Abn logo
Jul 31 2021 @ 00:18AM

మందు మస్తు..!

నిషేధం తూచ్‌!

నగరంలో ఎలైట్‌ వైన్‌ మాల్స్‌

పర్యాటక ప్రాంతాల్లోనూ మద్యం షాపులు

జిల్లాలో మరో 12చోట్ల దుకాణాలు

ఏర్పాటుకు రంగం సిద్ధం చేసిన ఎక్సైజ్‌ శాఖ

వచ్చేనెల నుంచి ఏరులై పారునున్న మందు

మద్య నిషేధంను గాలికొదిలేసి సర్కారు పెద్దలు దశలవారీగా  విక్రయాలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మద్యంను ఏరులై పారించేందుకు భారీగా దుకాణాలను తెరవబోతున్నారు. నిషేధం పేరుతో అధికారపెద్దలు, అధికారులు చేసిన ఆర్భాటం అంతా ఉత్తదేనని తాజా వ్యవహారంతో తేటతెల్లమవుతోంది. ఇప్పటివరకూ గుడి, బడికి దూరం అంటూ నిబంధన ఉండేది. ఇక దానికి కూడా చరమగీతం పాడేందుకు సిద్ధమవుతున్నారు. నగరంలో ఎలైట్‌ వైన్‌ మాల్స్‌ పేరుతో భారీ దుకాణాలు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే పర్యాటక ప్రాంతాల్లోనూ మద్యం దుకాణాలు పెట్టబోతున్నారు. వాటిలో ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయి. ఇక ఎక్కడబడితే అక్కడ మద్యం తాగొచ్చు అన్నట్లుగా ఉంది పాలకుల తీరు. మద్యం ఆదాయమే పరమావధిగా పెట్టుకుని ఏర్పాటు చేస్తున్న ఈ దుకాణాలను వచ్చేనెల నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ఎక్సైజ్‌శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక జేబులో డబ్బులుంటే చాలు.. తాగినోడికి తాగినంత పోస్తారన్న మాట.

ఒంగోలు (క్రైం), జూలై 30 : దశలు వారీగా సంపూర్ణ మద్యనిషేధం అంటూ బాకా ఊదుతున్న వైసీపీ ప్రభుత్వం తిరిగి మద్యం దుకాణాలను కొత్తగా తెరుస్తోంది. టూరిజం పేరుతో మందు ప్రవాహాన్ని పెంచబోతోంది. నిషేధం ముసుగులో దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తూ మద్యాన్ని భారీ ఽధరలకు విక్రయిస్తూ ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న విషయం తెలిసిందే. సంక్షేమ పఽథకాల పేరుతో పేదలకు ఇస్తున్న రాయితీలను తిరిగి మద్యం రూపంలో గుంజుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లోనూ మద్యం దుకాణాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఆ దిశగా జిల్లాలో పది షాపుల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేసుఉ్తన్నారు. అంతేకాదు నగరంలో ఎలైట్‌ వైన్‌ మాల్స్‌ పేరుతో భారీ దుకాణాలు ప్రారంభించాలని నిర్ణయించారు. మొత్తంగా మరలా మద్యం ఏరులై పారించడానికి రంగం సిద్ధమైంది.. 


పర్యాటక శాఖ పరిధిలో...

ఇప్పుడు పెంచుతున్న మద్యం దుకాణాలన్నీ పర్యాటక శాఖ ఆధీనంలో నడిపేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో గతంలో మద్యం తక్కువగా విక్రయించే 25 దుకాణాలను తొలగించారు. ఇది దశలవారీ మద్య నిషేధానికి తార్కాణమంటూ అధికారులు, అధికారపార్టీ నేతలు ఆర్భాటం చేశారు. అయితే అందులో లోగుట్టు ఉంది. అక్కడ మద్యం విక్రయాల ద్వారా వచ్చే దానికి దుకాణం అద్దె, అక్కడ పనిచేసే సిబ్బంది జీతాలు లెక్క కట్టి ఆదాయం రావడం లేదని నిర్ధారణకు వచ్చాకే తొలగించారు. అంతేకాకుండా కొన్ని దుకాణాలను రీలోకేషన్‌ పేరుతో ఆదాయం వచ్చే ప్రాంతాలకు మార్చారు. 


నెలకు రూ.100 కోట్లకుపైగా ఆదాయం 

 ప్రస్తుతం జిల్లాలో 222 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా నెలకు ఖజానాకు రూ.100కోట్లకుపైనే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. 2019-20లో మద్యం విక్రయాలపై రూ.1,153కోట్లు సమకూరింది. అదే 2020-21లో రూ.1,675 కోట్లు వచ్చింది. అంటే ఒక్క ఏడాదిలోనే మద్యంపై రూ.511కోట్లు అదనంగా ఆదాయం  లభించింది. అందుకు ధరలు పెంచి మందుబాబుల వద్ద ముక్కుపిండి వసూలు చేయడమే కారణమైంది. అదేవిధంగా మద్యం పెట్టెలు కూడా 2019-20లో 15,08,530 విక్రయించగా, 2020-21లో 16,10,453 పెట్టెలు విక్రయాలు జరిగాయి. అంటే 1,01,923 పెట్టెల మద్యం అదనంగా విక్రయాలు జరిగాయి.


నగరంలో ఎలైట్‌ వైన్‌ మాల్స్‌

నగరంలో రెండు ఎలైట్‌ వైన్‌ మాల్స్‌ ద్యారా మద్యం విక్రయించాలని నిర్ణయించారు. ఈ మాల్స్‌లో మద్యం ప్రీమియం, మీడియం బ్రాండ్లను విక్రయిస్తారు. అందుకు 12వందల చదరపు అడుగులు ఉండే భవనాలను అద్దెకు తీసుకోనున్నారు. ఎవరికి అవసరమైన మద్యం వారు కొనుగోలు చేసుకునే విధంగా అన్ని బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మద్యం దుకాణాల వద్ద వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా ఎలైట్‌ మాల్స్‌లో మద్యం కొనుగోలు చేసుకుని వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. అందుకు సంబంధించి ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న భవనాలను పరిశీలించారు. 


పర్యాటక ప్రాంతాల్లో మద్యం దుకాణాలు

పర్యాటక ప్రాంతాల్లో మద్యం దుకాణాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో పది ప్రాంతాలను గుర్తించారు కూడా. అయితే వీటి నిర్వహణ బాధ్యత పర్యాటక శాఖకు అప్పగించనున్నారు. యాత్రా స్థలాలకు వెళ్లిన వారికి మద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ యోచన. దీంతో జిల్లాలో చీరాల, వాడరేవు, రామాయపట్నం, కొత్తపట్నం, సింగరాయకొండ, దోర్నాల, చందవరం, త్రిపురాంతకం తదితర ప్రాంతాల్లో ఈ దుకాణాలను ఏర్పాటుకు సన్నద్ధం చేస్తున్నారు. ఇక పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారికి మద్యం ఫుల్‌గా అందుబాటులోకి రానుంది. 


వచ్చే నెల నుంచి ప్రారంభం

నగరంలో రెండు ఎలైట్‌ మాల్స్‌, పర్యాటక ప్రాంతాల్లో పది మద్యం దుకాణాలు వచ్చేనెల నుంచి ప్రారంభించేందుకు ఎక్సైజ్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం ఒంగోలు నగరంలో ఎలైట్‌ మాల్స్‌ కోసం ఇప్పటికి కొంతమంది తమ భవనాలు అద్దెకు ఇస్తామని దరఖాస్తులు చేసుకున్నారు. అందుకు సంబంధించి అద్దెతోపాటుగా వ్యాపార లావాదేవీలకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అదేవిధంగా పర్యాటక ప్రాంతాల్లో దుకాణాల ఎంపిక బాధ్యతను పర్యాటకశాఖకు అప్పగించారు. ఆ శాఖ అధిరారులు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాల కోసం భవనాలను పరిశీలించారు.