Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమర్థంగా లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు

స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు సహకరించాలన్న డీఎంహెచ్‌వో 


తిరుపతి సిటీ, నవంబరు 30: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ (పి.సి.పి.ఎన్‌.డి.టి.యాక్ట్‌) చట్టాన్ని సమర్థగా అమలు చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు సహకరించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీహరి కోరారు. తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాల ఆడిటోరియంలో మంగళవారం ఆయన కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జయభాస్కర్‌తో కలిసి జిల్లా స్థాయి మల్టి మెంబర్‌ అప్రోప్రియట్‌ అథారిటీ, జిల్లా స్థాయి సలహా సంఘం, జిల్లాలో అనుమతి పొందిన ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులకు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం నిబంధనలపై శిక్షణ ఇచ్చారు. వైద్యులు, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఎవరైనా గర్భస్థ పిండ లింగ నిర్ధారణకు పాల్పడితే చట్టపరమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణకు పాల్పడే వారి సమాచారం అందించే వారికి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహక నగదు బహుతి ఇస్తామన్నారు. సమాజంలో లింగ అసమానతలకు కారణమవుతున్న భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంటుందని, తనిఖీలను కూడా ముమ్మరం చేస్తామని డీఎస్పీ బాల ప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రుయాస్పత్రి సూపరింటెండెంట్‌ భారతి, డి.సి.హెచ్‌.ఎ్‌స. డాక్టర్‌ సరళమ్మ, ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చంద్రశేఖరన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ అరుణ సులోచన, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలు జిల్లా అధికారి బాబు నెహ్రూరెడ్డి, గణాంకాల అధికారి రమేష్‌ రెడ్డి, డాక్టర్‌ శ్రీహరిరావు, డాక్టర్‌ కృష్ణప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement