Abn logo
May 11 2020 @ 03:28AM

స్వప్న సుషుప్తిలో మృత్యుకాంక్షాతప్తుడు

‘‘తలదిండుకోపక్క హోమర్‌నూ, మరోపక్క లావోట్సునూ పెట్టుకుని కలలో కనిపించే భయంకర సముద్రపు రెక్కల పిల్లుల నుంచి తప్పించుకుని నిద్రపోవడం నీకు వచ్చు. భూగోళం మునిగిన చెరువులో స్వరాల గాలాల్తో చేపలు పట్టే అనుభవమూ నీకుంది. నువ్వు బతకాలి.’’ - ‘మాయావి’ (నీలంమాయ) తెలుగు కవిత్వంలో జీవలాలస చవిచూడాలనుకునేవారికి సైదాచారి కవిత్వం గొప్ప లోతైన అనుభవం ప్రసాదిస్తుంది. ‘‘నిన్ను తెలుసుకుంటూ తెలుసుకొనలేకా/ దేన్నీ వొదల్లేనితనంతోనే కడతేరుతున్నాను,’’ అంటూ మనకు కడసారి వీడ్కోలు చెప్పి సౌందర్యంలో లీనమైపోయిన మన కాలపు కవి సైదాచారి. మాతృగర్భానికి మరలివెళ్లిన అండ, పిండ, బ్రహ్మాండ సదృశుడు కవి సైదాచారి.


"And death shall have no dominion/ Dead men naked they shall be one/... They shall have stars at elbow and foot; Though they go mad they shall be sane,/... Though lovers be lost love shall not; And death shall have no dominion.''

Dylan Thomas


*****

చలం మాటల్లో చెప్పాలంటే ‘‘యవనవ్వన’’ కవి అయిల సైదాచారి. నవయవ్వనం/ యవ్వనం కవిగా అతని జీవితాన్ని ఆవరించి ఆవహించి ఉన్మత్తుడిని చేసింది. స్థిరమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకునే ఆ రెండు దశలలో అతడిని లోతుగా ప్రభావితం చేసిన అంశాలే భావి జీవితాన్నే కాదు, అతడి కవన శరీరాన్నీ తీర్చిదిద్దాయి. 

*****

‘‘ఇంట్లో జుట్టుని దువ్వుకొని

బయటికెళ్ళేటపుడు చెరుపుకుందాం’’ 

(‘విశృంకల’ - ఆమె నా బొమ్మ)

మనిషి యవ్వన దశను బొమ్మ కట్టే ఈ కవిత కవి స్వేచ్ఛానురక్తిని చాటుతుంది. సైదాచారి కవిత్వానికి కేంద్ర బిందువు స్త్రీ. ఆ విధంగా అతనిది చలం, కృష్ణశాస్త్రి, బుచ్చి బాబుల మార్గం. స్త్రీ కోసం అతను సాగించిన అన్వేషణ ఆసాంతం (తెలుగు సాహిత్యంలో/ కవిత్వంలో) వినూత్నం. కృష్ణశాస్త్రి, బుచ్చిబాబుల మాదిరి స్త్రీని ఆరాధించడంతో ఆగక, చలంలాగ ప్రేమించాడు, కామించాడు, మోహించాడు. స్త్రీ వినా జీవితం లేదనుకున్నాడు. చలం మాదిరే మన కవికీ తన స్త్రీ లభించలేదు. స్త్రీ లభించలేదనే వ్యథ, అతృప్తి అతడిని దహించివేసింది. ఆ క్షోభ అతడిని మృత్యుమార్గం పట్టిచ్చింది. 

***** 

‘‘పాలు మరచినట్టే లేదు

చన్నునొదిలి చన్నుబట్టేదాకా నీ కోసమే తపించాను.’’ 

(‘తోలుబొమ్మలాట’ - ఆమె నా బొమ్మ)

