Abn logo
May 9 2021 @ 00:58AM

కల్లాల్లో ధాన్యం.. రైతుల్లో దైన్యం

గన్నవరం, మే 8 : ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసు కుని పండించిన ధాన్యం కొనే నాధుడే లేడని రైతాంగం వాపోతున్నారు. రైతుకు ఏ కష్టం రానివ్వమని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం తీరును రైతులు నిరసిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి 20 రోజులుగా తిరుగుతున్నా పట్టించుకున్న దిక్కు లేదని, ఉన్నతాధికారులకు పలుసార్లు మొరపెట్టినా ఈ రోజుకు చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం రాశులకు రోజూ కాపలా కాస్తూ, ఎప్పుడు వాన పడుతుందోనని రోజుకు రూ.400 అద్దెకు పరదాలు తెచ్చి అప్పులపాలు అవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. మద్య దళారీలు రేటు తగ్గించి తమకు అమ్మాలని ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు, దళారీలు అడిగే ధరకు  ఎకరానికి పండించే ధాన్యానికి రూ.12వేలు వ్యత్యాసం వస్తోందని, రైతు ఏ విధంగా వ్యవసాయం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని, మరోవైపు దళారీలు తగ్గించి అడుగుతుండటంతో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారిందని దిగాలు చెందుతున్నారు. మండలంలోని వెదురుపావులూరు రైతుల దైన్య పరిస్థితి ఇది. మిగిలిన గ్రామాల్లో ధాన్యం పండించిన రైతులది కూడా ఇదే దుస్థితి. వెదురుపావులూరు ఆయకట్టులో 5400 ఎకరాలకుపైగా సాగుభూమి ఉంది. దీనిలో అధిక భాగం రైతులు ధాళ్వా వరి పండించారు.  ప్రభుత్వం ప్రకటించిన విధంగా 1010, 1121, 1153, 1156 రకం వరి సాగు చేశారు.  ఆ పంటను ఆరబెట్టుకుని రాశులుగా పోసి ధాన్యం కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం 75కేజీల బస్తా రూ.1400కు కొంటామని చెప్పటంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ పరిస్థితి లేకపోవటంతో ఇబ్బం దులు పడుతున్నారు. చివరకు మిల్లర్ల వద్దకు సైతం రైతులు వెళ్ళి ధాన్యం కొనుగోలు చేయాలని, సంచులు ఇవ్వాలని వేడుకున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనమని వారు చెప్పటంతో అయోమయ్యంకు గురయ్యామని వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. 1121 రకం మాత్రమే కొనుగోలు చేస్తామని అంటున్నారని మిగిలిన మూడు రకాల పంటను ఏంచేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.1153, 1156 రకం ఎందుకు వేశారని అధికారులు, మిల్లర్లు అడగటం విడ్డూరంగా ఉందన్నారు. క్రాప్‌ హాలిడే ప్రకటిస్తే ఈ బాధలు ఉండవుగా అని రైతులు అవేదన చెందుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement