Abn logo
May 21 2020 @ 07:48AM

ఈ నెల 25 నుంచి విమాన స‌ర్వీసులు

1 నుంచి రోజూ 200 రైళ్ల సేవలు

న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): దేశీయ పౌర విమానయాన సేవలు ఈ నెల 25 నుంచి క్రమంగా పునఃప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ వెల్లడించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని దేశంలోని అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలకు సూచిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను విమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా విడుదల చేస్తుందని తెలిపారు. ప్రధానంగా ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాధి లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అనుమతించనున్నారు. భౌతిక దూరం కోసం విమానాల్లోని మధ్య సీట్లను ఖాళీగా ఉంచాలని తాము భావించట్లేదని హర్దీప్‌ సింగ్‌ పూరీ చెప్పారు. కాగా, లాక్‌డౌన్‌ వల్ల దేశవ్యాప్తంగా నిలిచిపోయిన సాధారణ రైళ్లు నడవడానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ 1 నుంచి ప్రతి రోజు 200 రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం వలస కార్మికుల కోసం ప్రతి రోజూ నడుపుతున్న 200 శ్రామిక్‌ రైళ్లకు ఇవి అదనమని ఆయన స్పష్టం చేశారు.


రైల్వే స్టేషన్లలో బుకింగ్‌ కౌంటర్ల సౌకర్యం ఉండదని, ఆన్‌లైన్‌ టిక్కెట్ల బుకింగ్‌ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. వీటిలో 12 రైళ్లు తెలుగురాష్ట్రాల మీదుగా వెళ్లేవి ఉన్నాయి. కోణార్క్‌, మంగళ, హుసేన్‌ సాగర్‌, ఫలక్‌నుమా, తెలంగాణ , ధనపూర్‌-సికింద్రాబాద్‌, ఏపీ, గోల్కొండ, రాయలసీమ, గోదావరి, దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్‌, ఇతర ఆహార విక్రయాల కేంద్రాలను తెరవచ్చని రైల్వే శాఖ ప్రకటించింది. అయితే, పార్సిల్స్‌ మాత్రమే అమ్మాలని తెలిపింది. కాగా, విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రైవేటు విమానయాన సంస్థలకు కేంద్ర ం త్వరలోనే అనుమతులివ్వనుంది. ‘వందే భారత్‌ మిషన్‌’లో ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా సేవలందిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement