Abn logo
Sep 15 2021 @ 00:19AM

‘నీట్’ నుంచి నిష్క్రమణ

వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహిస్తున్న జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’ (జాతీయ ప్రవేశ, యోగ్యతా పరీక్ష) నుంచి తమిళనాడును మినహాయిస్తూ, ఆ రాష్ట్ర శాసనసభ సోమవారం నాడు తీర్మానించింది. ఆ మేరకు ఒక బిల్లును భారతీయ జనతాపార్టీ సభ్యులు మినహా తమిళనాడు శాసనసభ అంతా ఆమోదించింది. ఈ బిల్లును గవర్నర్ ఆమోదించడం, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం జరిగితే తమిళనాడు ‘నీట్’ పరిధి నుంచి బయటపడుతుంది. ఫలితం, పర్యవసానం ఎట్లా ఉన్నప్పటికీ, డిఎంకె ప్రభుత్వం నీట్ వ్యతిరేక బిల్లును అసెంబ్లీ చేత ఆమోదింపచేసి మరొక ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చిన ఘనత సాధించడమే కాక, చల్లారిందనుకున్న ‘నీట్’ చర్చను మరొకసారి వేదిక మీదకు తెచ్చింది. 


జాతీయస్థాయి పరీక్ష వివిధ రాష్ట్రాల విద్యార్థులకు అన్యాయం చేస్తుందన్నది ‘నీట్’ ప్రతిపాదన మొదలైన పదేళ్ల నుంచి విమర్శకుల వాదన. రాష్ట్రాలలో విద్యారంగ పరిస్థితులు, పాఠ్యప్రణాళికలు వేరువేరుగా ఉన్నాయి. అందరికీ కలిపి ఒకే పరీక్ష, ప్రాంతాలవారీగా అన్యాయం చేయడమే కాకుండా, సామాజిక న్యాయాన్ని కూడా భంగపరుస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమయింది. 2013లో మొదటిసారి నీట్ పరీక్ష నిర్వహణ జరిగినప్పుడు, ఇంగ్లీషు, హిందీ భాషలలో సమాధానాలు రాయడానికి అనుమతించారు. తరువాత వ్యక్తమైన అభ్యంతరాల రీత్యా వివిధ ప్రాంతీయ భాషలను కూడా అనుమతించారు. ఇంతలో, దేశ అత్యున్నత న్యాయస్థానం ‘నీట్’ ప్రతిపాదననే కొట్టివేసింది. తరువాత 2016లో ప్రత్యేక బెంచ్ భిన్నమయిన నిర్ణయాన్ని చెప్పింది. అంతిమంగా నిర్ణయించేవరకు నీట్ చెల్లుబాటు అవుతుందని నిర్ధారించింది. నిజానికి 2016 నుంచి మాత్రమే ‘నీట్’ నిర్వహణ జరుగుతూ వస్తోంది. మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి. అన్నాడిఎంకె కూడా నీట్‌పై వ్యతిరేకత చెబుతూ వచ్చింది. కానీ, ఆచరణలో 2016 నుంచి పరీక్షను అనుమతిస్తూ వచ్చిందని డిఎంకె నేతల విమర్శ. 