సైదాచారికి తన కవిత్వ సృజనకి బాల్యం ఇంధనం. బాల్యమే కాదు, పసిబాల్యం, ఇంకా ముందుకు తల్లి గర్భం లోకి పునఃప్రవేశించి పిండదశను ఆలింగనం చేసుకుం టాడు. ఉమ్మనీటిలో ఈదులాడుతాడు. ఆ పిండస్థ పెను చీకటిలో అచేతనలో సైతం జాగరూకుడై దేవులాడుతాడు తన బొమ్మ కోసం. శిశువుగా ‘‘ప్రేమ కావాలి/ నాకో పాయి కావాలి’’ (‘పాయి’) అని తన తల్లిని కోరిన కోర్కె పెరిగి పెద్దయ్యాక తల్లి స్థానాన్ని భర్తీ చేసిన సతిని కూడా కోరాడు. కానీ అది తీరని కోరికగానే మిగిలింది. అందుకే ‘‘కుంతి జాడ తెలియని కర్ణుడ్ని/ నేనొక విచలిత శిశువును’’ (‘నాకెవరూ లేరు’ - ఆమె నా బొమ్మ) అని ఆదిలోనే ప్రకటిస్తాడు. ‘‘దగద్ధగా యమైన ఒక స్త్రీ మూర్తి కావాలి నాకు/ మందుబెట్టి మలుపు కుందా అన్నంత/ మోహంలో చుట్టెయ్యాలి’’ (‘వడిసెలదిప్పే చెయ్యెవరిది?’ - ఆమె నా బొమ్మ) అని వాంఛించిన కవి అందుకుగాను ‘‘స్త్రీ ముందు మోకరిల్లుతూనే’’ ఉన్నాడు. అంతేకాదు. ‘‘ఏం నచ్చదు చెప్పు నాలో నీకు/ ఈ చెయ్యి నరుక్కోనా/ కాలు తెగ్గోసుకోనా/ మొత్తం దేహాన్నే చుట్టజుట్టి ఎక్కడైనా పాతిపెట్టుకుని రానా/’’ అని ప్రశ్నిస్తాడు తన ప్రేయసిని. 

*****

‘‘మన ఇంటి ప్రహరీ గోడల్ని మనమే

భయంగా దూకి పారిపోదామా!’’ 

(‘పాచికలు’ - ఆమె నా బొమ్మ)

వివాహ వ్యవస్థ వైఫల్యంపాలుగాక తప్పని స్థితి సర్వత్రా నెలకొని వున్నదని కవి భావన. అందుకే మన కాలపు విశిష్ట కవి గుడిహాళం రఘునాథం లాగే వైవాహిక జీవితంపై తన అసంతుష్టిని బహిరంగంగా ప్రకటించాడు ‘పాచికలు’ కవితలో. కవి చిత్రించిన ఆ జీవితం స్వీయమే కాదు, అస్వీయం కూడా. ‘‘కలిసే ఉంటున్నాం పెండ్లితో విడిపోయాక/ మనమే ఆటగాళ్లం మనమే పావులమైన జూదాన్ని/ మధ్యలోనే ఆపేద్దామా’’ అని ప్రతిపాదిస్తాడు. ‘‘నేనో దిక్కు నుంచీ నువ్వో దిక్కు నుంచీ ఎదురుపడి/ పరిచయం చేసుకుందామా కొత్తగా’’ అంటూ ముగిసే ఈ కవితతో పాటు ‘గుహ’ అనే ఇంకో కవిత కూడా ‘వివాహం’ పైనే ఎక్కుపెడుతుంది: ‘‘నా తెగిన చిటికెన వేలునింకా పట్టుకునే వున్నావా?’’ అని ప్రశ్ని స్తాడు కవి తన జీవన సహచరిని ఈ కవితలో. ‘‘పారి పోతావా నా గుహలోంచి/ కోరల గాయాల మంటల్నూదు కుంటూ, ఆర్పుకుంటూ’’ అంటూ సలహా ఇస్తాడు. ‘‘కాలుతున్న పెండ్లిబట్టల కమురువాసన’’ ఈ కవితను మరువనివ్వదు. ఫలితంగా వివాహితుడైన కవి లిబరేటెడ్‌ ఉమన్‌ని స్వప్నిస్తాడు ఇంకో కవితలో. ‘‘ఆమె నా మోహాన్వేషణ మజిలీ’’ అని చివరాఖర్న ఆశావహంగా ప్రకటిస్తాడు. 

*****

‘‘దుఃఖ కారణాల్నీ, దుఃఖ కారకుల్నీ

నిరంతరం అక్కునజేర్చుకోవడమొక్కటే మిగిలింది’’ 

(‘పరాగ దుఃఖం’ - ఆమె నా బొమ్మ)

