Abn logo
May 10 2020 @ 00:14AM

వ్యాధి విపత్తు, విషమ ప్రశ్నలు

కరోనా విపత్తు కట్టడి కోసం ఎవరు మూల్యం చెల్లించాలి? వైద్య సదుపాయాల కొరతతో, అందరికీ చికిత్స అందించలేని పరిస్థితులలో ఇటలీలో వృద్ధులని చావుకు వదిలేశారు. అమెరికాలో వృద్ధులు చావుకు సిద్ధపడాలని కొందరు రాజకీయ నాయకులు బహిరంగంగా పిలుపునిచ్చారు. ఇతర చోట్ల పిలుపు ఇవ్వకుండానే పేదవాళ్ళు, వృద్ధులు, కూలీలు, కార్మికులు, పీడితులపైన త్యాగాల భారం మోపుతున్నారు. ప్రాణంపేరుతో జీవితాలని హరిస్తే, జీవితం పేరుతో జీవికని నిరాకరిస్తే, జీవిక పేరుతో స్వేచ్ఛనీ కాలరాస్తే అది స్వేచ్ఛా సమాజం అనిపించుకోదు, సమాధుల వరుస అవుతుంది. సమాధుల వరుసని మనం ఎంచుకోవాలా? నిరాకరించాలా?


అంటువ్యాధులు తిరిగి తిరిగి తలెత్తుతూనే వుంటాయని అందరికీ తెలుసు. అయినా, అవి హఠాత్తుగా మన నెత్తిమీదకి వచ్చిపడినప్పుడు మాత్రం నమ్మశక్యంగా కనిపించవు. చరిత్రలో యుద్ధాలూ, ప్లేగు వ్యాధీ పదేపదే వస్తూనే వున్నాయి. అయినా, అవి కళ్ళముందుకి వచ్చేసరికి, జనాలు ఆశ్చర్యంతో తెల్లబోతారు. 

అల్బర్ట్ కామూ, ది ప్లేగ్ 


పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థని నడిపించే చోదకశక్తిగా ‘అదృశ్య హస్తం’ అన్న భావనని ఆర్థికవేత్త ఆడం స్మిత్ పద్ధెనిమిదవ శతాబ్దంలో ప్రస్తావించాడు. ప్రస్తుత ప్రపంచం ఒక ‘అదృశ్య క్రిమి’తో పోరాడుతున్నది. న్యూయార్క్ నగరపు ఈశాన్యాన హార్ట్ ఐలండ్ ప్రాంతంలో సామూహిక ఖననం కోసం సమాధులు తవ్వుతుంటే, 2008 నాటి మహాసంక్షోభాన్ని తలదన్నే స్థాయిలో ఆర్ధిక సంక్షోభం ఉండబోతోందని ఐ.ఎం.ఎఫ్ చెబుతోంది. 


ఇప్పటి ఉత్పాతం ఎవరూ ఊహించకుండా, హఠాత్తుగా ఊడిపడిన సంఘటన కాదు. ఇటువంటి విపత్తులని ముందుగానే ఊహించుకుని డార్క్ వింటర్ (2001), క్రిమ్సన్ కంటేజియన్ (2019) వంటి ప్రయోగాలని అమెరికా ప్రభుత్వం నిర్వహించింది. సిఐఎ 2000 సంవత్సరంలోనే ఇలాంటి ఉత్పాతాల గురించి హెచ్చరిస్తూ ఒక నివేదికని సమర్పించింది. అయినా, కరోనా ఉత్పాతాన్ని ఎదుర్కోవడంలో అలక్ష్యం, బుకాయింపులు, దాచివేత, దాటవేత, అలసత్వం, అసమర్థత, నేరపూరిత నిర్లక్ష్యం లాంటి వైఖరులు అన్నిచోట్లా వ్యక్తమయ్యాయి. అక్కడక్కడ మినహాయింపులున్నా, అత్యధిక దేశాలలో మూర్ఖత్వం మూర్తీభవించిన నిర్లక్ష్యమూ, ఎటువంటి సన్నద్ధతా లేని నిష్క్రియాపరత్వమే రాజ్యమేలుతున్నాయి. 


చరిత్రలో మునుపు అంటువ్యాధి జాడ్యాలు ప్రబలినప్పుడు, ఆయా వ్యాధులకు అసలు కారణాన్ని తెలుసుకోలేని అజ్ఞానంతో వివిధ జాతులు, తెగలు, మతాల ప్రజల పట్లా, ఆయా ప్రజల ఆహారపు అలవాట్ల పట్లా చులకన, వ్యతిరేకత, ద్వేషం నిండిన వైఖరులు ముందుకొచ్చాయి. మనుషుల పాపాలకు దేవుడు విధించిన శిక్షే కరోనా వ్యాప్తికి కారణమంటూ వివరిస్తున్న ఛాందస మూర్ఖత్వం ఇప్పుడుకూడా కనిపిస్తూనేవుంది.


ఇప్పటి కరోనా విపత్తు ఒక అదృశ్య క్రిమి ద్వారా సంక్రమించిన ఒకానొక ‘అంటువ్యాధి’ ఫలితం మాత్రమే కాదు. వ్యాధి వ్యాప్తికీ, విస్తృతికీ దారితీసిన నిర్దిష్ట సామాజిక, ఆర్ధిక, రాజకీయ కారణాలున్నాయి. వ్యాధి కట్టడి, నివారణ విషయంలో తీసుకున్న, తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న విధానాలలో లోటుపాట్లని చర్చించే సమయంలో మనం ఈ కారణాలకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు కూడా వేసుకోవాలి.


ప్రపంచీకరణ దిశ ఎటువైపు? మునుపు చరిత్రలో కలరా, మశూచి, ప్లేగు వంటి అంటువ్యాధులు ముందుకొచ్చాయి. అయితే, 200 దేశాలకి పాకిన ఒక అంటువ్యాధి వ్యాప్తి, విస్తృతితో పాటు విధ్వంస స్థాయి రీత్యా అతి పెద్ద విపత్తుని మనం చూస్తున్నాం. ప్రపంచీకరణతో వస్తువులనీ, మనుషులనీ అత్యంత వేగంగా సుదూర గమ్యాలకి చేర్చగలిగే ఆధునిక రవాణా సదుపాయాల మూలంగా వ్యాధికారక క్రిములు కూడా దేశదేశాలకి అంతే వేగంగా వ్యాపించే అవకాశం ఏర్పడింది. అందుకని, సూటిగా చెప్పుకోవాలంటే, ఉత్పత్తిలో, వాణిజ్యంలో, రవాణా, ప్రయాణ రంగాలలో ప్రపంచీకరణతో వచ్చిన పెను మార్పులతో ముడిపడివున్న విపత్తు ఇది.


ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం, ప్రపంచీకరణ క్రమం చరిత్రలో ఎప్పటినుంచో వున్నా, 1990లలో ఊపు అందుకుంది. మునుపెన్నడూ ఎరగని స్థాయిలో ఉత్పత్తి, పంపిణీ రంగాలలో ప్రపంచీకరణ వేగం పుంజుకోవడంతో ప్రపంచ దేశాల మధ్య పరస్పర ఆర్థిక సంబంధాలు పెరిగేయి.


ప్రపంచీకరణ క్రమం మీద కరోనా విపత్తు ప్రభావం ఎలా వుండబోతోంది? కొందరు ‘మనం ఇంతవరకూ చూసిన ప్రపంచీకరణ క్రమం ముగిసిపోయింది, దానికి పూర్తిగా భిన్నమైన, ఒక కొత్త యుగంలోకి ఇప్పటికే మనం అడుగుపెట్టామం’టున్నారు. చైనా నుంచి తరలి వచ్చే పరిశ్రమలకి ఉద్దీపన పథకాన్ని జపాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇతర దేశాలు కూడా దీనినే అనుసరిస్తాయా? భవిష్యత్ చిత్రపటాన్ని ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా వూహించలేము. అయితే, ప్రస్తుత విపత్తు నేపథ్యంలో, ప్రతీ దేశమూ తమ తమ సరఫరా వ్యవస్థలని పునఃపరిశీలించుకుంటుంది. ఈ క్రమం మనం ఇంతవరకూ చూసిన ప్రపంచీకరణ గతినీ, స్థితినీ మార్చక తప్పదు. ప్రపంచీకరణపై పునరాలోచనల నేపథ్యంలో మనం ఎంచుకోబోయే మార్గమేమిటి, అది ఎలా ఉండాలి? ఇది మనముందున్న ఒక ముఖ్యమైన ప్రశ్న.


ప్రజారోగ్యమా? ప్రైవేటు లాభార్జనా? ప్రపంచీకరణతో సన్నిహితంగా ముడిపడివున్న ఒక ముఖ్యమైన అంశం - ఆర్ధిక సంస్కరణలు. ఈ సంస్కరణల బలవంతపు అమలులో భాగంగా ఆరోగ్య రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని తీవ్రంగా కుదించి, ప్రయివేటీకరణకి పట్టంగట్టారు. ఇది ప్రజారోగ్య వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసింది. మనుషుల ఆయుర్దాయంలో అంతకుముందు దాకా సాధించిన ప్రగతినంతటినీ ప్రపంచీకరణ వెనక్కి నెట్టివేసిందని ఒక అధ్యయనం (2009) వెల్లడించింది. 


వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో క్రమేపీ అంటువ్యాధులతో పాటు, జీవన శైలికి సంబంధిన వ్యాధుల ప్రాబల్యం కూడా పెరగడం మొదలైంది. ఆర్థిక సంస్కరణలు ప్రజారోగ్య వ్యవస్థల్ని విధ్వంసం చేయడంతో మునుపు అదుపులోకి వచ్చిన అంటువ్యాధులు తిరిగి తలెత్తడం ప్రారంభమైంది. కొత్తగా ముందుకొచ్చిన అంటువ్యాధులు (ఉదా:ఎయిడ్స్) వీటికి తోడయ్యాయి. జీవనశైలికి సంబంధించిన వ్యాధులు ప్రయివేటు ఆరోగ్య సేవలకు మంచి లాభసాటి వ్యాపారంగా మారిపోయాయి. గ్రామీణ ప్రాంతాలలో నిధుల లేమి, సిబ్బంది కొరత కారణంగా ప్రాధమిక ఆరోగ్య సదుపాయాలు కుదించుకుపోగా, నగరాలలో కార్పొరేట్ పెట్టుబడులతో ప్రత్యేక ఆసుపత్రులు, ప్రైవేటు రంగంలో తామరతంపరగా పెరిగేయి. భారతదేశ ఆరోగ్యవ్యవస్థ 1946 నాటి భోర్ కమిటీ సిఫార్సుల నుంచి చాలా దూరమే ప్రయాణించింది. ఆరోగ్య రంగంలో చేపట్టిన సంస్కరణలు దేశంలో ఆరోగ్య సేవల రూపురేఖలనే మార్చివేశాయి. 2005 నాటికి ఆరోగ్య సేవలలో 80% ప్రైవేటు రంగంలోనే వున్నాయి. అందరికీ ఉచిత ఆరోగ్య సేవలు అన్న భావన ఒక అందమైన, అసాధ్యమైన కల అని 2015లో నీతి ఆయోగ్ కొట్టిపారేసింది!


కరోనావంటి విపత్తులని ఎదుర్కోవడానికి మన ఆరోగ్య సదుపాయాలు ఎంత మాత్రమూ సరిపోవని ప్రస్తుత సంక్షోభం రుజువు చేసింది. ఇదేదో కరోనా ఉత్పాతం ఆకస్మికంగా రావడంతో తలెత్తిన గడ్డు పరిస్థితి కానే కాదు. దశాబ్దాలపాటు ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా వదిలేసిన నిర్లక్ష్యం, పాత, కొత్త అంటు వ్యాధుల వ్యాప్తిని పసిగట్టి కట్టడి చేయడంలో అలసత్వం, లాభార్జనే లక్ష్యంగా ముందుకొచ్చిన ప్రైవేటు ఆరోగ్య సంస్థల అభివృద్ధి - వీటన్నిటి పర్యవసానమే ప్రస్తుత దుస్థితి. ప్రైవేటు ఆరోగ్య రంగం ఇటువంటి విపత్తులని ఎదుర్కోవడానికి ఉపయోగపడదు. వైద్య, ఆరోగ్య సేవలలో ప్రాధాన్యతలనీ, లక్ష్యాలనీ పునర్నిర్వచించుకోవాల్సిన ఈ సమయంలో మనం ఎంచుకోవలసిన మార్గమేమిటి? ఇది మనముందున్న రెండవ ముఖ్యమైన ప్రశ్న. 


