Abn logo
Oct 21 2021 @ 01:28AM

వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కుల పంపిణీ

చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే వేణుగోపాల్‌

కురిచేడు, అక్టోబరు 20: మండలంలో వైఎస్‌ఆర్‌ ఆసరా రెండవ విడత చెక్కులను బుధవారం దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు.  వైఆర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్‌ హాజరయ్యారు. దర్శి వచ్చిన ఎమ్మెల్యే స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజల అనంతరం ఎస్సీ కాలనీలో వైయస్సార్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులుఅ అర్పించారు. అక్కడ నుంచి గుర్రాల అలంకరణతో ఉన్న వాహనంలో ప్రధాన కూడలి మీదుగా ఎన్నెస్పీ కాలనీలోని సభాస్థలి వద్దకు వచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగన్మోహన రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అక్కాచెల్లెళ్లకు డ్వాక్రా రుణమాఫీ రెండవ విడత చెక్కులను పంపిణీ చేశారు. మహిళలు గృహాలలో ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలన్నారు.

టీడీపీ నాయకులపై విసుర్లు 

టీడీపీ నాయకులు మతిభ్రమించి ఎక్కువ మాట్లాడుతున్నారని వారిపై ఆయన విమర్శలు చేశారు. వారు నోరు అదుపులో ఉంచుకోకపోతే దెబ్బలు తప్పవని హెచ్చరించారు. మా ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పేలితే నడి రోడ్డుపై బట్టలు ఊడదీసి కొట్టే పరిస్థితి వస్తుందని జాగ్రత్తగ ఉండాలని  హెచ్చరించారు. దర్శిలో టీడీపీకి భవిష్యత్‌ కనిపించడం లేదన్నారు. కార్యకమ్రంలో ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, జడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, వైసీపీ నాయకులు మద్దిశెట్టి శ్రీధర్‌, బెల్లం చంద్రశేఖర్‌, బెల్లం.సురేష్‌, మేరువ పిచ్చిరెడ్డి, మేరువ సుబ్బారెడ్డి, ఆవుల వెంకటరెడ్డి, వేమా శ్రీనివాసరావు, వరికూటి వెంకటేశ్వర్లు, కురిచేడు సర్పంచ్‌ కేసనపల్లి క్రిష్ణయ్య, కానాల శివారెడ్డి, బుల్లం వెంకట నరసయ్య, లింగారెడ్డి, కాసు భాస్కర రెడ్డి,వెలుగు ఏపీఎం రాజారత్నం, వివోఏలు, 5 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.