Oct 13 2021 @ 15:20PM

Aryan Khan కు బెయిల్ ఇవ్వొద్దు.. వాట్సప్ చాటింగ్‌లో సీక్రెట్స్.. NCB వాదనలివీ..!

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై ముంబైలోని ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టులో విచారణ జరుగుతోంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ ఎన్సీబీ వాదిస్తోంది. విచారణలో భాగంగా ఆర్యన్ ఖాన్ వాట్సప్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు చెందిన వాళ్ల కాంటాక్టులు దొరికాయని చెబుతోంది. ఆయన మధ్యవర్తిగా ఉంటూ అక్రమంగా డ్రగ్స్ రవాణా జరిగిందన్న దానికి ఆధారాలు ఉన్నాయని కోర్టులో ఓ రిపోర్టును ఎన్సీబీ అధికారులు సమర్పించారు. ఎన్‌డీపీఎస్ చట్టం 1985 ప్రకారం ఆర్యన్ ఖాన్ నేరం చేశాడు అనడానికి రుజువులు ఉన్నాయని ఆ రిపోర్టులో ఎన్సీబీ వెల్లడించింది. విదేశీ డ్రగ్స్ డీలర్స్ తో ఆర్యన్ ఖాన్ తరచూ కాంటాక్ట్‌లో ఉన్నాడని చెప్పింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు తేలేంతవరకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టును ఎన్సీబీ అధికారులు కోరారు. ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ దొరకకపోయినా, అతడు డ్రగ్స్ తీసుకున్నాడని రుజువు కాకపోయినప్పటికీ, అతడితో అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్స్ కాంటాక్టులో ఉన్నారని తెలిస్తే.. విచారణకు అతడు ఎంత ముఖ్యమైన ఆధారమో అన్నది గుర్తించాలని కోరారు. 

కాగా, అక్టోబర్ 2వ తారీఖున ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్‌లో రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లోనే ఆర్యన్ ఖాన్‌ను, మరో ఏడుగురిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత వారం ఆర్యన్ ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బుధవారం బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతుండటంతో ఆర్యన్ ఖాన్ బయటకు వస్తారా..? లేక మళ్లీ జైలుకు పంపిస్తారా..? అన్నది ఉత్కంఠగా మారింది. 

Bollywoodమరిన్ని...