Abn logo
Dec 5 2020 @ 01:12AM

డ్వా‘మాయలు’..!

బదిలీల్లో యథేచ్ఛగా నిబంధనల అతిక్రమణ 

కలెక్టర్‌ ఉత్తర్వులే తారుమారు!

తొలి ఆర్డర్లకు బదులుగా కొత్త స్థానాలకు మళ్లీ ఉత్తర్వులు

నివ్వెరపోతున్న సిబ్బంది

అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 4: జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) బదిలీల్లో వింతలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నెల రోజు ల క్రితం పలు కేడర్ల ఉద్యోగులు, సిబ్బందిని బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కసారి కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేస్తే ఆ జాబితాలో కేటాయించిన స్థానాలకే సిబ్బందిని బదిలీ చేయాల్సి ఉంది. ఆ మేరకు సదరు ఉద్యోగులు, సిబ్బందికి ఉత్తర్వులివ్వాలి. డ్వా మా బదిలీల్లో అందుకు విరుద్ధంగా సాగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులను తారుమారు చేశారన్న ఆరోపణలున్నాయి. తొలుత జారీ చేసిన ఉత్తర్వులకు బదులుగా కొందరు ఉద్యోగులు, సిబ్బందికి కొత్తస్థానాలు కేటాయిస్తూ తాజాగా మారోమారు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామంపై మిగిలిన ఉద్యోగులు నివ్వెరపోతున్నారు. ఒకసారి కలెక్టర్‌ ఆర్డర్‌ ఇచ్చిన తర్వాత ఆయన అనుమతి లేకుండా మళ్లీ ఎలా మారుస్తారన్న ప్రశ్న లు తలెత్తుతున్నాయి. పలు మండలాల్లో రాజకీయ నేతల నుంచి ఉన్నతాధికారికి ఒత్తిళ్లు తెప్పించి, కొందరు సిబ్బంది కొత్తగా ఆర్డర్లు మార్చుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. వారం రోజులుగా డ్వామా పీడీ కార్యాలయం కేంద్రంగా ఈ తంతు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొన్ని మండలాల్లో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీ పలువురు సిబ్బంది రిలీవ్‌ కావట్లేదు. కొద్ది రోజుల్లో తిరిగి పాత స్థానాలకే ఆర్డర్‌ తెప్పించుకుంటామని ఆయా ప్రాంతాల్లో బాహాటంగా చెప్పుకుంటుండటం గమనార్హం.


యథేచ్ఛగా నిబంధనల అతిక్రమణ 

జిల్లా వ్యాప్తంగా డ్వామాలో ఏపీఓలు 31, ఈసీ/జేఈ 28, టెక్నికల్‌ అసిస్టెంట్లు 213, కంప్యూటర్‌ ఆపరేటర్లు 166, ప్లాంటేషన్‌ సూపర్‌వైజర్లు 3, సీడీ-సీఎల్‌ఆర్‌సీ 2 మొత్తం 443 మంది ఉద్యోగులు, సిబ్బందిని బదిలీ చేశారు. నిబంధనల మేరకు సొంత మండలాలు, మూడేళ్లు ఒకే స్థానంలో కొనసాగుతున్న వారిని బదిలీ చేయాల్సి ఉంది. ఐదేళ్లు దాటిన వారిని ఇతర క్లస్టర్‌కు పంపాలి. ఇటీవల కొందరు సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. కొందరిని సొంత మండలాల్లోనే ఉంచినట్లు తెలిసింది. మరికొందరు సిబ్బందికి ఒకే క్లస్టర్‌ పరిధిలో ఐదేళ్లు పూర్తయినా దాని పరిధిలోనే స్థానాలు కేటాయించారన్న విమర్శలున్నాయి. కలెక్టర్‌ ఉత్తర్వుల్లో కేటాయించిన బదిలీ స్థానాలకు బదులుగా వారికి నచ్చిన స్థానాలతో రెండోసారి ఉత్తర్వులు జారీ చేయటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా బదిలీల్లో నిబంధనల అతిక్రమణలు సాగటంపై ఆ శాఖలో చర్చ సాగుతోంది. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే బదిలీ ఉత్తర్వులు జారీ చేసి నెల రోజులైనా ఇప్పటికీ బదిలీ పంచాయతీ నడుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎంతున్నా మరీ ఇంత విరుద్ధంగా ఉత్తర్వులు మార్చటం ఎన్నడూ చూడలేదంటూ ఆ శాఖలోని కొందరు ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారిస్తేనే బదిలీల్లో ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి  ఏ మేరకు జిల్లా యంత్రాంగం స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Advertisement
Advertisement
Advertisement