Abn logo
May 21 2020 @ 00:44AM

మాతృభాషతోనే విద్యా పరిపూర్ణత

ఆంగ్లభాషా మాధ్యమంలో బోధన అంటే, మాతృభాషను త్యజించమని కాదు. ఆంగ్లమాధ్యమం ఈనాటి పోటీ ప్రపంచంలో నెగ్గటానికి అనివార్యమైనా, మాతృభాష మాత్రం విద్యార్థినీ విద్యార్థుల మానసిక, శారీరక, పరిపూర్ణ వికాసానికి దోహదపడడమే కాకుండా, ఇతర భాషలు, సబ్జెక్టులు నేర్చుకోవటంలో అద్భుతమైన సాధనంగా పని చేస్తుంది. మరి ఈ శక్తివంతమైన ఆయుధాన్ని సరైన రీతిలో అమల్లో పెడదామా?


ఆంగ్లమాధ్యమం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు విద్యా హక్కు చట్టానికీ, సుప్రీం కోర్టు తీర్పునకూ అనుకూలంగా లేవని హైకోర్టు ఇటీవల తేల్చి చెప్పింది. దాంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎస్.సి.ఇ.ఆర్.టి.ను నివేదిక అందించాలని ఆదేశించింది. ఆ దిశగా ఎస్.సి.ఇ.ఆర్.టి కొన్ని సిఫార్సులు చేసింది. వాటిని ఆమోదిస్తూ ప్రభుత్వం ఇప్పుడు జీ.ఓ.నెం.24 జారీ చేసింది. 


విద్యార్థులు, తల్లితండ్రులు 95శాతం ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటున్నట్లు ఈ మధ్య జరిపిన నివేదికలు తెలియచేసాయి. దీనిని అనుసరించి ఎస్.సి.ఇ.ఆర్.టి చేసిన సిఫార్సులు ఈ విధంగా ఉన్నాయి. ఒక పక్క పిల్లలకు మాతృభాషలో బోధనకు ప్రాధాన్యతని ఇస్తూనే, దానిలో ప్రావీణ్యత సాధిస్తూనే, మిగతా సబ్జెక్టుల్లో విస్తృత నైపుణ్య దిశగా ఒకటో తరగతి నుండే ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలని సిఫార్సు చేసింది. ఈ ప్రక్రియను దశలవారీగా ప్రవేశపెట్టాలని సూచించింది. రాష్ట్రంలో 672 మండల కేంద్రాల్లో తెలుగు మీడియం స్కూళ్ళను ఏర్పాటు చేయటానికి పచ్చజెండా ఊపింది. దీని వలన విద్యార్థులలో సమగ్ర శారీరక, మానసిక వికాసం సాధ్యం అయి, భయాందోళనలు లేకుండా విద్యార్థులు తమ భావాలను స్వేచ్ఛగా చెప్పగలరని అభిప్రాయం వ్యక్తం చేసింది.


ఈ సందర్భంగా అసలు ‘మాతృ భాష’ నిర్వచనం, దాని ఉనికికి సంబంధించిన ఎన్నో అంశాలు సాహితీవేత్తల, భాషా పండితుల, ఎంతోమంది ఉద్దండుల ఆలోచనా సరళిని, భావాలను ప్రశ్నిస్తున్నాయి. మాతృభాష అంటే నిస్సందేహంగా కుటుంబంలో ఒకరితో ఒకరు సంభాషించే భాష అని ఎన్నో పరిశోధనలు తెలుపుతున్నాయి. బిడ్డలు అమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఆమె మాట్లాడే భాషను గ్రహిస్తారని, తల్లి భావాలను అనుకరించగలుగుతారని మనస్తత్వ శాస్త్రజ్ఞులు రూఢీగా తెలిపారు. చిన్నారులు వాళ్ళ అవసరాలను చెప్పటానికి వాడే ఏడుపు, సంజ్ఞలు, ఇతర శబ్దాలు... ఇవన్నీ మాతృభాషనే సూచిస్తాయి అని కూడా తేల్చి చెప్పారు. ఇలా పుట్టినప్పటి నుండి పసిబిడ్డల భాషాభివృద్ధి అనేక స్థాయిలలో జరుగుతుంది.


