Abn logo
Sep 22 2021 @ 01:01AM

వామ్మో.. వలంటీర్లు!

వలంటీర్ల బాధితులు

పేదల ఖాతాల నుంచి వలంటీర్ల దోపిడీ!

పోలీసుల అదుపులో ఇద్దరు వలంటీర్లు


కలికిరి(చిత్తూరు): కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ పల్లెల్లవారిపల్లెకు చెందిన ఒక మహిళ ఖాతా నుంచి రూ.3,300 ఒక గ్రామ వలంటీరు కొల్లగొట్టిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఒక వలంటీరుకే పరిమితం కాకపోవచ్చని ఒకరికి ఒకరు తోడై ఈ అక్రమాలకు పాల్పడి వుండొచ్చన్న ఆంధ్రజ్యోతి అంచనా వాస్తవమైంది. పత్తేగడ పంచాయతీలోనే ప్రస్తుతానికి ఇద్దరు వలంటీర్లు ఏకమై ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. అదే విధంగా వలంటీర్ల బారిన పడి మోసపోయిన పేదల సంఖ్య కూడా పెరిగింది. ఇందిరమ్మ భర్త రాజన్న ఒక్కరే సోమవారం ఫిర్యాదు చేయగా మంగళవారం మరో ఐదుగురు జత కలిశారు. అనుమానం వచ్చిన వారు మంగళవారం బ్యాంకులకు వెళ్ళి తమ ఖాతాల్లో లావాదేవీలను పరిశీలించుకుని స్టేట్‌మెంట్లు తెచ్చుకున్నారు. ఇందులో వలంటీరు నవకుమార్‌ అక్రమాల కారణంగా డబ్బు కోల్పోయిన వారు లబోదిబోమని పోలీసు స్టేషనుకు చేరారు. కుక్కలొడ్డుకు చెందిన సులోచన ఖాతా నుంచి వలంటీరు నవకుమార్‌ రూ.16,500 కొల్లగొట్టాడు. మూడు దఫాలుగా ఆమె బయోమెట్రిక్‌ వేలి ముద్రలు వేయించుకుని ఈ డబ్బు డ్రా చేసి తన ఖాతాలోకి మళ్ళించాడు.


పల్లెల్లవారిపల్లెకు చెందిన పి.వీరమ్మ ఖాతా నుంచి రూ.3000, పి.నాగరాజు ఖాతా నుంచి రూ.28000, ఆయన భార్య రెడ్డెమ్మ ఖాతా నుంచి రూ.7000, కోడలు నిర్మల ఖాతా నుంచి రూ.2000 వంతున తీసేశారు. ఈ వ్యవహరాల్లో మరో వలంటీరు పూజారి చలపతి ప్రమేయం కూడా వున్నట్లు గుర్తించారు. కొన్ని ఖాతాల నుంచి చలపతి ఖాతాలో జమయినట్లు తేలింది.అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఖాతా నుంచి భారీగా వలంటీర్లు తస్కరించారని కూడా తేలింది. అయితే ఈ వ్యవహారం ఫిర్యాదుల వరకూ వెళ్ళకుండా స్థానికంగా సర్దుబాటు చేస్తున్నారంటున్నారు. తన ఖాతాలో డబ్బు దోచేయడమే కాకుండా మూడు నెలలపాటు వితంతు పింఛను డబ్బు కూడా కాజేసినట్లు సులోచన వాపోయింది. ఆ తరువాత పింఛను రద్దయిపోయిందని చేతులెత్తేసినట్లు సులోచన కన్నీటిపర్యంతమయ్యింది. ఈ అక్రమ వ్యవహారాల్లో ఇంకా ఎంత మంది వలంటీర్లు ముఠా కట్టారన్న విషయం తేలాల్సి వుంది.నెల రోజులుగా జిల్లాలో సంచలనాత్మకమైన కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రూ.కోట్లలో పక్కదారి పట్టిన విధంగానే అచ్చుగుద్దినట్లు వలంటీర్లు కూడా వ్యవహారాలు నడిపినట్లు విదితమవుతోంది.


