కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఇస్మార్ట్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం `రెడ్`. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. ఆ మేరకు షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. అయితే లాక్డౌన్ కారణంగా విడుదల కుదరలేదు. మిగిలిన సినిమాలు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసినా.. `రెడ్` మాత్రం విడుదల కాలేదు.
థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా `నో` చెప్పేశారు. త్వరలో థియేటర్లు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి కొన్ని సినిమాలు అప్పుడే కర్చీఫ్‌లు కూడా వేసేశాయి. అయినప్పటికీ `రెడ్` యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. విడుదల గురించి స్పష్టత లేదు. దీంతో ఇప్పట్లో సినిమా విడుదల ఉంటుందా? లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.