Abn logo
May 5 2020 @ 00:46AM

ఈ విలయం వివేకాన్ని మేల్కొలిపేనా?

ఎప్పటికైనా మనిషి ఈ ప్రకృతిలో అంతర్భాగమై అందరితో సమానంగా జీవించాలీ, మరణించాలి. అంతేతప్ప ఏ మనిషీ ప్రకృతికి అతీతం కాదు. సాటి మానవులకు అతీతం కానేకాదు. ఇది కరోనా చేస్తున్న ఉపదేశం. రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో నేను అన్నీ చూసాను. ఖరీదైన భవనాలు, హోటళ్ళు, కార్లు, పూలదండలు, శాలువాలు... అవమానాలు, సన్మానాలు అన్నీ చూసాను. ఇన్నేళ్ళ జీవితం నాకు నేర్పిన పాఠం ఒక్కటే. నిస్సహాయులకు మేలు చేస్తే కలిగే ఆనందం ముందు ఈ దర్పాలూ, దర్జాలు అన్నీ బలాదూర్.


కరోనా మానవాళికి ఒక విపత్తు మాత్రమే కాదు ఒక కనువిప్పు కూడా. అంతరాలు, అహంకారాలు కృత్రిమమైనవనీ, మౌలికంగా మానవజాతి అంతా ఒక్కటే అని పరోక్షంగా చాటుతున్నది కరోనా, అంతులేని సంపదతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం మీద తిరుగులేని ఆధిక్యం చలాయిస్తున్న అగ్రరాజ్యాలు, కరోనా దెబ్బకు తుఫానులో చిక్కుక్కున్న పడవల్లా గిజగిజ లాడుతున్నాయి. మరో వైపు, సింహాలకు చిట్టెలుక సాయం చేస్తున్నట్లు, అతి చిన్న దేశం క్యూబా ఎన్నో దేశాలకు తన వైద్య బృందాలను పంపిస్తూ, ఆపన్నహస్తం అందిస్తున్నది. కరోనా ముందు ఎవరి ఐడెంటిటీ కార్డుకు విలువలేదు. ప్యాలెస్‌లో భోగాలు అనుభవించే ప్రిన్స్ చార్లెస్ ఫిలిప్ నుండి మొదలుకొని పూరి గుడిసెలో జీవించే కూలీ దాకా ఎవరూ కరోనాకు అతీతులు కాలేదు. మనిషి శరీరం సహజసిద్ధమైంది కాగా రాచరికం కృత్రిమమైంది. ‘‘ప్రకృతి ముందు మనుషులంతా ఒక్కటే’’ అని కరోనా చెప్పకనే చెప్తున్నది. కృత్రిమ హోదాల భ్రమలోపడి బతుకుతున్న అహంకారుల చెంప చెళ్ళుమనిపించి, కళ్ళు తెరిపిస్తున్నది కరోనా. 


మనిషి ఆలోచించగల జంతువు అన్నారు తత్వవేత్తలు. కానీ మనిషి ఇప్పుడు సంపాదించే యంత్రంగా మారిపోయాడు. ప్రతి మనిషీ ఒకటే పరుగు.... ఎందుకో తెలియని పరుగు, ఎప్పటికీ ఒడువని పరుగు, సంపదను పోగు చేసుకునే ఈ నిరంతర పరుగులో పడి మనిషి తన సహజ స్పందనలని కోల్పోతున్నాడు. విషాదమేమిటంటే ఈ పరుగులో తానేం కోల్పోతున్నాడో తెలుసుకునే స్పృహను కూడా మనిషి కోల్పోతున్నాడు. ఒకరిని దాటి మరొకరు ముందుకు ఉరకాలనే పోటీ పరుగు. కరోనా ఈ పనికిమాలిన పరుగుకు పగ్గమేసింది. జీవితంలో ఒకింత మౌనానికి, ధ్యానానికి అవకాశం ఇచ్చింది. కరెన్సీ కట్టల మధ్యల ఊపిరాడని మనిషిని పట్టి ఇవతలకి లాగి, మమతానురాగాల మాధుర్యం ఏమిటో చవిచూపిస్తున్నది.


కరోనాతో బయటి లోకానికి గడియ పడి, ఇంటిలోకం మేల్కొన్నది. ఆలుమగలు తమ అంతరంగంలో అణగారిన ముచ్చట్లు కలబోసుకునే ఏకాంతం దొరికింది. బడిలేక పోవడంతో పిల్లలకు ఆడుకునే పాడుకునే తీరుబడి దొరికింది. తాతయ్య చెప్పే కథలకు చెవి ఒగ్గుతూ, అమ్మమ్మ మురిపాలలో తడిసి ముద్దవుతున్నారు పాపలు. స్టార్ హోటళ్ళలో కాంటినెంటల్ ఫుడ్డు తినే బిజీ బిజినెస్ మ్యాన్ ఇంటి వంట కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్నాడు. పబ్బుల మబ్బుల్లో తేలిపోయిన యువతరం, గుండెలదిరే డీ.జే.బీట్స్‌కు బదులుగా, తమ కుటుంబసభ్యుల గుండెచప్పుడు వింటున్నారు. కయ్యమో, నెయ్యమో ఏదైతేనేం అందరూ కలిసి గడిపేలా చేసింది కరోనా.


నిత్యం ఆక్సిడెంట్లతో నెత్తురు పులుముకునే రోడ్లు ఇప్పుడు నిశ్శబ్దంగా నవ్వుతుంటే, ఎమెర్జెన్సీ వార్డులు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. బతుకులో ఒత్తిడి తగ్గితే హాస్పిటల్లో ఆక్యుపెన్సీ తగ్గింది. మందుల అవసరం లేకుండానే, మనిషికి తిన్నది అరుగుతున్నది. స్లీపింగ్ పిల్స్ వేసుకోకుండానే ప్రశాంతంగా నిద్ర పడుతున్నది. జంకు ఫుడ్డు లేదు, కనుక దానితో వచ్చే జబ్బులూ లేవు. మద్యం లేదు, అది తాగడంవల్ల వచ్చే యుద్ధం లేదు.


లాక్‌డౌన్‌తో ఇల్లే వైకుంఠం, వాకిలే వారణాసయింది. మనసే మస్జీదుగా మారింది. పరిశుద్ధాత్మ ఆత్మలోనే దర్శనమిస్తున్నాడు. తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాల అవసమే లేకుండా మనిషి దైవాన్ని అర్చిస్తున్నాడు, కరోనా కాలంలో భగవంతుడు సర్వాంతర్యామియై విహరిస్తున్నాడు. కరోనా ఏ మతానికీ మినహాయింపు ఇవ్వలేదు. అది ముస్లిం మతరాజ్యాలనూ వదలలేదు, వాటికన్ సిటీని విడిచిపెట్టలేదు. భిన్నత్వంలో ఏకత్వం నెలకొన్న భారతదేశాన్నీ వదలలేదు. మతాలూ దేశాలూ భాషలూ అన్నీ నాకు సమానమే అని ఎలుగెత్తి చాటుతున్నది కరోనా.