మొదటిసారి నీట్ నిర్వహణ సందర్భంగానే షణ్ముగం అనిత అనే దళిత విద్యార్థిని ఆత్మహత్య దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. రోజుకూలీ చేసుకునే తల్లిదండ్రుల కుమార్తె అయిన అనిత, రాష్ట్ర బోర్డు పరీక్షలలో 1200 మార్కులకు గాను, 1176 మార్కులు సాధించింది కానీ ‘నీట్’ దాటలేకపోయింది. ఈ జాతీయ పరీక్ష, వివిధ ప్రాంతీయ ఆకాంక్షలకు, సామాజికార్థిక శ్రేణులకు వ్యతిరేకమైనదన్న వాదన అప్పుడే బలం పుంజుకున్నది. ఆ తరువాత కూడా ప్రతి ఏటా నీట్ పరీక్షల కాలంలో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఆదివారం నాడు ‘నీట్’ పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందు తమిళనాడులో ధనుష్ అనే ఒక గ్రామీణ పరీక్షార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ కార్మికుని కుమారుడు అతడు. మునుపు రెండుసార్లు విఫలమై, మూడోసారి హాజరు కావలసిన ఆ యువకుడు, తీవ్రమయిన మానసిక ఒత్తిడిలో ప్రాణం తీసుకున్నాడు. ఈ సంఘటన రాష్ట్రంలో సంచనలం సృష్టించింది. ప్రతిపక్ష అన్నాడిఎంకె, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చడంలో డిఎంకె వైఫల్యాన్ని ఖండించింది. ఈ నేపథ్యంలో, సోమవారం నాడే బిల్లును ప్రవేశపెడతానని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. సోమవారం నాడు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుండగా, అదేరోజు తెల్లవారుజామున కనిమొజి అనే విద్యార్థిని ఆత్మహత్య వార్త వెలువడింది. ఆమె ఆదివారం నాడు నీట్ రాసి వచ్చింది. తనకు పన్నెండో తరగతిలో 93 మార్కులు వచ్చినప్పటికీ, నీట్‌లో ఎంపిక కానేమోనన్న ఆందోళనతో ఉరిపోసుకున్నది. తమిళనాడులో ఇప్పటికి సుమారు 20 మంది ‘నీట్’ ఆత్మహత్యలు జరిగాయి. 


పరిస్థితి ఇట్లాగే కొనసాగితే, మున్ముందు తమిళనాడు లోని గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడానికి వైద్యులే ఉండరని, తీవ్రమైన సంక్షోభం నెలకొంటుందని నీట్ వ్యతిరేక బిల్లులో వ్యాఖ్యానించారు. పన్నెండో తరగతిలో సాధించిన మార్కుల యోగ్యత ఆధారంగా వైద్యవిద్యలో ప్రవేశాలు కల్పించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ‘‘వైద్య విద్యలో అందరికీ సమానావకాశాలు కల్పించడానికి, సామాజిక న్యాయం పాటించడానికి, అణగారిన వర్గాలు ప్రధానస్రవంతి విద్యలో భాగస్వాములు కావడానికి ఈ బిల్లు ఉద్దేశించింది’’  అని ప్రభుత్వం చెప్పుకున్నది. ఉన్నత విద్యలో వివిధ సామాజికవర్గాల ప్రాతినిధ్యాన్ని ‘నీట్’ వ్యతిరేకిస్తుందని కూడా బిల్లులో వ్యాఖ్యానించారు. 


తమిళనాడు ప్రభుత్వం ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయంలో రాజకీయ అవసరం ఎంత ఉన్నది, వాస్తవ దృక్పథం ఎంత ఉన్నదీ చర్చించవలసిందే. ప్రభుత్వం బిల్లును ఆమోదింపజేసినంత మాత్రాన రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి సానుకూలంగా స్పందిస్తారని లేదు. ఉన్నత న్యాయస్థానం మొదట ఒకసారి ‘నీట్’ను వ్యతిరేకించి, తరువాత తాత్కాలిక అనుమతి ఇచ్చింది కాబట్టి, సూత్రప్రాయంగా ‘నీట్’ భావన వివాదాస్పదమని న్యాయవ్యవస్థ కూడా అంగీకరిస్తుంది. మొత్తంగా జాతీయస్థాయి ప్రవేశపరీక్షపై అత్యున్నత న్యాయస్థానం అంతిమ అభిప్రాయం ఇంకా చెప్పవలసే ఉన్నది. ఇదే సాహసం, తమిళనాడు ప్రభుత్వం నీట్ ప్రవేశపరీక్ష జరగడానికి కొన్ని రోజుల ముందు చేసి ఉంటే ఎట్లా ఉండేది? ఇప్పుడు బిల్లుకు అన్ని ఆమోదాలు లభిస్తే, ఈ ఏడు ప్రవేశపరీక్ష రాసినవారి సంగతేమిటి? - ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురుచూడవలసిందే. తమిళనాడు తీసుకున్న చర్య, తక్కిన రాష్ట్రాలనూ కూడగడుతుందా అనేది కూడా వేచిచూడవలసిందే.