టాలీవుడ్‌లోనూ ఆ మార్పు రావాలి

మహిళా సాధికారత, అంతర్గత ఫిర్యాదుల కమిటీ నెలకొల్పడం ద్వారా మా అసోసియేషన్‌ సినీ పరిశ్రమలోని అమ్మాయిలకు ఒక ధైర్యాన్ని కల్పించినట్లు అవుతుంది. ఇలాంటి వ్యవస్థల ద్వారా ఆడవాళ్లకు భరోసాతో పాటు పోకిరీలకు భయం కలుగుతుంది. 


మహిళల అక్రమరవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు సామాజిక ఉద్యమకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సునీతా కృష్ణన్‌. ఆమె సినిమా నిర్మాత కూడా. ఈ మధ్యే సునీతా కృష్ణన్‌ను ‘మహిళా సాధికారత, అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ కి గౌరవ సలహాదారుగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ నియమించింది. ఈ సందర్భంగా సునీతా కృష్ణన్‌ను నవ్య పలకరించింది. 


‘‘నన్ను ‘మహిళా సాధికారత, అంతర్గత ఫిర్యాదుల కమిటీ’కి గౌరవ సలహాదారుగా ఉండమని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌(మా) అధ్యక్షుడు మంచు విష్ణు కోరారు. నా అనుభవాన్ని మంచి కోసం ఉపయోగించే అవకాశం రావడం నాకూ సంతోషమే కనుక, అందుకు అంగీకరించాను. నిజానికి ‘మా’ అసోసియేషన్‌లో ఎప్పుడో అంతర్గత ఫిర్యాదుల కమిటీ పెట్టాల్సింది. ఇప్పటికైనా వాళ్లు మేల్కొన్నందుకు సంతోషం. ఆడవాళ్లపై లైంగిక వేధింపుల నిరోధానికే పరిమితం కాకుండా, తెలుగు సినిమా రంగంలోని అన్నీ విభాగాల్లో మహిళల భాగస్వామ్యం పెంపొందించడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశ్యం అన్నట్టు విష్ణు మాటల ద్వారా నాకు అర్థమైంది. అది అభినందనీయం. ఒక సామాజిక ఉద్యమకారిణిగానేగాక, సినిమా నిర్మాతగానూ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలమీద నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ ఆడవాళ్లకు భద్రత అనేది అతిపెద్ద సమస్య. ఒక స్టార్‌కు ఉన్నంత రక్షణ జూనియర్‌ ఆర్టిస్టుకు ఉండదు. అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేయడం కూడా సర్వ సాధారణం. సినీ పరిశ్రమ ముఖ్యంగా పురుష ప్రధానమైన పరిశ్రమ. కనుక ఆడవాళ్లను సినిమాల్లో చూపించే కోణంలోనూ, వాళ్లకు ఇచ్చే రెమ్యునరేషన్‌లోనూ... ఇలా ప్రతి విషయంలో అసమానతలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పరిష్కరించాల్సిన బాధ్యత కొత్త కమిటీపై ఉందనుకుంటున్నాను. ‘మీటూ’ ఉద్యమంతో ఆడవాళ్ల రక్షణకు సంబంధించిన అవగాహన కొంత పెరిగింది. ఇప్పుడు చాలా దేశాల్లోని సినిమా పరిశ్రమల్లో ఆడవాళ్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం చూస్తున్నాం. ఆ విధమైన మార్పు మన దగ్గర కూడా రావాలి.

మాలీవుడ్‌లో మహిళలకు...

టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పోలిస్తే మాలీవుడ్‌లో ఆడవాళ్ల పరిస్థితి కాస్త మెరుగు అని చెప్పచ్చు. మలయాళ సినీపరిశ్రమలోని నటీమణులతో పాటు మిగతా విభాగాల్లో పనిచేసే మహిళల మధ్య ఐక్యతను అక్కడ చూస్తాం. వాళ్లకు ఎదురైన సమస్యలను వారే కలిసి పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తారు. వారంతా ఒకరికొకరు సహకరించుకుంటారు. చాలా దేశాల్లోనూ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ పేరుతో ఆడవాళ్లు రూపొందించే సినిమాలను ప్రోత్సహిస్తుంటారు. అలా మన వద్దా అన్నీ విభాగాల్లో మహిళల భాగస్వామ్యం పెంపొందించే దిశగా ‘మహిళా సాధికారత, అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ పని చేయాలి. అప్పుడే సినిమాటోగ్రాఫర్లుగాను, ఎడిటర్లుగాను, ప్రొడక్షన్‌ మేనేజర్లుగాను మహిళలు రాణించగలుగుతారు. అప్పుడే ఈ రంగంలో అసమానతలు, అభద్రత కొద్దిమేరకైనా తగ్గుతాయి. తద్వారా విప్లవాత్మకమైన మార్పులను చూడగలం.


ఫిర్యాదుల కమిటీ తప్పనిసరి...

‘పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం’ ప్రకారం పదిమంది ఉద్యోగులున్న ప్రతి చోట తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. కనుక తెలుగు సినిమారంగంలోని 24క్రాఫ్టులకు సంబంధించిన ప్రతి అసోసియేషన్‌లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలి. అందుకు మా అసోసియేషన్‌ చొరవ తీసుకోవాలి. ఆయా అసోసియేషన్‌లో సభ్యులు కాని బాధితురాళ్లు జిల్లా కలెక్టరు కార్యాలయంలోని స్థానిక ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేయచ్చు. అల్లు అరవింద్‌, డి సురేశ్‌బాబు వంటి నిర్మాతలు ఇప్పటికే వాళ్ల ప్రొడక్షన్‌ హౌసుల్లో ఫిర్యాదుల కమిటీలను నియమించారు. మిగతా నిర్మాణ సంస్థలూ ఆ విధంగా ఉండాలని, అప్పుడే ఆయా సంస్థలతో తామంతా కలిసి పనిచేస్తామని ‘మా’ అసోసియేషన్‌లోని సభ్యులంతా షరతు పెట్టాలి. 


సర్వీసు రూల్స్‌ అవసరం...

బాలీవుడ్‌లో ఎవరిమీదైనా ఒక పెద్ద ఆరోపణ బయటికి వస్తే, తర్వాత వాళ్లకు అవకాశాలు దొరకడమే కష్టంగా మారడం చూస్తున్నాం. అలానే తెలుగు సినీ రంగంలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో ఎలా వ్యవహరించాలనే దానిపై ‘మా’ అసోసియేషన్‌కు ఒక స్పష్టత ఉండాలి. నేరం రుజువు అయ్యాక, వాళ్లపై చర్యలు తీసుకోవడంలో భాగంగా గుర్తింపు కార్డు రద్దు చేయడం, కొన్నాళ్లు బ్యాన్‌ చేయడం, నష్టపరిహారం చెల్లించడం వంటి రకరకాల సర్వీసు రూల్స్‌ రూపొందించాలి. ఒకవేళ ఫిర్యాదుల కమిటీ ద్వారా బాధితురాలికి న్యాయం దక్కని పక్షంలో, పోలీసులను సంప్రదించేందుకు సహకరించే వ్యవస్థనూ ఏర్పాటు చేయాలి.  


నిష్పక్షపాతంగా విచారణ...

ఆయా విభాగాల్లో అమ్మాయిల రక్షణకు విఘాతం కలిగే ప్రదేశాలనూ కూడా గుర్తించాలి. అప్పుడు వేధింపులను అదుపు చేయడం సులువు అవుతుంది. ఒక ఆరోపణ ముందుకొచ్చినప్పుడు, దానిమీద నిష్పక్షపాతంగా విచారణ జరిపే వ్యవస్థను తయారుచేసుకోవాలి. తమ నిజాయితీని నిరూపించుకోవడంలో ఆడవాళ్లకు, మగవాళ్లకు సమాన అవకాశాలు ఇవ్వాలి. సినీరంగంతో సంబంధంలేని వ్యక్తిని ఫిర్యాదుల కమిటీలోకి తీసుకోవాలి. లైంగిక వేధింపులంటే మాటలతోనూ, చూపులతోనూ హింసించడమూ నేరమే. చాలా సమయాల్లో  సాక్ష్యాలు దొరక్క నేరాన్ని రుజువు చేయడం బాధితురాలికి అతిపెద్ద సవాల్‌గా మారుతుంది. అలాంటి సమయంలో కమిటీ సభ్యులు మానసిక పరిణితి, నేర్పరితనంతో వ్యవహరించాలి. అలాంటి అనుభవజ్ఞులను ఫిర్యాదు కమిటీలో ఉండాలి. ఇవన్నీ ‘మా’కు సూచిస్తాను. 


ప్రజలతోనే సాధ్యం...

ఒక్క సినిమారంగంలోనే కాదు, రాజకీయాలు, వ్యాపారాలు... ఇలా ప్రతిచోటా కొన్ని కుటుంబాలకు కుటుంబాలు రూల్‌ చేయడం చూస్తాం. అయితే సినిమా పరిశ్రమలోని ఫ్యామిలీస్‌ ప్రివిలేజ్‌ మీదే మనం కుళ్లుకోవడం అనవసరం. ‘ఇక్కడ నేను ఏమి చేసినా అడిగేవారు లేరు’ అనే  పరిస్థితిని కొందరు క్రియేట్‌ చేసుకున్నారు. అది మార్చడం ప్రజల వల్లే అవుతుంది. ఉదాహరణకు ఈ మధ్యకాలంలోనే ప్రజావ్యతిరేకత విపరీతంగా వెల్లువెత్తడంతో ఫ్యాబ్‌ఇండియా రూపొందించిన ఒక ప్రకటనను వెనక్కితీసుకుంది. కనుక సామాన్యులకు ఆ శక్తి ఉందని నమ్ముతాను. 


తగవులు నాకు తెలియదు...

‘మా’ అసోసియేషన్‌లోని స్పర్థలు, తగవుల గురించి నాకు తెలియదు. కానీ ఏ అసోసియేషన్‌ ఎన్నికలు కూడా అంత మురికిగా జరగకూడదని మాత్రం కోరుకుంటున్నాను. కళకు కులం, మతం, ప్రాంతం ఉండదు. వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండచ్చు. విభేదాలు తలెత్తవచ్చు. కానీ హుందాగా విమర్శను వ్యక్తం చేయడం ముఖ్యం. తెలంగాణ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ ఇచ్చిన సూచనలను పరిశీలిస్తాం. భద్రత పొందడం ఆడవాళ్ల హక్కు. అది సినీపరిశ్రమలో కల్పించడం మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ భావించాలి. ఏదైనా ఒక వివాదాస్పద ఘటన ఎదురైనప్పుడే స్పందించడం కాకుండా, నిత్యం ఆడవాళ్ల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేయాలి. మహిళల భద్రతను సినిమావాళ్లంతా కలిసి ఒక నైతిక విలువగా తీసుకోవడం ద్వారా పరిశ్రమలో మంచి మార్పు చూడవచ్చు.                        

-కె. వెంకటేశ్‌

Advertisement
Advertisement