జీవితం, జీవిక, స్వేచ్ఛ ఒకదానికోసం మరొకదాన్ని వదులుకోవాలా? కరోనా విపత్తుని ఎదుర్కోవడంలో వేటిని ఎంచుకోవాలి/ త్యాగం చేయాలి, ఎవరు/ఎవరిని త్యాగం చేయాలి అనే ఇబ్బందికరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా వ్యాధి కట్టడి కోసం వలస కాలపు ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్----ని అమలులోకి --తెచ్చారు. బొంబాయి నగరంలో ప్లేగు వ్యాధి కట్టడిలో బ్రిటిష్ వలస పాలకుల విధానాలని విమర్శించిన నేరానికి అప్పుడు బాలగంగాధర తిలక్‌ని పద్ధెనిమిది నెలలపాటు నిర్బంధించారు!


వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసే పేరిట వ్యక్తుల కదలికలపై నిఘా వేసే సాంకేతికతని ఉపయోగిస్తున్నారు. చైనా అలాంటి సాంకేతికతనే ఉపయోగించింది. ఇది ఇక్కడితో ఆగదు. పౌరుల వివరాలు, కదలికలన్నిటినీ నిఘానీడలోకి తెచ్చే సమగ్ర సమాచార సేకరణకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా విపత్తుని కట్టడి చేసే బాధ్యతని ఎక్కువభాగం శాంతిభద్రతల సమస్యగా మార్చిన వైఖరినే మనం చూస్తున్నాం. ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించే పేరుతో వేతనాల్లో కోత, వాయిదా, కరవుభత్యం పెంపుదలని స్తంభింపజేయడం, షిఫ్ట్ పనిగంటలని పన్నెండు గంటలకు పెంచడం, కార్మిక హక్కుల చట్టాలని ఎత్తివేయడం కూడా చూస్తున్నాం. చైనా నుంచి పరిశ్రమల తరలింపునకు ప్రోత్సాహం, ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టడం పేరుతో మునుముందు రానున్న విపత్తులకి విశాఖపట్టణం ఘటన ఒక సూచిక. కరోనా విపత్తు కట్టడి కోసం ఎవరు మూల్యం చెల్లించాలి? వైద్య సదుపాయాల కొరతతో, అందరికీ చికిత్స అందించలేని పరిస్థితులలో ఇటలీలో వృద్ధులని చావుకు వదిలేశారు. అమెరికాలో వృద్ధులు చావుకు సిద్ధపడాలని కొందరు రాజకీయ నాయకులు బహిరంగంగా పిలుపునిచ్చారు. ఇతర చోట్ల పిలుపు ఇవ్వకుండానే పేదవాళ్ళు, వృద్ధులు, కూలీలు, కార్మికులు, పీడితులపైన త్యాగాల భారం మోపుతున్నారు. ప్రాణంపేరుతో జీవితాలని హరిస్తే, జీవితం పేరుతో జీవికని నిరాకరిస్తే, జీవిక పేరుతో స్వేచ్ఛనీ కాలరాస్తే అది స్వేచ్ఛా సమాజం అనిపించుకోదు, సమాధుల వరుస అవుతుంది. సమాధుల వరుసని మనం ఎంచుకోవాలా? నిరాకరించాలా? ఇది మనముందున్న మూడవ ముఖ్యమైన ప్రశ్న. 18, 19, 20వ శతాబ్దాలలో వివిధ సంక్షోభాలు, విపత్తులని ఎదుర్కోవడంలో మానవ సమాజం ఎంతో మూల్యం చెల్లించింది. విలువైన అనుభవాలూ లభించాయి. 21 శతాబ్దంలో ఎదురైన ప్రస్తుత విపత్తుని ఎదిరించడంలో మునుపటి పద్ధతులు, మార్గాలనే ఎంచుకోవాలా, వాటిని అధిగమించే నిర్ణయాలు తీసుకోవాలా అన్నదే మన ముందున్న అసలు సమస్య.

సుధా కిరణ్

Advertisement
Advertisement
Advertisement