నర్సరీని పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్)
- ప్రతి సంవత్సరం ఒక్కో నర్సరీలో పదివేల మొక్కలు
- ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ
- మండలంలో 2,80,000 మొక్కల పెంపకం
మోమిన్‌పేట: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని ఈ ఏడాది అధికారులు భారీ ఎత్తున చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మండల పరిధిలోని 28పంచాయతీల్లోని నర్సరీల్లో విత్తనాలు నాటి, మొక్కలు పెంచేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో గ్రామపంచాయతీలో 10వేల మొక్కలు పెంచేందుకు ఉపాధి హామీ పథకంలో నర్సరీలను ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 2.8లక్షల మొక్కలను పెంచే కార్యక్రమాన్ని ఉపాధిహామీ కూలీలతోపనులు చేయిస్తున్నారు. గ్రామాల్లో ఎర్రచందనం, శ్రీగంధం, అల్లనేరేడు, గోరింటాకు, రావి, కానుగ, వేప, చింత, నిమ్మ, మర్రి, జామ, దానిమ్మ, ఉసిరి, బాదాం, ఈత, కరివేపాకు మొదలైన రకాల మొక్కలను పెంచుతున్నారు. మండల, గ్రామ అధికారులు, సర్పంచులు ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు : నవనీతవిష్ణువర్ధన్రెడ్డి, టేకులపల్లి సర్పంచ్
మనం చదువుకునే రోజుల్లో పుస్తకాల్లో పచ్చనిచెట్లు ప్రగతికి మెట్లు అని, అశోకుడు రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటించాడని చదువుకున్నాం. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక దాన్ని నిజం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామగ్రామాన హరితహారంలో భాగంగా ప్రతీసారి మొక్కలు నాటి ఆకుపచ్చని వాతావరణం తీసుకురావడంతో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి.
విత్తనాలు నాటుతున్నాం : ఏపీవో శంకరయ్య, మోమిన్‌పేట
మండలంలోని 28పంచాయతీల్లోని నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తి కావడంతో వారం రోజుల నుంచి అన్ని నర్సరీల్లో విత్తనాలు నాటుతున్నాం. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సుమారుగా 3లక్షల పైచిలుకు మొక్కలు నాటే లక్ష్యం ఉంది. అందుకు తగ్గట్టే నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.