విద్యలో వ్యావహారిక భాషా వినియోగం గురించి 1953లో ముద్రితమైన యునెస్కో పత్రం తరువాతే ప్రపంచం మాతృభాష విలువను గుర్తించింది. ప్రవర్తనా శాస్త్ర నిపుణుడు స్కిన్నర్ సిద్ధాంతం ప్రకారం పిల్లల్ని వారి మాతృభాష ఎంతో ప్రభావితం చేస్తుంది. యునెస్కో, ఐక్యరాజసమితి బాలల హక్కుల కన్వెన్షన్ మొదలైన సంస్థలు కనీసం ప్రాథమిక స్థాయిలో పిల్లలకు మాతృభాష ప్రధాన బోధనా మాధ్యమంగా ఉండాలని నొక్కి ఒక్కాణించాయి. దీని వలన ఇతర సబ్జెక్టుల్లో అవగాహన త్వరగా వస్తుంది అని కూడా నిరూపించాయి.


భారత రాజ్యాంగం, విద్యా హక్కు చట్టం కూడా, పాఠశాలల్లో ప్రాథమిక భాషా మాధ్యమం మాతృ భాషలోనే ఉండాలని నొక్కి చెప్పాయి. ఆ విధంగా భారత దేశం మొత్తం మీద కేవలం 31 భాషలు భాషా మాధ్యమాలుగా ఉన్నాయి (మొత్తం 300 భాషలు, 2011 ప్రకారం). భారత దేశంలో ఈ భాషా సంక్షోభాన్ని అంచనా వేసేందుకు నియమించిన వార్షిక స్థితిని లెక్కించే విద్యా నివేదిక 'అసర్' అధ్యయనంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐదవ తరగతి చదువుతున్న 55శాతం మంది రెండవ తరగతి భాషను చదవడంలో వెనుకబడ్డారు. ఈ సర్వేలో భాగంగా దశాబ్దాలుగా వెలువడిన నివేదికలు నిరూపించింది ఏమిటంటే, 8 నుండి 10 ఏళ్ల పిల్లలు మాతృభాషా మాధ్యమంలో సమర్థవంతులు అయితే, ఆ పునాదితో మెల్లగా మిగతా అన్ని భాషలను ఔపోసన పట్టగలరు. ఇంకా ఆశ్చర్యకర అంశం ఏమిటంటే, మాతృభాషా మాధ్యమంలో కాకుండా ఆంగ్లభాష మాధ్యమంలో చదివిన విద్యార్థినీ విద్యార్థులు, ఇతర సబ్జెక్టుల్లోనే కాకుండా, ఆంగ్లంలో కూడా పట్టు సాధించలేక, ఉద్యోగ అవకాశాలు సాధించలేకపోతున్నారు.


జపాన్, చైనా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి ప్రపంచ దేశాలు ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయంటే దానికి కారణం ఆంగ్ల భాష మాత్రమే కాదు. అక్కడ విద్యావిధానంలో మాతృభాష ముఖ్యభాగమై ఇమిడి ఉంటుంది. ఇదే విధంగా మన దేశంలో కూడా ప్రభుత్వ విధానాలు మాతృభాషాహితంగా మార్చలేమా? అయితే ఆంగ్లభాష ప్రాముఖ్యతను నిలుపుతూనే, అటువంటి ప్రయత్నాలు జరగాలి. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు అన్నింటిలోనూ మాతృభాషా సబ్జెక్టులు అనేవి కేవలం మార్కులు కోసం మాత్రమే ఉన్నాయి.


ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో కంప్యూటర్ సైన్స్ మీద ఒక సదస్సులో ఇలా అన్నారు, ‘నా చిన్ననాటి విద్యలో గొప్పతనం ఏమిటంటే, తెలుగు పద్యంలో ఛందస్సు శాస్త్రాన్ని కనిపెట్టడం. ఎందుకంటే అది సంస్కృతం నుండి ఎన్నో ఆలోచనలను గ్రహించింది. అంతేగాక కంప్యూటర్, గణితశాస్త్రంలోని బైనరీ నొటేషన్ లాంటి వాటితో అనుబంధం కలిగి ఉంది. అందుకనే, తెలుగు లాంటి భారతీయ భాషలు పిల్లల మెదడు పనితీరును ద్విగుణీకృతం చేస్తాయి. తద్వారా భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే శాస్త్రవేత్తలను తయారు చేస్తాయి.’


