Abn logo
Oct 24 2020 @ 00:00AM

వైభవంగా శరన్నవరాత్రోత్సవాలు

Kaakateeya

కడ్తాల్‌ / ఆమనగల్లు : మైసిగండి శివరామాలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ రోజు శనివారం అన్నపూర్ణేశ్వరి, మహాలక్ష్మి, జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవార్లు  దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రముఖ వేదపండితుడు మరళీధర్‌శర్మ ఆధ్వర్యంలో చండీ, గణపతి హోమాలు నిర్వహించారు. చండీహోమంలో మహేశ్వరం తహసీల్దార్‌ ఆర్‌.పి.జ్యోతిఅరుణ్‌, యువజన సంఘాల ఐక్య వేదిక కన్వీనర్‌ ఎర్రోళ్ల రాఘవేందర్‌ దంపతులు కూర్చున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, సర్పంచ్‌ తులసీరామ్‌ నాయక్‌, ఉప సర్పంచ్‌ రాజారామ్‌, రామావత్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లులోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారు లలితాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆమనగల్లు కట్టమైసమ్మ ఆలయంలో మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అదే విధంగా మొక్తాల వెంకటయ్య, బాలమణి దంపతుల ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించారు. మార్కండేయ ఆలయంలో అమ్మవారిని మహాదుర్గాదేవిగా అలంకరించారు. మహిళల బోనాల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరభ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో రాజారాజే శ్వరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. 


విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆయుథ పూజ

ఆమనగల్లు పట్టణంలోని విద్యుత్‌ ఉప కేంద్రంలో శనివారం ఆయుధ పూజ నిర్వహించారు. ఏఈ రమేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌, వస్య, రాజు, బుచ్చిరెడ్డి, శ్రీశైలం, రమేశ్‌, అశోక్‌ పాల్గొన్నారు. 


అమ్మవారిని దర్శించుకున్న ప్రశాంత్‌కుమార్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్నంలోని ఎస్‌బీఐ పక్కన ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన మండపం వద్ద శనివారం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అలాగే ఈశ్వరాంజనేయస్వామి, లక్ష్మీనర్సింహస్వామి ఆలయాల్లోని దుర్గామాత మండపాల వద్ద పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


దుర్గామాత మండపాల వద్ద పూజలు

చేవెళ్ల/షాద్‌నగర్‌/మహేశ్వరం: దసర నవరాత్రుల ఉత్సవాలు చేవెళ్ల మండలంలో కొనసాగుతున్నాయి. రచ్చబండ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత ప్రతిమకు జైభవానీ మాత కమిటీ సభ్యల ఆధ్వర్యంలో శనివారం పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. చేవెళ్లలోని కొనగట్టు ఆలయంలో భ్రమరాంబ అమ్మవారికి, బ్రహ్మగిరి క్షేత్రం, మల్కాపూర్‌, ఆలూర్‌ గ్రామాల్లో దుర్గామాత మండపాల వద్ద పూజలు చేశారు. లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు కనుల పండువగా కొనసాగాయి. మహిళలు ఒకే రంగు చీరలు ధరించి బతుకమ్మ ఆడారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఫరూఖ్‌నగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ  ప్రాంగణంలోని అమ్మవారి ఆలయంలో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పూజ లు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను సన్మానించి ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ నటరాజన్‌, కౌన్సిలర్లు కె.మహేశ్వరి, బచ్చలి నర్సింహా పాల్గొన్నారు. మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయంలో అమ్మవారు మహిషాసురమర్ధిని అవతారంలో దర్శనమిచ్చారు. 

Advertisement
Advertisement