Abn logo
Oct 12 2020 @ 00:58AM

జీవిత చిత్రణలో ‘మసాలా’ అవసరమా?

Kaakateeya

పెట్టుబడిదారీ సమాజాల్లో అటవీ వనరులను కొల్లగొట్టు పోతున్నది కేవలం స్మగ్లర్లో, అడవి దొంగలో అనే భ్రమను రచయిత పాఠకులకు కల్పిస్తున్నారు. కానీ అడవులనూ అక్కడి వనరులనూ కొల్లగొట్టుకు పోయేది అడవి దొంగలు మాత్రమే కాదు. ఈ దోపిడీలో ప్రధాన భాగం వారి వెనక కథ నడిపించే రాజకీయ శక్తులు, ఆ రాజకీయ శక్తులను నడిపించే బడా అంతర్జాతీయ కార్పొరేట్‌ శక్తులు. ఇంతటి నెట్వర్క్‌ను ఒక సిన్సియర్‌ ఆఫీసర్‌ తన నిజాయితీతో మార్పు చేయగలుగుతాడని చెప్పడం పాఠకులను భ్రమింపజేయటమే. 


సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’ నవలని సమీక్షించిన దేశరాజు (వివిధ, 24-08-2020) నిష్పాక్షికంగా వ్యాఖ్యానం చేయడంలో కొంత మొహమాటపడ్డారనిపించింది. 2019లో తానా నవలల పోటీలో రెండు లక్షల బహుమతి గెలుచుకుంది ‘కొండ పొలం’. ఇతివృత్తం అధోజగత్‌ సహోదరులైన గొల్లల జీవితమే అయిన ప్పటికీ రచయిత టార్గెట్‌ పాఠకులు మాత్రం మధ్యతరగతి వర్గం. అందుకోసం వారికి ఆకర్షణీయమైన కథాంశంగా ఉండేటట్టుగా జాగ్రత్త పడ్డారేమో అనిపిస్తుంది ఈ నవల చదువుతుంటే. 


ఇతివృత్తం: రవీంద్ర యాదవ్‌ గొల్ల యువకుడు. ఇంజనీరింగ్‌ చదివి ఉద్యోగం సాధించే నిమిత్తం హైదరాబాదులో కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటాడు. పల్లెలో పెరిగినవాళ్లకి సహజమైన ఆత్మన్యూనతా భావం, బిడియం వీటితో పాటు ఇంగ్లీష్‌ రాకపోవడం... వీటి వల్ల ఇంటర్వ్యూలలో తరచుగా ఫెయిల్‌ అవుతుంటాడు. అలా మధ్యలో దొరికిన ఖాళీ సమయంలో తన ఊరికి వస్తాడు. అప్పటికి తన పేటలో గొల్లలందరూ గొర్రెలకు గడ్డి, నీళ్లు దొరకక కొండపొలం వెళదామనే యోచనలో ఉంటారు. కొండ పొలం అంటే- ఊళ్లో గొర్రెలకు గ్రాసం, నీరు దొరకని పరిస్థితులు ఏర్పడినప్పుడు గొల్లలు వాటిని సమీపంలో ఉన్న నల్లమల కొండలపైకి తీసుకు వెళతారు. రవి కూడా తన తండ్రి గురప్పతో గొర్రెలను తీసుకొని కొండపొలం వెళతాడు. తనలోని భయాన్ని, ఆత్మన్యూనతను పోగొట్టుకోవడానికి ఈ అరణ్యవాసం ఉపయోగపడుతుంది. ఆ క్రమంలో పులులను మించిన క్రూరమృగాలు అడవిలో స్మగ్లర్ల రూపంలో దాగి ఉన్నాయని గ్రహిస్తాడు. నిండైన ఈ అనుభవాలతో రవీంద్ర తిరిగొచ్చి తన దశను దిశను మార్చు కుంటాడు. సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ అవాలన్న లక్ష్యాన్ని మార్చుకుని, అడవిని కాపాడాలని కష్టపడి చదివి ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగం సంపాదిస్తాడు. 


ఈ నవలలో అభూత కల్పనలు, అసంభావ్యతలు చాలాచోట్ల చోటు చేసుకున్నాయి. బహుశా మసాలాలు దట్టించి చూపాలనే ఉద్దేశ్యం కావచ్చు. కానీ చిక్కని జీవితాన్ని ప్రతిబింబించే ఈ నవలలో అటు వంటి మసాలాలు దట్టిస్తే జీవితం పలచన అయ్యి నవల అసలు ప్రయోజనం దెబ్బతినే ప్రమాదముంది. రవీంద్ర యాదవ్‌ సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ అన్న లక్ష్యాన్ని మార్చుకుని ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అవుతాడు. అతను విజయం సాధించడంతో నవల ప్రయోజనం నెరవేరినట్టుగా చిత్రీకరించారు. కానీ అతని విజయానికి దోహదపడిన అతని వర్గం యథావిధిగా భూస్వామ్య విధానపు చట్రంలో అణిగిపోతూనే ఉంటారు. వాళ్ళ జీవితాలలో ఏ మార్పు రాదు. రవీంద్ర యాదవ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా స్మగ్లర్ల బారినుండి అడవిని, జంతువులను రక్షించినట్టుగా చెప్పడం చాలా అసహజంగా ఉంది. పెట్టుబడిదారీ సమాజాల్లో అటవీ వనరులను కొల్లగొట్టు పోతున్నది కేవలం స్మగ్లర్లో, అడవి దొంగలో అనే భ్రమను రచయిత పాఠకులకు కల్పిస్తున్నారు. కానీ అడవులనూ అక్కడి వనరులనూ కొల్లగొట్టుకు పోయేది అడవి దొంగలు మాత్రమే కాదు. ఈ దోపిడీలో ప్రధాన భాగం వారి వెనకుండి కథ నడిపించే రాజకీయ శక్తులు, ఆ రాజకీయ శక్తులను నడిపించే బడా అంతర్జాతీయ కార్పొరేట్‌ శక్తులు. ఇంతటి నెట్వర్క్‌ను ఒక సిన్సియర్‌ ఆఫీసర్‌ తన నిజాయితీతో మార్పు చేయగలుగుతాడని చెప్పడం పాఠకులను భ్రమింపజేయటమే. ఇలాంటివి కమర్షియల్‌ సినిమాల లోనూ, వ్యాపార సాహిత్యంలోనూ జరుగుతాయి తప్ప నిజ జీవితంలో జరగవు. వ్యవస్థీకృతమైన ఒక జాడ్యానికి వ్యక్తులు స్థాయిలో పరి ష్కారాలు వెతకడం సాధ్యమయ్యే పని కాదు. వ్యవస్థలో లోపాలను సరిదిద్దడానికి తక్షణ పరిష్కారాలు చూపించడం ఆశ్చర్యకరమే! మరొక ముఖ్య విషయం చెప్పాలి. భారతదేశంలో అడవులను కలప నరుక్కోవడానికి టాటా వంటి కార్పొరేట్‌ సంస్థలకి కాంట్రాక్ట్‌కి ఇచ్చే సాక ఇక ప్రభుత్వ ఆఫీసర్‌లు ఆ వనరుల దోపిడీ సాఫీగా కొనసాగే టట్టు పర్యవేక్షించడం తప్ప మరో రకంగా వ్యవహరించడానికి సాధ్యం కాదు. పైగా దోపిడీకి అనుకూలంగా ప్రపంచంలో అడవులన్నింటిని ‘నో మాన్‌ జోన్‌’గా మార్చాలనుకుంటున్న అమెరికన్‌ సామ్రాజ్య వాదానికి అనుగుణంగా ఇక్కడి ప్రభుత్వాలు జీవోలు జారీ చేస్తే ఆ జీవోలను అమలు చేస్తే బాధ్యత ఇటువంటి ఆఫీసర్లదే.


