుతాం. లేదంటే అప్పులపాలే.


తుఫాన్‌కు దెబ్బతిన్న వ్యవసాయ పంటలు (హెక్టార్లు), నష్టం రూ.కోట్లల్లో

----------------------------------------------------------------------------

పంటలు గ్రామాలు విస్తీర్ణం నష్టం విలువ

----------------------------------------------------------------------------

శనగ 173 77,247.1 77.25

మినుము 84 9,989 9.99

పత్తి 58 4,720.4 7.08

పెసలు 59 3,921.5 3.92

వేరుశనగ 68 5,083.2 7.62

సజ్జ 39 1,877.8 1.68

వరి 275 27,225.38 40.84

కంది 49 2,089.2 2.09

ఇతర పంటలు 108 4,850.6 4.19

--------------------------------------------------------------------

మొత్తం 913 1,37,004.18 154.66


కష్టాల మోసులు

ఇటీవల విడవకుండా కురిసిన వానకు పొలాల్లోనే వరి తడిసిపోయి ధాన్యం మోసులు వస్తున్నాయి. జమ్మలమడుగు మండల వ్యాప్తంగా వరితో పాటు పత్తి, వేరుశనగ, తదితర పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మండలంలోని గొరిగెనూరు, ఽధర్మాపురం సమీప గ్రామాలను సందర్శించి జమ్మలమడుగు నియోజకవర్గంలో తుఫాన్‌తో నష్టపోయిన ఈక్రాప్‌ లేనివారిని సైతం గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అయితే గొరిగెనూరు, ధర్మాపురం గ్రామాల్లో ఈ-క్రాప్‌ లేనివారిని అధికారులు గుర్తించడంలేదని రైతు దేవానంద్‌, సువార్తమ్మ వాపోయారు. దీంతో తాము చేసేదిలేక పొలంలో తడిసిపోయిన వరి ధాన్యపు చెత్తను రోడ్డుపై తెచ్చి ఆరబోస్తున్నామని చెప్పారు. అధికారులు తమ ప్రాంతానికి వచ్చినా సచివాలయ సిబ్బంది మాత్రం రావడం లేదని వాపోయారు. ఈ విషయంపై జమ్మలమడుగు వ్యవసాయాధికారి చంద్రశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా సంబంధిత ఉద్యోగిని అక్కడికి పంపించి గుర్తిస్తామన్నారు. ఇప్పటికే సమీప గ్రామాల్లో నష్టపోయిన రైతులకు సంబంధించి రిపోర్టు తయారు చేశామన్నారు.

- జమ్మలమడుగు రూరల్‌

Advertisement
Advertisement
Advertisement