Abn logo
Dec 2 2020 @ 00:19AM

ప్రభుత్వ విద్యుత్‌ బకాయిలు రూ.733 కోట్లు

14, 15 ఆర్ధిక సంఘాల ద్వారా రూ.111 కోట్లు విడుదల

పంచాయతీలు వెంటనే చెల్లించాలి


ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ శ్రీనివాసులు

కడప (సిటి), డిసెంబరు 1 : జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి విద్యుత్‌ సంస్థకు రూ.733.60 కోట్లు బకాయిలున్నాయని ఎస్పీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఎన్‌.శ్రీనివాసులు తెలిపారు. ఆయన మంగళవారం తన ఛాంబరులో మీడియాతో మాట్లాడారు. బకాయిల్లో మేజరు, మైనర్‌ పంచాయతీల వాటా రూ.421.03 కోట్లు కాగా 14, 15 ఆర్థిక సంఘాల ప్రభుత్వ విద్యుత్‌ బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.111.45 కోట్లు విడుదల చేసిందని, ఇందులో 40 శాతం పంచాయతీలు వెంటనే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కావున పంచాయతీల అధికారులు స్పందించి వెంటనే చెల్లించి సంస్థ ఆర్థిక బలోపేతానికి సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ విద్యుత్‌ బకాయిలకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.58.91 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.52.54 కోట్లు మంజూరయ్యాయన్నారు. వచ్చిన నిధుల నుంచి వెంటనే చె ల్లించాలని కలెక్టరు పంచాయతీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశానన్నారు. కాగా నివర్‌ తుఫాను కారణంగా జిల్లాలో సంస్థకు రూ.2.12 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. జిల్లాలో 69 సబ్‌స్టేషన్లు దెబ్బతినగా 54 కి.మీ మేర విద్యుత్‌ లైన్లు తెగిపోయాయని, 1608 స్తంభాలు, 322 ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయన్నారు. అయితే సిబ్బంది వెంటనే స్పందించి నిర్విరామంగా శ్రమించి యుద్ధప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించారని తెలిపారు. ఇంకా ఎక్కడైనా సరఫరాలో అంతరాయాలు ఉంటే సంబంధిత విద్యుత్‌ అధికారుల దృష్టికి తేవాలన్నారు. వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.



 


Advertisement
Advertisement
Advertisement