Abn logo
Aug 3 2021 @ 22:32PM

రుణమాఫీపై కసరత్తు

లోగో

- జిల్లాలో మొత్తం 67,250 మంది రైతులు అర్హులు
-  రెండో విడతలో రూ.50 వేలలోపు మాఫీతో 22వేల మందికి ఊరట
- మొదటి విడతలో 7,042 మందికి ప్రయోజనం

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 3: రెండో విడత రుణమాఫీకి ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో అధికారులు కసరత్తు ప్రారంబించారు.  రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష వరకు పంట రుణ మాఫీ చేయనున్నట్లు ఎన్నికల సమయంలో ప్రక టించింది. అధికారంలోకి వచ్చిన తరువాత తీరా రూ.25 వేలకే పరిమితి విధించి మొదటి విడతగా రుణ మాఫీ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై రైతులు నిరాశ చెందారు. కాగా  ప్రభుత్వం తాజాగా రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను ఆగస్టు 15 నుంచి నెలామాఫీ చేస్తామని ప్రకటించింది.  

ఎన్నికల సమయంలో..
తెలంగాణ రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. 2014 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2018 డిసెంబర్‌ 11 తేదీ వరకు కటాఫ్‌గా తీసుకొని రైతులు బకాయి పడ్డ మొత్తాన్ని గుర్తించారు. ఆ రుణాలను నాలుగు విడతలుగా నాలుగేళ్లలో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గత సంవత్సరం ప్రభుత్వం 25వేల రూపాయలలోపు రుణ బకాయిలను మాఫీ చేసింది. దీనితో నాలుగు విడుతల్లో ఒక విడత పూర్తికా గా ప్రస్తుతం రెండవ విడతలో 25 నుంచి 50వేల రూపాయల మేరకు ఉన్న రైతుల పంట రుణాల బకాయిలను మాఫీ చేయనున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం రెండవ విడత రుణమాఫీకి నిర్ణయం తీసుకోవడంతో పేద, మధ్యతరగతి రైతులకు లబ్ధిచేకూరనున్నది. ఈ మేరకు జిల్లాలో రుణ మాఫీ కోసం 67,250 మంది రైతులు అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇందులో గతేడాది 7042 మంది రైతులు రూ.25 వేల చొప్పున రుణ మాఫీ పొందారు. తాజాగా ప్రభుత్వం రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించగా జిల్లాలో 22 వేల మంది రైతులకు రుణమాఫీ కలుగనుంది. ఇక లక్ష లోపు రుణాలు ఉన్న 38,208 మంది రైతులకు రుణ మాఫీ కావాల్సి ఉంది. కాగా వర్షకాలం పంటల సాగుకు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ లభించని రైతులు ఇటు బ్యాంకుల్లో రుణాలు దొరకక బయట వడ్డీ వ్యాపారులు ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

అర్హులను గుర్తించాం..
- రేవూరి శ్రీనివాస్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి

ప్రభుత్వం రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించగా జిల్లాలో 22 వేల మంది రైతులను గుర్తించాం.  జిల్లాలో రుణ మాఫీ కోసం మొత్తంగా 67,250 మంది రైతులు అర్హులుగా గుర్తిం చాం. ఇందులో గతేడాది 7,0 42 మంది రైతులు రూ.25 వేల చొప్పున రుణ మాఫీ పొందారు.