Abn logo
Oct 22 2020 @ 00:40AM

‘ఫిరంగి’ నాలా ఏమైంది?

Kaakateeya

కబ్జాలకు గురైన ‘ఫిరంగి’ నాలా పునరుద్ధరణ జరిగేనా..?

నీటి మూటలుగా పాలకుల హామీలు

దశాబ్ధాలు గడచినా మరమ్మతుకు నోచని వైనం

కబ్జా కోరల్లో కాలువలు, చెరువులు..పట్టించుకోని పాలకులు


పేరులో ఉన్న బలం... దాని భౌతిక రూపంలో లేకుండా పోయింది. అదే ఫిరంగి నాలా. నాడు నిజాం నవాబులు సాగు, తాగునీటి కోసం అతి తక్కువ ఖర్చుతో ఫిరంగి నాలాను నిర్మిస్తే.... నేడు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులను చేపట్టింది.  నీటి ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది. నాడు అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఇంజనీరింగ్‌ ప్రమాణాలతో నిర్మించిన ఫిరింగి నాలా కనుమరుగవుతున్నా దాన్ని పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌ మహానగరానికి పడమర,దక్షిణ దిక్కులను కలుపుతూ సుమారు వంద కిలో మీటర్ల  పొడవున నిర్మించిన ఈ ఫిరంగి నాలా నేడు ఆనవాళ్లు లేకుండా పోతోంది.


హైదరాబాద్‌ సిటీ / శంకర్‌పల్లి / మొయినాబాద్‌ : తెలంగాణలో తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు కలగకుండా నాటి నిజాం పాలకులు చెరువులు, కాలువలు, కత్వలు నిర్మించారు. 1872 సంవత్సరంలో ఏర్పడిన కరువుకాటకాలను అధిగమించేందుకు, అలాగే భవిష్యత్తులో ఈ ప్రాం తంలో నీటి కరువు దాపురించకుండా ఉండేందుకు అప్పటి నిజాం పాలకులు ఫ్రెంచి, ఇంగ్లాండ్‌ ఇంజినీర్ల సాయంతో వరదనీటి కాలువను నిర్మించారు. నగరానికి పడమర దిక్కున ఉన్న రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌ మండలం చందన్‌వెల్లి సమీపంలో ఈసీ వాగుపై ఫిరంగినాలాను నిర్మించారు. ఈ నాలాతో పూర్వ రంగారెడ్డి జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి మొదలై దక్షణ ప్రాంతం మీదుగా తూర్పు ప్రాంతానికి అవసరమైన నీటి వనరులను సమకూర్చాలనేది ముఖ్య ఉద్దేశం. షాబాద్‌ మండలం చందనవెల్లి చెరువు నుంచి  మొదలయ్యే ఫిరంగి నాలా పొడవు సుమారు 85 కి.మీ.ల మేర ఉంటుంది. 50 చెరువులను అనుసంధానం చేస్తుంది. ఒక చెరువు నిండిన తరువాత దాని అలుగు నుంచి మరో చెరువులోకి వెళ్లేందుకు వీలుగా నిర్మించారు. అప్పట్లో చందన్‌వెల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఉన్న చెరువులన్నీ నిండేవి. ఫలితంగా వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందింది. వందలాది గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించిన ఈ ఫిరంగి నాలా(కాలువ) నేడు పాలకుల నిర్లక్ష్యంతో కాలక్రమేణ భూకబ్జాదారుల వశమై ఆనవాలు కోల్పోయింది.


ఇదీ ఫిరంగి నాలా చరిత్ర...

నిజాం నవాబుల కాలంలో ఫ్రెంచ్‌, ఇంగ్లీష్‌ ఇంజనీర్ల సలహాలతో కాలువ నిర్మాణాన్ని చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. షాబాద్‌ మండలం చందన్‌వెల్లి గ్రామానికి తూర్పున చేవెళ్ల, మొయినాబాద్‌, మండలాల సరిహద్దుల్లో ‘ఈసీ’ నదిపై సుమారు రెండు ఫర్లాంగుల పొడవున ఈ ఆనకట్ట నిర్మించారు. (ఫిరంగి కాలువ ముఖద్వారం వద్ద గల శిలా ఫలకం ప్రకారం) కాలువను 48 మీటర్ల వెడల్పు, 85కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. రాజధానికి తాగు నీటిని అందించే హిమయత్‌సాగర్‌కు, దానికి పశ్చిమ, వాయువ్య దిశలో గల 40 నుంచి 50 గ్రామాలకు తాగు, సాగునీటిని అందించే ఉద్దేశంతో దీనిని నిర్మించారు. ఈసీ నది జలాలు ఫిరంగి కాల్వ ద్వారా కుంటలు, చెరువులను నింపుతూ ఇబ్రహీంపట్నం చెరువు వరకు ప్రవహించే విధంగా ఏర్పాటు చేశారు. సోలిపేట పెద్దచెరువు, చందనవెల్లి చెరువు, రామంజాపూర్‌ (మద్దూర్‌కుంట), పాలమాకుల చెరువు, శంషాబాద్‌ చెరువు, హయత్‌ నగర్‌ చెరువు, ఇంజాపూర్‌ చెరువు, కొత్త చెరువు (తుర్కయంజాల్‌), ఇబ్రహీంపట్నం చెరువు, తుక్కుగూడ చెరువులపై ఆధారపడి వేలాది ఎకరాలకు సాగునీటి అందించే విధంగా అప్పటి నిజాం పాలకులు నిర్మించిన ఫిరంగి కాలువ కాలగర్భంలో కలిసి పోయే స్థితికి చేరుకుంది. ఈ కాలువ నిర్మాణం వల్ల వచ్చి చేరే నీటితో అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు సాగయ్యేవి.  ఒక్క ఇంజాపూర్‌ చెరువు కిందనే 1967 నాటి వరకు  721 ఎకరాల ఆయకట్ట భూములు సాగుకు నోచుకునేవి. 


కబ్జా కోరల్లో ..

ఫిరంగి నాలా పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం కారణంగా కబ్జాకు గురయ్యింది. ఫిరంగి నాలా పొడవునా అనేక ప్రాంతాల్లో కబ్జాలు పెరిగి పోయాయి. పెద్దఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగింది. దీంతో దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలో నాలా కబ్జాకు గురైంది. హిమాయత్‌ సాగర్‌ నుంచి  మొదలుపెడితే ఎర్రకుంట, పహాడిషరీఫ్‌, కొత్తపేట, వెంకటాపూర్‌, నాదర్‌గుల్‌లతోపాటు అనేకచోట్ల కాలువ గండి పడిపోవటంతోపాటు పెద్ద ఎత్తున కబ్జాకు గురయింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వృద్ధికావటంతో కాలువ ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి.  తుర్కయాంజల్‌లోని కొత్తచెరువు, ఇబ్రహీంపట్నం చెరువు, నాదర్‌గుల్‌లోని మన్సూర్‌ఖాన్‌ చెరువు, ఇంజాపూర్‌లోని ఇంజాపూర్‌ చెరువు, హయత్‌నగర్‌ చెరువులో అనేకచోట్ల అమ్మకాలు చేయటానికి వీలులేని ఎన్నో ఇనామ్‌ పట్టా భూములు నేడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల పాలయ్యాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ కాలువ పరివాహం మొత్తం ఎండిపోయింది. ఎన్నోచోట్ల కాలువను పూడ్చి భారీ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.


అద్బుతమైన ఇంజనీరింగ్‌ ప్రమాణాలు..

ఫిరంగి నాలా నిర్మాణంలో అద్భుతమైన ఇంజనీరింగ్‌ ప్రమాణాలను అప్పటి ఇంజనీర్లు పాటించారు. అంతకుముందే ఉన్న చెరువులను పరిగణలోకి భారీ వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరద నీరు వృథాగా పోకుండా ఒక చెరువు నిండిన తర్వాత మరో చెరువులోకి వె ళ్లేలా ఫిరంగి నాలాను నిర్మించారు. దీనివల్ల వరద నీరు పంట పొల్లాల్లోకి,  ఊళ్ల మీదకు రాకుండా ఫిరంగి నాలా ద్వారా మళ్లించి, చెరువులు నింపి, చెరువుల కింద వేలాది ఎకరాల పంట పండేందుకు, భూగర్భ జలాలు పెరిగేలా చేశారు.


అప్పుడు ఏం జరిగేది...? ఇప్పుడు ఏం జరిగింది....

నిజాం నవాబుల కాలంలో నిర్మించిన ఫిరంగి నాలాలో వరద నీరు పారుతూ ఆ మార్గంలో ఉన్న ఒక్కొక్క చెరువు నిండుతూ, కింద ఉన్న చెరువులకు వెళుతూ ఉండేంది. ఇలా ఫిరంగి నాలా కింద సుమారు 50 చెరువులు ఉండేవి. ప్రస్తుతం  ఫిరంగి నాలా హిమాయత్‌సాగర్‌  ఔటర్‌ రింగు రోడ్డు దాటిన తర్వాత శంషాబాద్‌-గగన్‌పహడ్‌ ప్రాంతం నుంచి  మొదలు కొని జల్‌పల్లి, శ్రీరాంనగర్‌, బాలాపూర్‌ మల్లేపల్లి మీదుగా ఎర్రకుంట, పహాడిషరీఫ్‌, నాదర్‌గుల్‌లతోపాటు అనేకచోట్ల కాలువలు గండి పడిపోవటంతోపాటు పెద్దఎత్తున కబ్జాలు పెరిగిపోవటం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వృద్ధికావటంతో కాలువ ఆనవాళ్లు కూడా లేకుండా తయారైంది. జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు శివారు మునిసిపాలిటీలైన జల్‌పల్లి, బడంగ్‌పేట,తుర్కయాంజల్‌ పరిధిలో ఉన్న ఫిరంగి నాలా కబ్జా అవుతూ వస్తోంది. ఇక్కడ గజం ధరం రూ.15వేల నుంచి 20వేలు పలుకుతోంది.


30 కి.మీ మేర ధ్వంసమైన ఫిరంగి నాలా..

చరిత్రకారులు చెబుతున్న లెక్క ప్రకారం 85 కి.మీ మేర ఫిరంగి నాలా ఉంటే... అందులో నగరాన్ని ఆనుకొని వెళుతూ ఉండే ప్రాంతంలో సుమారు 30 నుంచి 40 కి.మీ మేర ఎక్కడికక్కడ కబ్జాకు గురైనట్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్లాట్లు చేసి విక్రయించినట్లు ఆంధ్రజ్యోతి చేసిన పరిశీలనలో తెలిసింది. భారీ వర్షాలకు వచ్చే వరదనీరు ఈ ఫిరంగి నాలాలో పారుతూ ఉంటే ఒక్కో చెరువు నిండుతూ కిందకు వెళ్లేదే తప్ప, ఇళ్లు మునగడం, రోడ్ల మీదకు వరద నీరు వచ్చేది కాదు. అది ధ్వంసం కావడం వల్లే పాతబస్తీ వైపు వరద ముంపు ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.


ఫిరంగి నాలా ధ్వంసం కావడం వల్లే పాతబస్తీ వైపు వరదనీరు

ఫిరంగి నాలాను పునరుద్ధరించాలని గతంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై, ఈ నాలా ఎందుకు పనికి రాదని చెప్పి అప్పటి కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలను కొట్టివేసింది. ఒకప్పుడు వర్షం ఎక్కువ వస్తే వరద నీరంతా చెరువుల్లోకి వెళ్లేలా వరద నీటి కాలువను నిర్మించారు. ఇలా పదుల సంఖ్యలో చెరువుల్లోకి వరద నీరు వెళ్లేలా ఫిరంగి నాలాను అప్పటి ఇంజనీర్లు నిర్మించారు. కానీ ఇది ఇప్పటి ఇంజనీర్లకు అవగాహన లేక, అధ్యయనం చేయక వారు ఎక్కడైనా ఇలాంటివి ఉంటే వాటిని ధ్వంసం చేసుకుంటూ పోయారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు మేలు చేసేలా ప్రభుత్వాలు, అధికారులు పనిచేశారు. ఈ రోజు ఫిరంగి నాలా విధ్వంసం  కావడంతోనే 50 శాతం వరద నీరు పాతబస్తీ వైపునకు వచ్చింది. 

- బీ.వీ.సుబ్బారావు, హైదరాబాద్‌ పర్యావరణ నిపుణులు

Advertisement
Advertisement