Abn logo
May 5 2020 @ 00:37AM

భవ్య భవిష్యత్తుకు భరోసా

కరోనా మహోత్పాత అనంతర కార్యాచరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆయన చేపట్టే ప్రతి చర్యా దేశంలో సంపద ఎల్లెడలా ప్రవహించేందుకు, ఉపాధి కల్పనకు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు అణగారిన వర్గాలకు సత్వర ప్రయోజనం చేకూర్చే విధంగా సంక్షేమ కార్యక్రమాల అమలునూ తన కర్తవ్యంగా ప్రధాని భావిస్తున్నారు.


ఒక మహోత్పాతం సంభవించినప్పుడు తొట్రుపాటు పడకుండా వ్యవహరించడం, సంయమనంతో, దీర్ఘకాలిక దృష్టితో చర్యలు తీసుకోవడం ధీరోదాత్తుల లక్షణం. కరోనా వైరస్ మహోత్పాత సందర్భమిది. ఇవాళ దేశం యావత్తూ మన ప్రధానమంత్రి మోదీ ఏమి చేస్తారా అని ఎదురు చూస్తున్నది. ఆయన ముందున్నది ఒక రాష్ట్రానికో, ప్రాంతానికో సంబంధించిన సమస్య కాదు. ముఖ్యమంత్రులు తమ రాష్ట్రం గురించి, ప్రాంతం గురించి యోచిస్తారు కాని ప్రధానమంత్రి మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. తన బృహత్తర బాధ్యతను దృష్టిలో ఉంచుకునే ప్రధాని నిధులు విడుదల చేయడం లేదు. ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఆయన చెక్కు చెదరకుండా పకడ్బందీగా భవిష్యత్ కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత శనివారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఎలాంటి చర్యలు తీసుకుంటే దేశంలో ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటాయి, కరోనాకు ముందున్న స్థితి కంటే రెట్టింపు ఉధృతితో ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేయగలం అన్న అంశంపై ప్రధాని మోదీ కూలంకషంగా చర్చించారు. దేశంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన చేస్తే కాని, ఆర్థిక వ్యవస్థ పుంజుకోదన్న విషయం ప్రధానమంత్రికి బాగా తెలుసు.


కరోనా వైరస్ మూలంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయిన నేపథ్యంలో ప్రధానమంత్రి సహజంగానే లాక్‌డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేసేవిషయంపై పూర్తిగా దృష్టిని మళ్లించారు. గత ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఎర్రకోటపై నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు రూ.100లక్షల కోట్ల మేరకు మౌలిక సదుపాయాలను నిర్మించడం అవసరమని చెప్పారు. కరోనా అనేది పొడసూపకముందే ఆయన 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇప్పుడు కరోనా అనంతరం అయన తన చర్యల్ని మరింత వేగవంతం చేస్తారనడంలో సందేహం లేదు. అందుకే గత శనివారం జరిగిన సమావేశంలో తన ముందున్న లక్ష్యాలను స్పష్టీకరించారు.


ఈ లక్ష్యాల సాధనలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన కొన్ని లక్షల కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కేంద్రం కరోనా అనంతరం వేగవంతం చేస్తుం దనడంలో సందేహం లేదు. దేశంలో నదుల అనుసంధానంపై కూడా ప్రధానమంత్రి దృష్టి కేంద్రీకరించే అవకాశాలున్నాయి. దీని వల్ల వివిధ రాష్ట్రాల్లో ఉపాధి కల్పనతో పాటు నీటిపారుదల సౌకర్యాలు మెరుగవుతాయి. అనేక బృహత్తర నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తవుతాయి. అంతేకాక ఢిల్లీ-–ముంబై, చెన్నై-–ముంబై, విశాఖపట్టణం-–చెన్నై మొదలైన పారిశ్రామిక కారిడార్లపై పనులు వేగవంతం అయ్యే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా పారిశ్రామిక పట్టణాలు అనేకం ఏర్పడతాయి. ఇప్పటికే అందరికీ ఇళ్ల పేరిట మోదీ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర యజ్ఞంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వేగం పుంజుకునేందుకు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.


స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు కూడా మరింత వేగంగా అమలయ్యేందుకు ఆస్కారం ఉన్నది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాలంటే విదేశీ పెట్టుబడులు కూడా అవసరం. అందువల్ల ప్రధాని ఇప్పటికే వాటిపై దృష్టి సారించారు. భారత దేశంలో తక్కువ పెట్టుబడి, తక్కువ ఖర్చుతో విద్యుత్, నీరు, శ్రమ శక్తి లభిస్తున్న రీత్యా భవిష్యత్‌లో భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు మన దేశంలో ప్రవేశించే అవకాశాలపై ప్రధానమంత్రి చర్చలు జరిపారు. ఆయన గత ఆరేళ్లుగా పలు దేశాలతో ఏర్పర్చుకున్న సంబంధాలు ఇప్పుడు ఉపయోగపడే అవకాశాలున్నాయి. మోదీ చేపట్టే ప్రతి చర్యా దేశంలో సంపద ఎల్లెడలా ప్రవహించేందుకే కాక పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగేందుకు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు.


అన్నికన్నా ముఖ్యంగా కరోనా సృష్టించిన పరిస్థితుల వల్ల అనేక సప్లై కంపెనీలు చైనా నుంచి తప్పుకోవాలని చూస్తున్న విషయం స్పష్టమైపోయింది. చైనా నుంచి ఏఏ కంపెనీలు బయటపడాలనుకున్నాయో గమనించి వాటికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ప్రధానమంత్రి కేంద్ర మంత్రిత్వ శాఖలనే కాక, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేశారు. కరోనా మూలంగా దేశం యావత్తూ టెక్నాలజీకి అలవాటు పడ్డ విషయాన్ని ఆయన గమనించారు. కరోనా అనంతరం ఈ టెక్నాలజీని ఏవిధంగా అభివృద్ధికి వాడుకోవాలాఅన్న విషయం మోదీ పరిశీలిస్తున్నారు. మనం టెక్నాలజీని ఆధునీకరిస్తే అనేక విదేశీ కంపెనీలు మన దేశంలో అడుగుపెట్టే అవకాశాలున్నాయి. మౌలిక సదుపాయాల వేగవంతమైన అమలు, విదేశీ పెట్టుబడులు, విదేశీ కంపెనీలను ఆకర్షించడం ఒక ఎత్తు అయితే ఈ మధ్య కాలంలో దెబ్బతిన్న వర్గాలను ఆదుకోవడం తన కర్తవ్యంగా ప్రధాని భావిస్తున్నారు. కరోనా వల్ల దెబ్బతిన్న చిన్న మధ్య పరిశ్రమలకు పెద్ద ఎత్తున చేయూతనిచ్చి ఆదుకోవాలని, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా వాటికి తక్కువ వ్యయంతో మూలధనాన్ని సమకూర్చాలని భావిస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలా అని కూడా ఆయన యోచిస్తున్నారు. ఇప్పటికే గరీబ్ కల్యాణ్ యోజన పేరుతో దేశ వ్యాప్తంగా వలస కార్మికులను, పేదలను ప్రత్యక్షంగా ఆదుకున్నారు. భవిష్యత్ కాలంలో అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు అణగారిన వర్గాలకు సత్వర ప్రయోజనం చేకూర్చే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రధాని భావిస్తున్నారు. అత్యంత క్లిష్ట కాలంలో మోదీ వంటి సమర్థుడైన ప్రధాని మనకు లభించడం గర్వకారణమనే చెప్పాలి.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Advertisement
Advertisement
Advertisement