Abn logo
Oct 15 2021 @ 01:16AM

విజయోస్తు

  • నేడే విజయదశమి
  • జిల్లావ్యాప్తంగా శోభాయమానంగా ముస్తాబైన ఆలయాలు
  • విద్యుత్‌కాంతులతో ధగధగలు.. భక్తుల కోలాహలాలతో సందళ్లు
  • పండగకు అనేక ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరిన జనం
  • పల్లెలన్నీ కళకళ.. కుటుంబ సభ్యులంతా ఒకేచోటకు చేరడంతో ఉత్సాహం
  • పండగ రద్దీతో గురువారం కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

నేడే దసరా. సకల విజయాలు కలిగించే విజయదశమి  పర్వదినం. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి పండగకు జిల్లావ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యు త్‌ కాంతులతో ధగధగలాడుతున్నాయి. భక్తుల కోలాహలం తో కిక్కిరిశాయి. గడచిన ఎనిమిది రోజులుగా రకరకాల రూపాల్లో అమ్మవారు దర్శనమివ్వగా, శుక్రవారం విజయదుర్గ అవతారంలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో పండగరోజు పెద్దఎత్తున భక్తులు ఆలయాలకు పోటెత్తనున్నారు. దశమిరోజున దర్శనాల కోసం బారులు తీరనున్నారు. అందు కోసం అన్ని ముఖ్యమైన ఆలయాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పిఠాపురం పాదగయ ఆలయం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది. రాజమహేంద్రవరం దేవీచౌక్‌తోపాటు అమలాపురంలో అనేక ఆలయాల్లో కోలాహలం నెలకొంది. పూజలు, భజనలతో పండగ కళ కనిపిస్తోంది. మరోపక్క శుక్రవారం పండగ కావడంతో వచ్చే రద్దీని తట్టుకునేందుకు కీలక ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. మరోపక్క కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఎక్కడికక్కడ జిల్లావ్యాప్తంగా పండగ వాతావరణం బాగా కనిపిస్తోంది. ఎక్కడో దూరప్రాంతాల్లో ఉన్న జిల్లావాసులు గురువారం స్వస్థలాలకు చేరారు. దీంతో అన్ని ఆర్టీసీ బస్టాం డ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వచ్చే విమాన సర్వీసులన్నీ ఫుల్‌ అయిపోయాయి. టిక్కెట్‌ రూ.8 వేల వరకు పెరిగిపోయింది. అటు రైళ్లు కూడా కిక్కిరిసిపోయాయి. ఒకరకంగా చెప్పాలం టే దూరప్రాంతాల్లో ఉన్నవారంతా ఇళ్లకు చేరడంతో జిల్లావ్యా ప్తంగా పల్లెలన్నీ అయినవాళ్లు, ఆప్తుల సందడితో కళకళలాడుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే ఇప్పటికే దసరా పండగతో మార్కెట్లన్నీ కొనుగోళ్లతో కిటకిటలాడుతున్నాయి. దసరా రోజు కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనే ఆనవాయితీ నేపథ్యంలో శుక్రవారం బైక్‌లు, కార్లు విక్రయాలు పెరుగుతాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు ఎలకా్ట్రనిక్స్‌, వస్త్ర దుకాణాలు సైతం పండగ రోజు కిక్కిరియనున్నాయి. అటు పండగకు కొత్త సినిమాలు కూడా పెద్ద ఎత్తున రిలీజ్‌ కావడం, సినిమా థియేటర్లలో పూర్తి స్థాయి సీటింగ్‌కు ప్రభుత్వం అనుమతించడంతో బొమ్మకు రద్దీ పెరగనుంది. ఇదంతా ఒకెత్తయితే దసరా పండగ నేపథ్యంలో జిల్లాకు పర్యాటకుల తాకిడి మరింత పెరగనుంది. పండగ సెలవులు రావడంతో జిల్లా అందాలు చూసేందుకు ఇతర ప్రాంతాల పర్యాటకులు కాకినాడ, రాజమహేంద్రవరం చేరుకున్నారు. దీంతో ఇక్కడి హోటళ్లు రద్దీగా మారాయి. వీరంతా పర్యాటక ప్రదేశాలకు ఆదివారం వరకు పోటెత్తే అవకాశం ఉండడంతో పర్యాటకశాఖ అప్రమత్తమైంది.ముఖ్యంగా రంపచోడవరం, మారేడుమిల్లి తదితర పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు భూపతిపాలెం రిజర్వాయరు, సీతపల్లి వాటర్‌ఫాల్‌, జలతరంగిణి వాటర్‌ఫాల్‌, అమృతధార వాటర్‌ఫాల్‌, మన్యం వ్యూపాయింట్‌, సోకులేరు వ్యూపాయింట్‌, మోతిగూడెం వాటర్‌ఫాల్‌, గుడి సె ఇతర ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని ఓ ప్రకటనలో గురువారం పేర్కొంది. కొవిడ్‌ నిబంధనలు పాటించడం, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా పర్యావరణాన్ని కాపాడాలని కోరింది.