ఏ మనిషికైనా తనను తాను సాధారణ మానవుడిగా భావించుకోవడం ఇష్టం ఉండదు. నేను నాయకుణ్ణి అనో, నేను అధికారిని అనో, ధనవంతుడిననో బలవంతుడిననో... ఏదో ఒక ప్రత్యేకతను ఆపాదించుకొని గర్విస్తాడు. అసలు ‘‘నేను’’ అనే భావననే అహంభావానికి, ఇగోలకు మూలం. సాటి మనుషులతో కలవకుండా చేసే అడ్డుగోడ ఈ ‘నేను’ అనే భావన. ఈ ‘‘నేను’’లోంచే కులాలు, మతాలూ, కక్షలూ, కార్పణ్యాలు అన్నీ పుట్టుకొచ్చాయి. నేను, నా వాళ్ళు, నాకులంవాళ్ళు, నా మతంవాళ్ళు అని గిరిగీసుకుంటూ, ఆ అహాన్ని నిలబెట్టుకునేందుకు మనిషి చేయరాని ఘోరాలు చేస్తున్నాడు. ‘‘ఏ నిముషమైనా నిన్ను మృత్యువు పాలు చేయగలను. నా ముందు నువ్వు గీసుకున్న గిరులకు విలువ ఏమిటని’’ కరోనా పగలబడి నవ్వుతున్నది. నువ్వే లేకుండా పోయే సమయాన ఇంకా నీ కులమేమిటి? మతమేమిటి? అని గేలిచేస్తున్నది కరోనా. నువ్వు మరణిస్తే నీ వెంట నీ వాళ్ళు రారు, సంపదలూ సామ్రాజ్యాలు అంతకన్నారావు. ఇది ఎన్నాళ్ళనుంచో వేదాంతులు చెప్తున్నారు.


‘‘నీవాళ్ళు అనుకునే వాళ్ళు, నీ మృతదేహాన్ని ముట్టుకోవడానికి కూడా ముందుకురారు తస్మాత్ జాగ్రత్త’’ అని కరోనా హెచ్చరిస్తున్నది. ఈ మాత్రం దానికోసమేనా ఇంత క్రూరత్వం, ఇంత పేరాశ? ఇన్ని వ్యూహాలు? ఇన్ని మోహాలు?..... తరాలు తిన్నా తరగని ఐశ్వర్యం, వందిమాగధుల స్తోత్రాలు ఇవన్నీ మృత్యువు ముందు అక్కరకు రావు. ఇది వైరాగ్యం కాదు. వాస్తవం. ఎప్పటికైనా మనిషి ఈ ప్రకృతిలో అంతర్భాగమై అందరితో సమానంగా జీవించాలీ, మరణించాలి. అంతేతప్ప ఏ మనిషీ ప్రకృతికి అతీతం కాదు. సాటి మానవులకు అతీతం కానేకాదు. ఇది కరోనా చేస్తున్న ఉపదేశం. రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో నేను అన్నీ చూసాను. ఖరీదైన భవనాలు, హోటళ్ళు, కార్లు, పూలదండలు,శాలువాలు... అవమానాలు, సన్మానాలు అన్నీ చూసాను. ఇన్నేళ్ళ జీవితం నాకు నేర్పిన పాఠం ఒక్కటే. నిస్సహాయులకు మేలు చేస్తే కలిగే ఆనందం ముందు ఈ దర్పాలూ, దర్జాలు అన్నీ బలాదూర్. ఆపన్నులకు సహాయం చేయలేనప్పుడు నా ఉనికికి అర్థమే లేదు. వీలైనంత మేరకు సామాన్యులలో ఒకడిగా కలిసిపోతేనే జీవితానికి సార్థకత అని తెలుసుకున్నాను. చేతనైన మేరకు అదేవిధంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాను.


జీవితం పూజనీయమైనది, దాన్ని కుట్రలు, కుతంత్రాలతో అపవిత్రం చెయ్యొద్దు. కరోనా విలయం మనిషిలో వివేకాన్ని మేల్కొలపాలనీ, కరోనా అనంతరమైనా మనుషుల స్వభావంలో మంచి మార్పు రావాలనీ ఆశిద్దాం. కేసిఆర్ గారు చెప్పినట్టు ‘‘ఎవరూ ఈ భూమ్మీదికి వెయ్యేళ్ళు బతకడానికి రాలేదు.’’ బ్రతికిన కొన్నినాళ్ళయినా భేదభావాలు లేకుండా ఒక్కటిగా బతుకుదాం. అందరి సుఖదుఃఖాలలో మనం కూడా భాగం అనుకోని బతుకుదాం. శుష్కసుఖాల కోసం మానవత్వాన్ని బలిపెట్టకుండా బతుకుదాం.

తన్నీరు హరీశ్ రావు

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి

Advertisement
Advertisement
Advertisement