ఓట్లు వేసిన యువతులు, సినీ నటి మంచు లక్ష్మి
రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయని భావించిన గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు సగటు ఓటర్ని అయితే అంతగా ఉత్తేజ పరచలేకపోయాయి. ఇంత హంగామా జరిగిన ఈ ఎన్నికల పోలింగ్ శాతం 45.71 అని మంగళవారం అర్ధరాత్రి అధికారులు ప్రకటించారు. సగానికిపైగా సిటీ ఓటెయ్యలేదన్నమాట. పార్టీలు, లీడర్లు, అధికారులు... ఎవరు ఏమి చెప్పినా... రాజకీయాలను శాసించే, శాసించాల్సిన అసలు వ్యక్తి... ఓటర్ మాత్రం పెద్దగా ఉత్సాహాన్ని ప్రదర్శించ లేదు. పోలింగ్ కూడా అయిపోయిన తర్వాత.. ఇక కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉన్న ఈ దశలో ఉన్నవన్నీ ప్రశ్నలే. ఈ ప్రశ్నలలో కొన్నింటికి (గెలుపెవరిది లాంటి వాటికి) సమాధానం డిసెంబర్ 4నాడు దొరుకుతుంది. మిగతా వాటికి (పోలింగ్ పెరగకపోవడానికి అసలు కారణాలు) సమాధానాలు వెదకాల్సి ఉంది. నిజానికి.. వేరే ప్రాంతాల స్థానిక ఎన్నికలలో ఓటరు జోరు మామూలుగా ఉండదు. ఇక్కడి రాజకీయాలలోనే ఈ తేడా అంతా కనిపిస్తోంది. వేరే వాటితో పోలిక ఎందుకు... ఈ ఎన్నికలలోనే.. శివార్లలో ఉన్న రామచంద్రాపురంలో 67.71 శాతం పోలింగ్ నమోదైతే... నగరం నడిబొడ్డున ఉన్న యూసుఫ్గూడలోనే 33.03 శాతం మాత్రమే రికార్డవడం కూడా.. శివారు, నగర ప్రాంతాల ఓటర్లు స్పందించే తీరులో తేడా ఉందని స్పష్టం చేస్తోంది. ఎందుకిలా అన్న ప్రశ్న దగ్గరి నుంచి అనేక ప్రశ్నలు పుడుతున్నాయి.