Abn logo
Apr 22 2021 @ 05:23AM

ఆదివాసీ ప్రాంతాలపై డ్రోన్‌ బాంబులు..!

  • అడవి జంతువులు, పక్షులు, ప్రకృతి వినాశనం జరిగింది
  • ఫోటోలు, వీడియో విడుదల చేసిన మావోయిస్టులు


హైదరాబాద్‌/చర్ల/దుమ్ముగూడెం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీని దెబ్బ తీసేందుకు పోలీసులు డ్రోన్‌ సాయంతో బాంబు దాడులు చేశారని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి వికల్ప్‌ ఆరోపించారు. ఈ నెల 19న బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొత్తలంక, పాలగూడెం గ్రామాల్లో ఆదివాసీ ప్రాంతాలపై దాడులు చేశారంటూ ఫొటోలతోపాటు, పత్రికా ప్రకటనను బుధవారం విడుదల చేశారు. విక్పల్‌ పేరుతో ఉన్న ఆ లేఖలో మావోయిస్టు పార్టీని దెబ్బ తీసేందుకు పోలీసులు వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు. జనావాసాలపై ఈ దాడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పాల్పడ్డాయని ఆరోపించారు. ప్రజాఉద్యమాలు, ప్రజలపై డ్రోన్‌ దాడి చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. దీన్ని బ్లాక్‌ డేగా పరిగణిస్తున్నామన్నారు. సమాధార్‌, ప్రహార్‌లో భాగంగా ఈ నెల 3న అడవుల్లోకి వచ్చిన పోలీసులను తమ పీఎల్‌జీఏ చంపడాన్ని మోదీ, అమిత్‌ షా, ఇతర పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అనంతరం ‘మావోయిస్టులు చావడమో, పారిపోవడమో’ అన్న కులదీప్‌సింగ్‌ మాటల్లో అర్థమే డ్రోన్‌ దాడులని విమర్శించారు.


ఆకాశంలో డ్రోన్లు, హెలిక్రాప్టర్లు నిత్యం తిరగడాన్ని ప్రమాదంగా శంకించిన ప్రజలు, గెరిల్లాలు తప్పించుకున్నారని, కానీ అడవి జంతువులు, పక్షులకు ప్రమాదం జరిగిందని, ప్రకృతి వినాశనమైందన్నారు.  ఆకాశం నుంచి చేస్తున్న దాడులు ప్రజలకు తీవ్ర ప్రాణ నష్టం చేస్తుందని, డ్రోన్‌ దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రహార్‌ ఆపరేషన్‌, క్యాపుల ఏర్పాటు ఆపాలని, స్థానిక యువకులతో ఏర్పాటు చేస్తున్న డీఆర్జీ, బస్తర్‌ బెటాలియన్‌ రిక్రూట్‌మెంట్‌ ఆపాలని, లోన్‌వర్రాట్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ దాడులపై బస్తర్‌ సంబాగ్‌లోని ప్రజాప్రతినిధులు తమ వైఖరి స్పష్టం చేయాలని, ప్రజలపై చేస్తున్న దాడులకు నిరసనగా ఈ నెల 26న భారత్‌ బంద్‌కు పిలుపునిస్తున్నామని, ప్రహార్‌, డ్రోన్‌ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆ లేఖలో కోరారు. మావోయిస్టుల ఆరోపణల్లో నిజం లేదు

బస్తర్‌ ఐజీపోలీసులు డ్రోన్‌ బాంబులు విడిచారన్న మావోయిస్టుల ఆరోపణల్లో నిజం లేదని బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజన్‌ తెలిపారు. పోలీసులు దాడులు చేస్తారనే భయంతోనే మావోయిస్టులు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరి ప్రాణాలు కాపాడి, ప్రకృతిని ఆహ్లాదకరంగా ఉంచడమే పోలీసుల లక్ష్యమన్నారు. మావోయిస్టులు ఐఈడీ పెట్టడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బాధితుల్లో అడవి జంతువులు, పేదలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. కాగా, బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఒక ఏఎఎస్‌ఐను మావోయిస్టులు కిడ్నాప్‌ చేయగా.. ఐఈడీ పేలిన సంఘటనలో ఒక జవాను మృతి చెందారు.

Advertisement
Advertisement
Advertisement