Abn logo
May 28 2020 @ 23:55PM

ఆ చర్చలకు నన్ను పిలవలేదు!

తలసానితో కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారా?

‘‘ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట. నాకు తెలియదు. వార్తలు, పేపర్ల ద్వారా తెలుసుకున్నాను. మరి, (తెలంగాణ ప్రభుత్వంతో) ఏం చర్చలు జరుగుతున్నాయో నాకు తెలియదు’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. తండ్రి ఎన్టీఆర్‌ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించిన ఆయన, నివాళులు ఆర్పించారు. అనంతరం చిత్ర పరిశ్రమలో ప్రస్తుత పరిణామాలు, చిత్రీకరణలు, ఇతర అంశాల గురించి స్పందించారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలిసిన సంగతి తెలిసిందే.


ఆ విషయం తనకు తెలియని చెప్పిన బాలకృష్ణ, ‘‘ఐటి ఆఫీసుల్లో భౌతిక దూరం పాటించడం సాధ్యమవుతుంది. మాకు (సినిమా షూటింగుల్లో) అలా సాధ్యం కాదు కదా! అయితే త్వరగా షూటింగులు మొదలుపెడితే మంచిది. కాకపోతే ఏ రకంగా మొదలుపెడతారన్నది ఇవాళ, రేపటిలో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వు రావాలి. అది వచ్చాక, జూన్‌ రెండో వారం లేదా మూడో వారం నుంచి మొదలు పెడతారని అంటున్నారు. పరిమిత సిబ్బందితో భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా చేయాలి. అన్ని సినిమాల షూటింగులూ ఒకచోట చేయం కదా! తెలిసిన ఇద్దరు ముగ్గురు అడిగితే సలహాలు, సూచనలు ఇచ్చాను. స్టూడియోలలో ఫ్లోర్స్‌లో షూటింగ్‌ జరిగితే ఒక యూనిట్‌కీ, మరో యూనిట్‌కీ మధ్య దూరం ఉంటుంది’’ అన్నారు.


భూములు పంచుకుంటున్నారా?

ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు తనను ఎవరూ పిలవలేదని స్పష్టం చేసిన బాలకృష్ణ, తర్వాత బసవతారకం క్యాన్సర్‌ హాస్పటల్‌లో జరిగిన మరో కార్యక్రమం వద్ద మాటల సందర్భంలో సినిమా పరిశ్రమ చర్చల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘మీటింగులు జరిగాయి. నన్ను పిలిచారా? ఎవరూ పిలవలేదు. వాళ్లు అందరూ కలిసి హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? (మంత్రి తలసాని) శ్రీనివాస యాదవ్‌తో కూర్చుని?? మళ్లీ ఎప్పుడు షూటింగులు స్టార్ట్‌ అవుతాయని మీటింగులు జరిగాయి. నన్ను ఒక్కడు పిలవలేదు. భూములు పంచుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఎవరికి భయపడతాం? వక్రీకరించేది ఏంటి... ఇది వాస్తవం’’ అని బాలకృష్ణ అన్నారు.


Advertisement
Advertisement
Advertisement