దుఃఖం సైదాచారి కవిత్వానికి అంతర్‌బహిర్‌ హేతువు. అంతఃస్రవంతికూడా. పసితనంలో తల్లినుంచీ, పెరిగిపెద్దయ్యాక జీవనసహచరినుంచీ ఎడబాటు ఈ దుఃఖానికి ప్రధాన కారణం. ‘‘ఆకాశం చుట్టూ (ఎడతెగని) కన్నీటిపొర’’ అసలు కారణం. ‘‘స్త్రీ అర్థమయ్యేం దుకు స్త్రీని ఆవాహన చేశాను/ దేహాల్ని చది వేందుకు దేహాన్ని రద్దు చేసుకున్నాను.’’ కవి సంకట స్థితికి నిదర్శనం ఈ కవితా చరణాలు. ‘‘బాల్యమనీ యవ్వనమనీ/ నా రంగస్థలమ్మీద రెండు తెరలు. ఏదీ లేవదూ, పడిపోదూ/ తెర లోపలా బయటా మంటలు/ ఒక సత్యం కోసం నన్ను నేను కాల్చుకున్నాను.’’ అని ప్రకటించిన కవి ‘అరూపి’ అనే కవితలో ‘‘నీ కాళ్ల కత్తెరల్నీ వక్షాల వధ్యస్థలాల్నీ/ అసంఖ్యాక నగ్న దేహాల్నీ/ మహాయోని ద్వారాల్నీ దాటుకుంటూ పోతున్నా.../ చీకట్లోకి, నీలి కలల నీడల్లోకి/ దిక్కుల్లేని మోహపు తుపానుల్లోకి’’ అంటూ కలవరిస్తాడు. ‘శూన్యద్వారంలోకి’, ‘మహాముద్ర’ - ఈ రెండు కవితలు (తొలిసంకలనం ‘ఆమె నా బొమ్మ’, 2000లోవి) సైదాచారి కవన నిర్మాణ విన్యాసా నికి నిదర్శనంగా నిలుస్తాయి. కవిగా అతని ‘సారాంశం’ యావత్తూ ఈ రెండు కవితల్లో నిక్షిప్తం చేశాడు కవి. 

*****

‘‘మత్తిలి

తూలి

కాలం నిండి

పండు పగిలి

ఆత్మ చాలించనీ’’ 

(‘బోసి’ - ఆమె నా బొమ్మ)

మృత్యుగంధం సుమారు అన్ని కవితలలో చదువరి పసిగ ట్టొచ్చు. కొన్నింటిలో నేరుగా, కొన్నింటిలో చాటుగా... రేఖా మాత్రంగా లేదా తీక్షణంగా...! సారంలో మృత్యువాంఛాసక్తత ప్రస్ఫుటం. జీవితపు ఇరుకుదనం, తీరనిమోహం, తృప్తినివ్వని కవిత్వం (సంగీతం, హోమియో వైద్యం ఇచ్చిన తృప్తి కవిత్వం సైదాచారికి ఇవ్వలేదు) అతడిని మృత్యుకాంక్షకు చేరువ చేశాయి. ‘నీలంమాయ’ (రెండో సంకలనం - 2009) నిండా మృత్యుఛాయ చిక్కగా ఆవరించి వుంటుంది. 


‘‘ఇంకేమీ లేదు.. నేనూ నా కట్టె/ మృత్యుపెదాల ముద్దులు. కౌగిలింతలు. సరసాలు’’, ‘‘తెగిపడ్డ తలలు, తలల్ని చేతుల్లో పట్టుకుని నడిచే మొండేలు,’’ (‘మహాముద్ర’ - ఆమె నా బొమ్మ) చూడొచ్చు మీరు ప్రత్యక్షంగా. ‘‘మట్టి - మృత్యువు - కవి/ ఒకటే రూపం, అనేక ప్రతిబింబాలు’’. కవి ఆత్మని పట్టిచ్చే చరణాలు. కొడవటిగంటి కుటుంబరావు గొప్ప నవల ‘జీవితం’లో (కథానాయకుడు ప్రకాశం) మూడు అధ్యాయాలు ఉంటాయి. మొదటిది పౌరాణికం, రెండోది జానపదం, చివరిది సాంఘికం - తెలుగు సినిమాల మాదిరి. కవి సైదాచారి జీవితాన్ని కూడా మనం పౌరాణిక, జానపద, సాంఘిక పర్వాలుగా వేరుచేసి చూడొచ్చు. అవి బాల్యం (పిండదశ సహా), యవ్వనం (నవ యవ్వనం సహా), జీవితం (అదే- సాంఘికం). మూడో పర్వం జీవితం మృత్యువుగా పరిణమించిన వైనం మనం తన కవి త్వంలో చూస్తాం. ఈ మూడు సన్నివేశాల్ని కవి మనకి ఒకే కవితలో (‘శూన్య ద్వారంలోకి’) కనుల ముందు నిలుపు తాడు: ‘‘మళ్లీ ఎప్పుడో నాలోకి నేను ప్రయాణిస్తున్నప్పుడు.../ నాలో నేను శూన్యమవుతున్నప్పుడు.../ ఎప్పుడో... మళ్ళీ...’’ అని మననం చేస్తుంటాడు.  

