Abn logo
Aug 7 2020 @ 03:18AM

కోర్టులపై దుర్మార్గ ప్రచారం

ప్రభుత్వం చేతిలో బంటులా జస్టిస్‌ ఈశ్వరయ్య

హైకోర్టుపై బురదజల్లేందుకే ఆ పిటిషన్‌

ప్రతివాదిగా చేర్చుకుని నా వాదనా వినండి

సంభాషణ టేపును కోర్టు పరిశీలించాలి

హైకోర్టులో పిటిషన్‌ వేసిన రామకృష్ణ

ప్రతివాదిగా చేర్చుకుని నా వాదనలూ వినండి

హైకోర్టులో పిటిషన్‌ వేసిన దళిత జడ్జి ఎస్‌.రామకృష్ణ


 అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు రాష్ట్రప్రభుత్వం ఆడుతున్న ఆటలో జస్టిస్‌ వి.ఈశ్వరయ్య వంటి రిటైర్డ్‌ న్యాయమూర్తులు దానికి బంట్లుగా మారారని చిత్తూరు జిల్లావాసి, సస్పెన్షన్‌లో ఉన్న మేజిస్ట్రేట్‌ ఎస్‌.రామకృష్ణ ఆరోపించారు. కరోనా మార్గదర్శకాల అమలులో హైకోర్టు విఫలమైందని, హైకోర్టు ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ మృతిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌’ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)లో తననూ ప్రతివాదిగా చేర్చుకోవాలని ఆయన హైకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టుపై ఆరోపణలు చేసిన ‘ఆలిండియా బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ ఫెడరేషన్‌’ రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య ప్రయోజనాల కోసం పని చేస్తోందని, ఆయన తన రాజకీయ యజమానులను సంతోషపెట్టేందుకే ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌’ వేసిన పిల్‌పై జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం ముందు శుక్రవారం విచారణ జరుగనుంది. రామకృష్ణ వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేదీ లేనిదీ ఇదే సందర్భంలో తేలే అవకాశముంది. తన పిటిషన్‌లో రామకృష్ణ ఏం చెప్పారంటే...


‘‘హైకోర్టులో పని చేసే సిబ్బంది ఆరోగ్యం పట్ల సదరు పిటిషనర్‌కు నిజమైన ఆందోళన లేదు. హైకోర్టుపై బురద చల్లేందుకే ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఏర్పాటైన ప్రభుత్వం చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా పలు పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంది.  హైకోర్టు ఉత్తర్వులతో బేజారెత్తిపోయిన ఈ ప్రభుత్వం.. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా దుర్మార్గపు ప్రచారాన్ని ప్రారంభించింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని సంస్థల ముసుగులో న్యాయవ్యవస్థ నిజాయితీని, సమగ్రతను, గొప్పదనాన్ని దెబ్బతీయడానికి.. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను కలుషితం చేసేందుకు.. న్యాయపరిపాలనకు అడ్డంకులు సృష్టించేందుకు ఆడుతున్న ఈ ఆటలో జస్టిస్‌ ఈశ్వరయ్య వంటి కొంతమంది రిటైర్డ్‌ జడ్జీలు ప్రభుత్వం చేతిలో బంటులుగా మారారు. జస్టిస్‌ వి.ఈశ్వరయ్య.. ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ జ్యుడీషియల్‌ కమిషన్‌ చైర్మన్‌గా నియమితులైన విషయం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరముంది. తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన రాజకీయ యజమానులను సంతోషపెట్టడానికి ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహిస్తున్నారు.’


ఆధారాలివిగో..: ‘న్యాయవ్యవస్థను అప్రతిష్ట పాల్జేయడానికి, దేశంలోని ఉన్నత న్యాయవ్యవస్థలో ఉన్న సిట్టింగ్‌ న్యాయమూర్తులపై ప్రతీకారం తీర్చుకునేందుకు.. రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య చేసిన దుర్మార్గపు ప్రయత్నాలకు సంబంధించి నేను చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు తగిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ఏపీ హైకోర్టు సిట్టింగ్‌ జడ్జీలపై.. మరీ ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తిపై తప్పుడు ఆరోపణలు చేసిన హన్స్‌రాజ్‌ నేతృత్వంలోని ఆలిండియా బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ ఫెడరేషన్‌ సంస్థ ఈశ్వరయ్య వ్యక్తిగత లాభాలకు అనుకూలంగా ఉంది. గత నెల 20వ తేదీ రాత్రి 9.30 గంటలకు జస్టిస్‌ ఈశ్వరయ్య వ్యక్తిగత కార్యదర్శి నాకు ఫోన్‌ చేసి ఈశ్వరయ్య నాతో మాట్లాడాలనుకుంటున్నారని పేర్కొంటూ మరో మొబైల్‌ నంబరు ఇచ్చారు. దాంతో ఆ నంబరుకు ఫోన్‌ చేశాను.


మా సంభాషణలో ఆలిండియా బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ ఫెడరేషన్‌ రాసిన లేఖ గురించి తెలుసా అని జస్టిస్‌ ఈశ్వరయ్య నన్నడిగారు. ఆ సంస్థకు తాను వ్యవస్థాపక అధ్యక్షుడినని చెప్పారు. హన్స్‌రాజ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అని, అతడు తనకు ‘హనుమంతుడు’ లాంటివాడని పేర్కొన్నారు. తన ఆదేశాల మేరకే వారంతా పని చేస్తారని కూడా చెప్పారు. ఒక రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని, తద్వారా న్యాయవ్యవస్థ ఇమేజ్‌ దెబ్బతినాలని ఆయన ప్రతిపాదించారు.  రిట్‌ పిటిషన్‌లో లేవనెత్తిన సమస్యపై సరైన తీర్పు ఇవ్వడానికి, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులను నివారించేందుకు ఆ సంభాషణ వినడం చాలా అవసరం. అందువల్ల ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా చేరి, వాదనలు వినిపించేందుకు నాకు అనుమతి ఇవ్వండి.’

Advertisement
Advertisement
Advertisement