Abn logo
Sep 21 2021 @ 02:09AM

కార్మికుల గోడు పట్టదా?

టీటీడీ చైర్మన్‌, ఈవోపై సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి ఆగ్రహం 

300వ రోజుకు చేరుకున్న అటవీ శాఖ కార్మికుల దీక్ష


తిరుపతి (కపిలతీర్థం), సెప్టెంబరు 20: ‘టీటీడీలోని అటవీశాఖ కార్మికులు కొత్తగా గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. గతంలో టీటీడీ బోర్డు తీర్మానం చేసిన, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మాత్రమే అమలు చేయమని అడుగుతున్నారు. దీనికోసం కడుపులు మాడ్చుకుని నిరసన దీక్షలు చేస్తున్నారు. అయినా, వీరి గోడు టీటీడీ చైర్మన్‌, ఈవోకు పట్టడం లేదు. అసలు వారికి తిండి ఎలా సగిస్తోంది’ అంటూ సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మండిపడ్డారు. గతంలో టీటీడీ ఉన్నతాధికారులు, పాలకమండలి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అటవీ శాఖ కార్మికులు తిరుపతిలో చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం 300వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ అటవీ శాఖ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళనలో రమాదేవి మాట్లాడారు. సాధారణ ప్రజల పట్ల సానుకూల దృక్పథం కలిగిన వారుగా పేరున్న చైర్మన్‌, ఈవో టీటీడీలో బాధ్యతలు తీసుకున్నాక వీరి శైలి అమానవీయంగా ఉందన్నారు. కార్మికుల పట్ల ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరిస్తే ప్రజల సహకారంతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి పేద కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. గతంలో కార్మికులకు అండగా ఉంటామన్న తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. కార్మికులు 300 రోజులుగా దీక్ష చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని టీడీపీ నేత, కార్పొరేటర్‌ ఆర్‌సి మునికృష్ణ ప్రశ్నించారు. పేద కార్మికుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తూ చరిత్రహీనులుగా మిగలకముందే చైర్మన్‌, ఈవో స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి కోరారు. ఏపీ విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సంఘం నేతలు కుమార్‌, హరి, సీఐటీయూ నేత రమేష్‌, అటవీ శాఖ కార్మికుల సంఘం నాయకులు పురుషోత్తం, వాసు, శ్రీనివాసులు, మునికృష్ణ, కేశవులు, కృష్ణ,శీను, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.