*****

‘‘ఇది సుదీర్ఘ సుషుప్తి కాదు

సుఖ వాంఛా స్వప్న వీచిక కాదు’’ 

(‘సముద్రంలో సూర్యుడు’ - ఆమె నా బొమ్మ)

కవి తనను తాను ఇలా పరిచయం చేసుకుంటాడు ‘అపరిచితుడు’ (నీలంమాయ) కవితలో - ‘‘అతనొకప్పుడు మహాగాయకుడు/ కొద్ది కాలం కిందట గొప్ప తాగుబోతు/ఇప్పుడొక కవి’’. టి.ఎస్‌.ఎలియట్‌, డిలాన్‌ థామస్‌, బాదలేర్‌, రింబో, అజంతా, వేగుంట మోహనప్రసాద్‌, గుడిహాళం రఘునాథం రాసిన కవిత్వం ఈ కవిని అబ్బురపరచింది; ఆకర్షించింది. వాళ్ళ కవిత్వం ఛాయలు ఇతని కవిత్వంలో, ఆ రూప విన్యాసంలో పరుచుకుని వుంటాయి. కవిత్వం కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి వెనకాడని ధీరోదాత్తుడు సైదాచారి. అందుకే ‘‘ఉమ్మినద్దిన వేళ్లతో చెరిపేసుకుందాం/సరళరేఖల్ని, గానుగవృత్తాల్ని’’ (‘విశృంకల’) అన్నాడు ధైర్యంగా. సైదాచారి కవిత్వావరణంలోకి ప్రవేశించేవారికి ఒక జాగ్రత్త. ఆవరణ అంతటా తేమ, తడి, తొక్కిడి... స్పర్శేంద్రియ సంరంభం.


ఉమ్మనీరు, చనుబాలు, సారాయి, నెత్తురు, చెమట, వీర్యం అన్నీ కలగలిసిన జిగురు అతుక్కుంటుంది. రొచ్చు, బురద- ఏక కాలంలో నాసిక, చెవి అప్రమత్తం కాక తప్పని స్థితి. తోవంతా భయానకం. భీతిగొలిపే నిశిరాతిరి. భీతావహస్థితిని (డ్రెడ్‌) కావ్య వస్తువు చేసింది తెలుగునాట ఇద్దరే ఇద్దరు. ఒకరు అజంతా. అటు పిదప సైదాచారి. అతని కవన శక్తిని నిర్ధారించే చిన్న ముక్క ఒకటి మీ ముందు... కవిత పేరు ‘ప్రాయోపవేశం’ (నీలం మాయ): ‘‘పరిమార్చు/ నీ చిచ్చర యోనిన్‌ జొనుపుకుని పరిమార్చు/ ఒక్క చితి జెయ్యి నన్ను/ కోర్కెల కాష్టం జెయ్యి/ అగ్నిహస్తంతో దీవించు చల్లగా/ చింతల చిగురు రాల్చి/ మోడునుజెయ్యి చేదుబాపి/ కణకణ మండాలి యీ మాంసం ముద్ద/ బూడిదలో కండర సుఖ ప్రవాహాల/ గురుతులు తేలాలి/ ఎప్పటికైనా తప్పనిదిది. తథ్యమిది./ కాయం లిబూర తుస్సుమనే కాలమిది’’. తెలుగు కవిత్వంలో జీవలాలస చవిచూడాలనుకునేవారికి సైదాచారి కవిత్వం గొప్ప లోతైన అనుభవం ప్రసాదిస్తుంది. తెలుగు కవిత్వ పాఠక సభ ఇంద్రియాలను శుభ్రం చేసి, కొనగోటితో మీటి, పదునెక్కించే ‘విశ్వకర్మ’ ఈ కవి. సృష్టి క్రమాన్ని ప్రశ్నించి నూతన సృష్టికి, ఒరవడికి, అనుభూతికి ద్వారాలు తెరిచే ‘లింగమూర్తి’ ఈ నీలం మాయావి. ‘‘నిన్ను తెలుసుకుంటూ తెలుసుకొనలేకా/ దేన్నీ వొదల్లేని తనంతోనే కడతేరుతున్నాను,’’ (‘చరమశాంతి’ - నీలం మాయ) అంటూ మనకు కడసారి వీడ్కోలు చెప్పి సౌందర్యంలో లీనమైపోయిన మన కాలపు కవి సైదాచారి. మాతృగర్భానికి మరలివెళ్లిన అండ, పిండ, బ్రహ్మాండ సదృశుడు కవి సైదాచారి. 

బటి సురేంద్రరాజు

87909 08538


Advertisement
Advertisement
Advertisement