Abn logo
Oct 24 2020 @ 05:27AM

బతుకమ్మ, దసరాకు విస్తృత ఏర్పాట్లు

Kaakateeya

బల్దియా ఆధ్వర్యంలో వేడుకలు 

రేపు అంబేద్కర్‌ స్టేడియంలో రామ్‌లాలా, సంస్కాతిక కార్యక్రమాలు, లేజర్‌ షో 

ఏర్పాట్లను పరిశీలించిన మేయర్‌ వై.సునీల్‌రావు 


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 23: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం జరిగే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విలీన గ్రామాలు, శివారు కాలనీలతో కలిపి 60 డివిజన్లలోని ముఖ్య కూడళ్లలో బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా మైదానాలను ఏర్పాటు చేశారు. నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతి బతుకమ్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు 15, 16 ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో కూడా మైదానాలను, బారికేడ్లను, లైటింగ్స్‌ను, మంచినీటి వసతితోపాటు కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన సహాయక బృందాలను కూడా అక్కడ అందుబాటులో ఉంచు తున్నారు. కరీంనగర్‌ టూటౌన్‌ ప్రాంతంలోని భగత్‌నగర్‌, సప్తగిరికాలనీ, శ్రీనగర్‌కాలనీ, గౌతమీనగర్‌, కట్టరాంపూర్‌, కోతిరాంపూర్‌, మార్కండేయనగర్‌, రాంనగర్‌, పద్మనగర్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఎల్‌ఎండీలో నిమజ్జనం చేసేందుకు మార్కండేయనగర్‌, గౌతమీనగర్‌లలో నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేశారు. అలాగే జ్యోతినగర్‌, భాగ్యనగర్‌, సంతోష్‌నగర్‌, మంకమ్మతోట, రాంనగర్‌, విద్యానగర్‌, కొత్తయాస్వాడ, శ్రీహరినగర్‌, నవీనకుర్మవాడ తదితర ప్రాంతాల వారు చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. 18,19 డివిజన్‌ పరిధిలోని ప్రాంతాల వారు రేకుర్తి పెంటకమ్మ చెరువు వద్ద నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆరెపల్లి, సీతారాంపూర్‌, బ్యాంకుకాలనీ, వావిలాలపల్లి, తీగలగుట్టపల్లి, సరస్వతీనగర్‌ ప్రాంతాలకు చెందిన వారు ఆయా ప్రాంతాల్లోని చెరువుల్లో వేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సుభాష్‌నగర్‌, అంబేద్కర్‌నగర్‌, విద్యారణ్యపురి, కిసాన్‌నగర్‌, కార్ఖానగడ్డ, గాంధీరోడ్డు తదితర ఆయా ప్రాంతాలకు చెందిన వారు కిసాన్‌నగర్‌లోని గార్లకుంట చెరువులో నిమజ్జనం చేసేందుకు, పాతబజార్‌, టవర్‌సర్కిల్‌, కమాన్‌, బోయవాడ, హౌసింగ్‌బోర్డుకాలనీ, గణేశ్‌నగర్‌, లక్ష్మినగర్‌, కోతిరాంపూర్‌, అల్గునూర్‌ తదితర ప్రాంతాల వారు మాండవ్యనదీతీరం, మానకొండూర్‌ చెరువులో బతుకమ్మల నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 


దసరా వేడుకలకు అంబేద్కర్‌ స్టేడియం ముస్తాబు 

తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశాలతో తొలిసారిగా నగర మేయర్‌ వై.సునీల్‌రావు ఆధ్వర్యంలో, కమిషనర్‌ వల్లూరి క్రాంతి పర్యవేక్షణలో దసరా వేడుకలను అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగే దసరా వేడుకలకు స్టేడియం ముస్తాబైంది. మైదానం శుభ్రం చేసి ఇటీవల కురిసిన వర్షాలకు ఏర్పడ్డ గుంతలను పూడ్చి వేదిక ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమయ్యే రామ్‌లీలా కార్యక్రమంలో భాగంగా ముందుగా బతుకమ్మ, దసరా పండుగల సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించే విధంగా లేజర్‌షో, క్రాకర్‌షోతో కనువిందు చేయడంతో పాటు పాటలతో అలరించేందుకు సౌండ్‌బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత భారీ రావణాసురుడి బొమ్మను టపాసులతో పేల్చివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతితో కలిసి దసరా వేడుకల ఏర్పాట్లపై చర్చించి సలహాలు, సూచనలు ఇచ్చారు. మేయర్‌ వై.సునీల్‌రావు రెండు రోజులుగా స్టేడియంలో జరుగుతున్న పనులను కమిషనర్‌తో కలిసి పరిశీలించారు. కరోనా వైరస్‌ పూర్తిగా తొలిగిపోనందున ప్రజలు విధిగా మాస్కులు ధరించి రావాలని, భౌతిక దూరం పాటించాలని, సానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవాలని మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం సద్దుల బతుకమ్మ, ఆదివారం విజయదశమి దసరా పండుగలను ఘనంగా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. 

Advertisement
Advertisement