జనవరి నుంచే వీరు ఒక యాప్‌ ద్వారా ఈ విధమైన అక్రమాలకు పాల్పడ్డట్టు భావిస్తున్నారు. అయితే గ్రామాల్లోని పేదలకు చెందిన ఖాతాల్లో దాచుకున్న చిన్న చిన్న మొత్తాలను విడతల వారీగా డ్రా చేయడంతో అక్రమాలను బాధితులు వెంటనే గుర్తించలేకపోయారు. కాగా వలంటీర్ల అక్రమాలు వెలుగులోకి రావడంతో మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకోవడానికి అప్రమత్తమవుతున్నారు.


పోలీసుల అదుపులో ఇద్దరు వలంటీర్లు

వలంటీరు చేతి వాటంపై పోలీసులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. ఉదయమే సీఐ నాగార్జున రెడ్డి కలికిరి స్టేషనుకు చేరుకుని పూర్వాపరాల గురించి ఆరా తీశారు. ఎంపీడీవో వెంకటేశులును కూడా విచారించారు. బయోమెట్రిక్‌ వేలి ముద్రలు లబ్ధిదారుల నుంచి ఏఏ సందర్భాల్లో వలంటీర్లు తీసుకుంటారు, వాటిని ఎలా వినియోగించుకుంటారన్న అంశాలపై వివరాలు రాబట్టారు.ఎస్‌ఐ లోకేష్‌ రెడ్డి గ్రామానికి వెళ్ళి ఇద్దరు వలంటీర్లను స్టేషనుకు తీసుకొచ్చారు.విచారణలో వలంటీర్లు మంచూరి నవకుమార్‌, పూజారి చలపతి అక్రమాలను అంగీకరించారని తెలిసింది. ఇంకా ఎంత మంది ఈ వ్యవహారాల్లో వున్నారు, ఎన్ని ఖాతాల నుంచి కొల్లగొట్టారన్న వివరాల కోసం వివిధ కోణాల్లో సీఐ విచారణ చేపట్టారు. మరో వైపు ఎంపీడీవో వెంకటేశులు   మంగళవారం వలంటీరు నవకుమార్‌కు నోటీసు జారీ చేశారు. 24 నాలుగు గంటల్లోగా ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని, లేదంటే ఉద్యోగం నుంచి తొలగించినట్లుగా భావించాలని నోటీసులో పేర్కొన్నారు.   

 

కొటాలలోనూ ఇదే తంతు

ఇద్దరు గ్రామ వలంటీర్ల వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే పత్తేగడ పంచాయతీ కొటాల గ్రామంలో కూడా కొందరు వలంటీర్లు అక్రమాలకు పాల్పడతున్నట్లు ఆరోపణలొచ్చాయి. కొటాలకు చెందిన ఒక మహిళ ఖాతా నుంచి ఆమెకు తెలియకుండా రూ.9000 డ్రా చేసినట్లు తెలుస్తోంది. అయితే స్థానికంగా ఆ మహిళతో సర్దుబాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ గ్రామంలో ముగ్గురు వలంటీర్లు మొత్తం జనాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని భయాందోళనలకు గురి చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల 12మందిని చేయూత పథకానికి అనర్హులను చేయడం, కొంతమంది పింఛన్లు రద్దు చేయడంతో వలంటీర్ల అక్రమాలపై పెదవి విప్పడానికి స్థానికులు భయపడుతున్నారంటున్నారు. ఏ మాత్రం ఫిర్యాదు చేసినా పథకాలను రద్దు చేస్తామని బెదిరిస్తున్నట్లు వాపోతున్నారు. కొంత మంది వలంటీర్ల అక్రమాలు బహిర్గతం కావడంతో కొటాలలో కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చారు. ఈ-కేవైసీ చేయడానికి తమ వద్ద నుంచి రూ.600 వంతున వలంటీర్లు వసూలు చేశారని మంగళవారం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా ప్రతి నెలా పింఛనుదార్ల నుంచి రూ.200వంతున వసూలు చేస్తున్నట్లు గ్రామానికి చెందిన జె.వెంకట్రమణ, పి.వి.రమణ ఫిర్యాదు చేశారు. చేయూత పథకాల రద్దులో 12 మందికి జరిగిన అన్యాయంపై విచారణ పూర్తి చేసి జిల్లా అధికారులకు నివేదిక సమర్పించినట్లు ఎంపీడీవో వెంకటేశులు తెలిపారు. వీరందరికీ చేయూత అందుతుందని చెప్పారు.