Abn logo
Aug 6 2020 @ 01:32AM

కరోనాపై నిర్లక్ష్యం వద్దు

3,668 పరీక్షలు  - 867 పాజిటివ్‌ కేసులు

కరోనా కిట్‌, మందుల కొరత లేదు

జిల్లాలో 80 మినికంటైన్మెంట్‌ జోన్స్‌ ఏర్పాటు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చందూనాయక్‌


గద్వాల క్రైం, ఆగస్టు 5 : కరోనా వైరస్‌ సామాన్యమైనదే అయినా నిర్లక్ష్యం వహించొద్దని వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చందూనాయక్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మంగళవారం వరకు 3,668 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించామని, ఇందులో 867 పాజిటివ్‌ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 746 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. హోం ఐసోలేషన్‌లో 624 మంది ఉన్నారని, 12 మంది మరణించారన్నారు. జిల్లాలో 80 మినీ కట్టడి ప్రాంతాలను ఏర్పాటు చేశామన్నారు. కరోనా బాధితులకు వైద్యసేవలు, ఆరోగ్య సలహాలు అందించేందుకు రెండు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.


జిల్లాలో 4,500 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే  2,500 కిట్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేశామని తెలిపారు. ఆక్సీజన్‌ సిలిండర్లు, మందులకు కొరత లేదన్నారు. కోవిడ్‌ పరీక్షలు చేయడానికి ఏ ప్రవేట్‌ ల్యాబ్‌కు అనుమతి లేదన్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు. ఒక వేళ ఎవరైనా పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు మాస్క్‌ పెట్టుకొని భౌతిక దూరం పాటించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మధుసూదన్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ రమేష్‌, డీడీఎం రామాంజనేయులు, సీసీ విష్ణు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement