Abn logo
Oct 23 2021 @ 00:05AM

ముగిసిన శ్రీవారి కల్యాణోత్సవాలు

ద్వారకా తిరుమలలో స్వామి అమ్మవార్లకు శ్రీపుష్పయాగం

ద్వారకా తిరుమల, అక్టోబరు 22 : ఎనిమిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశ్వయుజ మాస తిరు కల్యాణ మహోత్సవాలు ముగిశాయి. చివరి రోజు శుక్రవారం ఉదయం రాజాధిరాజ వాహనంపై శ్రీవారి కోవెల ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీవారి యాగశాలలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఆలయ పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి మంగళస్నానాలు చేయించారు. ముత్తయిదువులను పిలిచి బుట్టలో దాన్యం, పసుపు కొమ్ములు వేసి రోకళ్లతో దంచారు. ఇలా వచ్చిన చూర్ణంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు చేశారు. చూర్ణోత్సవ జరుపుకున్న స్వామి, అమ్మవార్లకు మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణ నడుమ వసంతోత్సవం నిర్వహించారు. ఆలయ పండితులు ఈ కల్యాణమూర్తులు స్నానం చేసిన పవిత్ర జలాన్ని భక్తులకు వసంతాలుగా చల్లారు. స్వామి, అమ్మవార్లను రాజాధిరాజ వాహనంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగిస్తూ వసంతోత్సవాన్ని వైభవోపేతంగా జరిపించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని వసంతాలను చల్లుకున్నారు.


శాస్త్రోక్తంగా పుష్ప యాగోత్సవం..


శుక్రవారం రాత్రి స్వామి వారి పుష్పయాగోత్సవాన్ని సంప్రదాయ బద్దంగా జరిపించారు. 12 రకాల వాయినాలు, 12 గీతాలు ఆలపించి పవళింపు సేవ చేశారు. 12 రకాల పిండి వంటలు నివేదన చేశారు. ముందుగా ద్వాదశ కోవెల ప్రదక్షిణలు నిర్వహించారు. మేళతాళాలు సన్నాయి వాయిద్యాల నడుమ ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం పుణ్యస్త్రీలకు పసుపు, కుంకుమ, గాజలు, జాకెట్టు ముక్కలు అందజేశారు.

కోవెల ఉత్సవం