Abn logo
Aug 7 2020 @ 03:05AM

ప్రకాశంలో టీచర్‌ ట్రైనింగ్‌ వర్సిటీ

  • విద్యామంత్రి ఆదిమూలపు సురేష్‌


దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రకాశం జిల్లాలో టీచర్‌ ట్రైనింగ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. దీనిద్వారా కిండర్‌ గార్డెన్‌ విద్యలో భాగంగా సర్టిఫికెట్‌ కోర్సులు నిర్వహించనున్నామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న టీచర్‌ ట్రైనింగ్‌ సెంటర్లన్నీ ఈ వర్సిటీకి అనుసంధానం చేస్తామన్నారు. ఉన్నత విద్యపై గురువారం సీఎం సమీక్ష అనంతరం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో మరో యూనివర్సిటీ(కన్వెన్షనల్‌)ని ఏర్పాటు చేస్తామన్నారు.


ఈ రెండు వర్సిటీలలో ఈ విద్యా సంవత్సరం నుంచే బోధన ప్రారంభమవుతుందని మంత్రి పేర్కొన్నారు. విద్యారంగంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఏ తరగతిలోనూ డ్రాపౌట్లు ఉండకూడదని సీఎం స్పష్టం చేశారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్‌ కోర్సులు ప్రారంభిస్తామన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీలను మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచుతూ వాటిని డిగ్రీ ఆనర్స్‌ కోర్సులుగా పరిగణిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు చేపడతామని మంత్రి చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement