Abn logo
May 8 2020 @ 03:17AM

మైకమా? మార్పా?

సరైన వైద్యం అందక భారతదేశంలో ప్రతీ ఏటా 16.47 లక్షల మంది (లక్షకు 122 మంది)కి పైగా మరణిస్తున్నారని ‘ద లాన్సెట్’ తేల్చింది. రైతులు, పేదల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, కరోనా నేపథ్యంలో స్పందించినంతగా మన సమాజం ఎందుకు స్పందించలేదు? రైతులు, పేదలు ప్రభావశీల వర్గాలు కాదు కాబట్టి వారి సమస్య మనకు కరోనా అంత భీకరంగా కనిపించలేదా? అప్పుడెందుకు మనకు జ్ఞానోదయం కాలేదు?


ఒక ప్రశ్న అడగాలని ఉంది. నన్ను నేను కూడా ప్రశ్నించుకోవాలని ఉంది. ఇప్పుడు మనకు పారిశుద్ధ్య కార్మికులు, నర్సులు, ఆశా వర్కర్లు దేవుళ్లలాగా కనిపిస్తున్నారు. వారికి పుష్పాభిషేకాలు, పాదాభివందనాలు జరుగుతున్నాయి. మంచి పరిణామం. కానీ, ఇలా చేస్తున్న వారిలో ఒక్కరైనా రేపు తమ పిల్లలు పారిశుద్ధ్య కార్మికులో, ఆశా వర్కర్లో, కానిస్టేబుళ్లో అయి ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటున్నారా? ఎందుకు కోరుకోవట్లేదు? ఆ వృత్తులకు సామాజిక గౌరవం లభించదు కాబట్టి. సంపద, సంపాదన ఉండదు కాబట్టి. ఈ ఆపద కాలంలో మన కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో కూర్చుంటే వారు ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నారు కాబట్టి, మన గొప్ప నోళ్ల ప్రశంసలకు నోచుకుంటున్నారు. రేపు పరిస్థితి మారినంక మళ్లీ వారిపట్ల చులకన భావమే ఉంటుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కంటికి కనిపించదు. రైతులను కూడా అన్నదాతలని పొగుడుతూనే, వారు పండించిన తిండి తింటూనే వారు చస్తున్నా మనం చలించడం లేదు కదా? మనమంతా ఇప్పుడో ట్రాన్స్‌లో ఉన్నాం. మనల్ని మైకం కమ్మేసింది. బోర్డర్ సినిమా చూసినప్పుడు మనలో దేశభక్తి కట్టలు తెంపుకుని ప్రవహిస్తుంది. భారతీయుడు సినిమా చూస్తున్నంత సేపూ మనలోని నిజాయితీపరుడు భావావేశంతో బుసలు కొడుతుంటాడు. కానీ ఆ సినిమా ట్రాన్స్ కొంతసేపే. ఇప్పుడు కరోనా కూడ మనలో అలాంటి మైకాన్నే నింపుతున్నదేమో?!


కరోనా పరిణామాలు ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తున్నాయి. కాలు బయట పెట్టాల్సిన అవసరం లేకుండానే, బ్యాంకులోని బ్యాలెన్సుతో కాలం వెళ్లదీసే జీవులకు ఇప్పుడు ఎన్నడూ లేని ప్రశాంతత కనిపిస్తున్నది. చస్తే సొంతూరులోనే చస్తాం అని వందల కిలోమీటర్లు ఎండలో నడిచే వలస జీవికి కరోనాలో ప్రశాంతత కనిపిస్తుందా? అమెరికాలో, ఇండియాలో అన్నీ మూసుకున్నాక కూడా ఈ రెండు దేశాలకు చెందిన కుబేరులు 43 వేల కోట్ల బేరం చేసుకోగలిగారు. ఈ ఉదాహరణ చాలు, కరోనా ఎవరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నదో తెలుసుకోవడానికి. రేపటిపై ఆశలేని కోట్లాదిమందిని కరోనా కొత్తగా ఏమీ భయపెట్టడం లేదు. బతుకు భయమే తప్ప చావు భయం లేని కోట్లాదిమంది జీవితాలు వెళ్ళదీస్తున్న గడ్డ ఇది.


భారతదేశం ఎక్కడ నివసిస్తుంది? బంజారాహిల్స్ బంగళాల్లోనా? బంజారాల గుడిసెల్లోనా? మలబార్ హిల్స్ లోనా? ధారవి స్లమ్స్ లోనా? గ్రేటర్ కైలాష్ లోనా? లాల్ బాగ్ లోనా? ప్రజలంటే ఏసి మాల్స్ లో కొనుగోలు చేసే వినియోగదారులా? చెమటోడ్చి ఉత్పత్తి చేసే కర్షక కార్మికులా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసిన వాళ్లకే భారతదేశం అర్థమవుతుంది. కరోనా సృష్టించిన విధ్వంసాన్ని మనం ఎంతబాగా ఎదుర్కొంటున్నామో తెలుసుకోవడానికి కొలమానం కూడా ఇదే.


నిజమే. కరోనా మానవాళికి ఎదురైన పెద్ద సవాలే. లాక్‌డౌన్‌కు మించిన మార్గం ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపించడం లేదు కూడా. కానీ పరిష్కరించదగిన సమస్యలను కూడా విస్మరించి ప్రతి ఏటా లక్షలాదిమంది మరణానికి కారణమవుతున్నాం కదా! మందు, వ్యాక్సిన్ లేని వైరస్ నుంచి నేర్చుకోవాల్సింది వుంది. కానీ అంతకుముందు జరిగిన, జరుగుతున్న విధ్వంసాల నుంచి ఏమి నేర్చుకున్నామో వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా!? మనకు కర్తవ్య బోధ జరగడానికి కరోనాను మించిన సందర్భమే గతంలో దొరకలేదా?


1995 నుంచి ఇప్పటి వరకు 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్స్డ్ బ్యూరో ప్రకటించింది. శిశు మరణాల్లో 69 శాతం కేవలం పౌష్టికాహార లోపం వల్లే జరుగుతున్నాయని, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ప్రతీ ఏటా దేశంలో 41.85 లక్షలమంది (ప్రతీ లక్ష మంది లో 310 మంది) మరణిస్తున్నారని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేషన్ (ఐహెచ్ఎంఇ) అధికారికంగా ప్రకటించింది. సరైన పోషకాహార సూచికలో భారత్ 118వ స్థానంలో ఉంది. ఈ దేశానికి ఓ సమగ్ర పౌష్టికాహార విధానం అత్యవసరం అని ఆ సంస్థ గత ఏడాది హెచ్చరించింది కూడా. సరైన వైద్యం అందక భారతదేశంలో ప్రతీ ఏటా 16.47 లక్షల మంది (లక్షకు 122 మంది)కి పైగా మరణిస్తున్నారని ‘ద లాన్సెట్’ తేల్చింది. రైతులు, పేదల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, కరోనా నేపథ్యంలో స్పందించినంతగా మన సమాజం ఎందుకు స్పందించలేదు? రైతులు, పేదలు ప్రభావశీల వర్గాలు కాదు కాబట్టి వారి సమస్య మనకు కరోనా అంత భీకరంగా కనిపించలేదా? అప్పుడెందుకు మనకు జ్ఞానోదయం కాలేదు?


వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది కాబట్టే ఈ లాక్‌డౌన్. ఆ మరొకరిలో మనం ఉండకూడదనే ఎవరికి వారు స్పందిస్తున్నారు. అదే ప్రతీ ఏటా లక్షలమందిని బలిగొంటున్న అన్నదాతల ఆత్మహత్యల్లాగా, ఏజెన్సీ విషజ్వరాల లాగా, చిన్నారులను చిదిమేస్తున్న పోషకాహార లోపంలాగా, మారుమూలకు అందని వైద్యం లాగా మాత్రమే ఉంటే మనం ఇంతగా స్పందించేవారమా? ఇప్పుడు కరోనా విషయంలో చూపిస్తున్న శ్రద్ధలో పదోవంతు చూపగలిగినా గడిచిన ఏడు దశాబ్దాలుగా ఎన్ని ప్రాణాలను నిలిపి ఉండేవాళ్లం? కరోనా ధనిక, పేద తేడా లేకుండా అందరినీ కాటేస్తుంది. కాబట్టే దేశమంతా మునివేళ్ళపై నిలబడింది. త్యాగాలకు సిద్ధపడింది. కానీ మన రైతులు, నోరులేని పేదల విషయంలో ఎందుకు నిస్తేజంగా ఉంటున్నాం? అన్ని మరణాలకు సమాన గుర్తింపు లేదెందుకు? ధనికులు, ప్రభావిత వర్గాలను కూడా దహించే వాటి విషయంలోనే మనం అప్రమత్తంగా ఉంటామా? విపత్తులన్నింటికీ ఒకేవిధంగా ప్రతిస్పందించే సమాజం మనకు కావాలి. అన్ని మరణాలకూ సమాన విలువ ఉండాలి. ఇప్పుడు మనం కొందరిని దేవుళ్లగా కీర్తిస్తున్నాం కదా, రేపు ఆ వృత్తులకు కాస్త సామాజిక గౌరవం దొరికినా చాలు. పరిణతి కలిగిన సమాజమంటే అది.

గటిక విజయ్‌కుమార్

Advertisement
Advertisement
Advertisement