తన తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్‌లతో బాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. దీంతో నేరుగా బాలీవుడ్లోనే ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన `ఛత్రపతి`ని హిందీలోకి రీమేక్ చేస్తున్నాడు. శ్రీనివాస్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు వీవీ వినాయక్ హిందీ అరంగేట్ర బాధ్యతలను కూడా తీసుకున్నాడు. అయితే ఈ సినిమాకు హీరోయిన్ సమస్య తలెత్తింది.
హీరో కొత్త కనుక అతని సరసన స్టార్ హీరోయిన్ను తీసుకోవాలనుకున్నారు. కియార, జాన్వి, అనన్య పాండే వంటి హీరోయిన్లను సంప్రదించగా వారు తిరస్కరించినట్టు సమాచారం. దీంతో తెలుగులో `లోఫర్` సినిమాలో మెరిసిన దిశా పటానిని అడిగినట్టు తెలుస్తోంది. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఈ సినిమాలో నటించేందుకు దిశ అంగీకరించినట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందట.