Abn logo
Oct 11 2020 @ 05:37AM

అయోమయం

Kaakateeya

వీఆర్వో వ్యవస్థ రద్దై 33 రోజులు

రిజర్వు ఉద్యోగులుగానే కొనసాగింపు

గిర్ధావర్లకు భారంగా మారిన  విధులు 

 ఆస్తి సర్వేలో పనిచేయించుకోవాలని ఆదేశాలు


పరిగి: గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు.. కొత్త రెవెన్యూచట్టం అమలు.. విధివిధానాలు, అధికారాలపై పూర్థిస్థాయిలో స్పష్టత లేకపోవడంతో అయోమయం నెలకొంది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి నెల గడిచింది. వారికి ఇప్పటి వరకూ విధులు అప్పగించడంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఖాళీగానే ఉంటున్నారు.  దీంతో ప్రభుత్వానికి గుండెలాంటి రెవెన్యూ శాఖ కార్యకలాపాలు స్తంభించాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు. అయితే వీఆర్వోలు చేసే పనులను గిర్ధావరి, ఆపై అధికారులతో చేయిస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా  క్షేత్రస్థాయిలో అది కన్పించడం లేదు. సెప్టెంబర్‌ 7న రికార్డులను వీఆర్వోల నుంచి తీసుకున్నారు. అప్పటి నుంచి రెవెన్యూకు సంబంధించిన పనులు ఆగిపోయాయి.  ఇటీవల ప్రభుత్వం కొత్తగా గ్రామాల్లో ఆస్తుల సర్వే చేపడుతోంది. ఇందులో వీఆర్వోల సేవలను వినియోగించుకోవాలని ఒకసారి.. మరోసారి వారిపై చెడ్డపేరు ఉందని, ప్రజల్లోకి వెళితే మళ్లీ విమర్శలు వస్తాయని సర్కారు తర్జనభర్జన పడుతోంది. 


అయితే ఆస్తి సర్వేలో ఉన్నతస్థాయి అధికారులు కొందరు వీఆర్వోలను ఉపయోగించు కోవాలని సూచించగా, మరికొందరు అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు లేవు కదా.. వీఆర్వోలు వద్దని చెబుతుండడంతో తహసీల్ధార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, గిర్ధావర్లకు దిక్కుతోచడం లేదు.  వికారాబాద్‌ జిల్లాలో 204 మందికి గాను  143 మంది వీఆర్వోలు మాత్రమే పని చేస్తున్నారు. 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ వ్యవస్థ ప్రారంభం నుంచి క్షేత్రస్థాయిలో పని చేసే వీర్వోలు 57 రకాల విధులు నిర్వహిస్తూవచ్చారు. ప్రభుత్వం అమలు చేసే ఏ కార్యక్రమానికైనా వీఆర్వోనే కీలకంగా వ్యవహరించేవారు. ఆ వ్యవస్థ రద్దుతో  ఇప్పుడు అన్ని రకాల పనులను ఆర్‌ఐ, డీటీ, ఎమ్మార్వోలు చేస్తారన్న కొత్త చట్టంలోని విధివిధానాల  అమలుపై ఇంకా గందరగోళం నెలకొందని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు.

Advertisement
Advertisement