ఇక అడవి పట్ల, జంతువుల పట్ల కొన్ని అపోహలు నవలలో చోటుచేసుకున్నాయి. ఒకచోట రవీంద్ర పులిని నేరుగా ఎదుర్కొంటాడు. ఆ సమయంలో అతని మీదకు రాబోతున్న పులి వెనుక భాగాన్ని అతని పెంపుడుకుక్క పట్టేసి దాడి చేయకుండా ఆపుతుంది. అతను పులి తలమీద గొడ్డలితో మోదుతాడు. ఇది అత్యంత అసహజంగా ఉంది. పులి వెనుకనున్న కుక్కను అందుకోవడానికి అటు ఇటు తిరిగినట్టుగా, కుక్క, పులిని బలంగా పట్టుకోవడం వల్ల పులి ఎటు తిరిగితే దానికి వ్యతిరేకంగా గాలిలో వేలాడుతున్నట్టు చెప్పారు. పులి వెన్ను చాలా ఫ్లెక్సిబుల్‌. దాని వెనుక ఏదైనా దాడి చేస్తే అది నించొని వెనక్కి తిరగదు. వెన్నుని నేలపై మోపి తన ముందు పంజాలతో వెనుక భాగాన్ని అందుకునే ప్రయత్నం చేస్తుంది. పైగా, ఐదారు వందల పౌండ్లు బరువుగల జంతువుని వందపౌండ్ల మనిషి ఎదుర్కోవడం, గాయపరచడం అభూతకల్పన మాత్రమే. గిరిజనులు కూడా పులి ఎదురుపడితే కదలకుండా నిలబడిపోవడం వంటి టెక్నిక్స్‌ అనుసరి స్తారు తప్పితే ఆయుధంతో దాడి చేసే ప్రయత్నం చేయరు. మరో చోట ఆడ మగ కొండచిలువలు ఈలలు వేసుకొని ఒకదానినొకటి పిలుచుకున్నాయని చెప్పారు. కొండచిలువలు ఈల వేయడం అనేది ఎక్కడా వినని విషయం. ఒకవేళ అలా ఈలలు వేసినా వాటికి చెవులు ఉండవు కనుక వినిపించే అవకాశం లేదు. జతకట్టే పాములు వాటి నుంచి వచ్చే వాసనను బట్టి ఒకదానికొకటి దగ్గరవుతాయి తప్ప ఈలలు వేసి ఒకదానికొకటి దగ్గరవడం జరగదు. 


ఒకచోట వ్యవసాయం గిట్టుబాటు కాక గొల్లలతోపాటు గొర్రెలు మేపడానికి వచ్చిన ఒక రైతు చేత రచయిత ఇలా చెప్పిస్తారు ‘‘నెలకి కనీసం అయిదు వేలు కిట్టుబడి అయినా నా పొలంలో నేను కూలీగా ఉండిపోతాను’’ అని. ఇది రైతు ఆలోచనో రచయిత ఆలోచనో కానీ పాలకవర్గాలకు అనువైన ఆలోచనే! రైతుని పొలం నుంచి తరిమేసి కార్పొరేట్‌లకు భూమిని అప్పగించి ఆ పొలంలో ఆ రైతునే కూలీగా మార్చాలనే ఆలోచన చాలా కాలం నుండి ప్రభుత్వాలకు ఉన్నదే. మరి ఇదే ఆలోచనను రైతు పాత్ర చేత పలికించడం.. తెలిసి చేసినా తెలియక చేసినా సామాజిక ఆమోదయోగ్యతను డిమాండ్‌ చేస్తుంది.


దశాబ్దాలుగా రచనలు చేస్తున్న సన్నపురెడ్డి వంటి రచయిత తను చిత్రించే జీవితాల వెనకనున్న సామాజిక చలన సూత్రాలు పట్టుకో లేరు అని భావించలేం. గుర్రం స్వేచ్ఛగా పరిగెత్తకుండా దానికి కళ్ళాలు వేసి, కళ్ళకు గంతలు బిగించి, కాళ్లకు గుదికట్లు బిగించినట్టు ప్రజలను కూడా పెట్టుబడిదారీ సామాజిక, ఆర్థిక, రాజకీయ చలన సూత్రాలు బిగించి కట్టేసి నడవనీయకుండా చేసి వారి జీవితాల్లో విషాదం నింపుతున్నాయి. ఆ సూత్రాలను ఒడిసి పట్టుకొని విశ్లేషించగలిగితే తమ కట్లు తెంచుకుని స్వేచ్ఛగా నడిచేందుకు వీలయ్యే సామాజిక ఐక్యత దిశగా వారు ఏకమవుతారు. సన్నపురెడ్డిగారికి ఇవన్నీ తెలిసిన విషయాలే అయినా ఉద్దేశ్యపూర్వకంగా ఆ జీవితాలను నడిపించే మోటివ్‌ ఫోర్సెస్‌ను పక్కన పెట్టారు. అలా చేయకపోయి ఉంటే ఈ నవల చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేది.

సౌరవ,

92915 38840


Advertisement
Advertisement