ఈ సందర్భంగా మొదటి జాతీయ విద్యా విధానంలో 19(1) అధికరణ మన రాష్ట్ర ప్రభుత్వం సవరించినా, విద్యార్థినీ విద్యార్థుల భాషా నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకొని, మన పాత విద్యా కమిషన్లు, కమిటీలైన హర్తోగ్ కమిటీ (1929), సార్జంట్ రిపోర్ట్ (1944), ఖేర్ కమిటీ (ప్రాథమిక విద్య, 1951), ఆచార్య రామమూర్తి కమిషన్ (1990) మొదలైన ప్రముఖ సిఫార్సులను ఈనాటి విద్యా విధానానికి అనుగుణంగా సవరించాలని కోరుకుందాం. ఉదాహరణకు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‍చే నియమించబడిన కూంజురు కమిటీ (1955) ప్రాంతీయ భాషలను విద్యా మధ్యమంగా యూనివర్సిటీ స్థాయిలో కొనసాగించాలని, అలాగే ఆంగ్లభాషను కూడా పైస్థాయిలోనే బోధించాలని సిఫార్సు చేసింది.


ప్రస్తుత ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలోని ప్రాథమిక, సెకండరీ స్థాయిలలో ప్రవేశపెట్టినా, విద్యార్థినీ విద్యార్థులందరికీ మాతృభాషను మర్చిపోకుండా, దానికి ఉద్దేశించబడిన పాఠ్యాంశాలను, ఉపాధ్యాయులు నాణ్యతా ప్రమాణాలతో బోధించాలి. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు భాషకు ప్రయోగశాలలు, పుస్తక బాంఢాగారాలను అన్ని పాఠశాలల్లో నిర్మించాలి. పిల్లల చేత స్వంతంగా కవితలు, కథలు, విమర్శనాత్మక వివరణలు... ఇలా ఎన్నో కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టాలి. అనుభవజ్ఞులైన అధ్యాపకులను పాఠశాల, కళాశాల స్థాయిలో నియమించాలి. పిల్లలతో పాటలు, గేయాలు, సందర్భసహిత వ్యాఖ్యానాలు, మొదలైన భాషాభివృద్ధి కార్యక్రమాలను చేయించాలి. వీలయితే, వారికి ఇష్టమైన నవల, కథ, పద్యాలు, శీర్షికలను అనువాదం చెయ్యమని ప్రోత్సహించాలి.


ఆంగ్లభాషా మాధ్యమంలో బోధన అంటే, మాతృభాషను త్యజించమని కాదు. అన్ని సబ్జెక్టుల్లో ఆంగ్ల మాధ్యమంలో తరగతులు జరిగినా, కొఠారి కమిషన్ సిఫార్సు ప్రకారం, త్రిభాషా జ్ఞానం, ముఖ్యంగా, మాతృ భాష అధ్యయనాన్ని ప్రావీణ్యతను పెంపొందించాలి. తల్లిదండ్రులు భాషను కేవలం మార్కులకే పరిమితం చేయకుండా మన మాతృభాష చందనాల సువాసనలు చెరిగిపోనీయకుండా పిల్లల మనసుల్లో నాటుకునేలా నిత్యం ప్రయత్నిస్తూ ఉండాలి. 


ప్రభుత్వ విధానాలను ఆహ్వానిస్తూనే, వాటిలోని లోటుపాట్లు సరిదిద్దుతూ, మనం కూడా ప్రభుత్వానికి చేయూతని అందిద్దాం. ఆంగ్లమాధ్యమం ఈనాటి పోటీ ప్రపంచంలో నెగ్గటానికి అనివార్యమైనా, మాతృభాషమాత్రం విద్యార్థినీ విద్యార్థుల మానసిక, శారీరక, పరిపూర్ణ వికాసానికి దోహదపడడమే కాకుండా, ఇతర భాషలు, సబ్జెక్టులు నేర్చుకోవటంలో అద్భుతమైన సాధనంగా పని చేస్తుంది. మరి ఈ శక్తివంతమైన ఆయుధాన్ని సరైన రీతిలో అమల్లో పెడదామా?

డా. పి.వి.రాధిక

అధ్యాపకురాలు, మానసిక విశ్లేషకురాలు

Advertisement
Advertisement
Advertisement