Abn logo
Oct 8 2021 @ 23:57PM

సమస్యల ధరణి

- జిల్లాలో కుప్పలు, కుప్పలుగా పేరుకుపోతున్న దరఖాస్తులు
- వచ్చిన దరఖాస్తులు 1,930
- పరిష్కారమైనవి 170 మాత్రమే.. పెండింగ్‌లో 1,760
- భూ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూపులు
- కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసిపోతున్న బాధితులు
- రూ.వేలకు వేలు చలాన్‌లు చెల్లించి మీ సేవలో దరఖాస్తులు
- దరఖాస్తుల తిరస్కరణతో అవ్కాకవుతున్న బాధితులు
- అధికారుల సమన్వయ లోపంతో ఇబ్బందులు

కామారెడ్డి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లు, మ్యూటేషన్‌లు, రికార్డుల వెరిఫికేషన్‌, ఆన్‌లైన్‌లో భూ వివరాల నమోదు.. చిన్నచిన్న పొరపాట్ల సవరణ ఇలా రైతుల భూములకు సంబంధించి ప్రతీ పని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే కొందరు అధికారుల అలసత్వం కారణంగా లక్ష్యం నీరుగారుతోంది. తహసీల్దార్‌లు కేవలం రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియకే పరిమితం కావడం, ధరణి పోర్టల్‌లో సమర్పించే గ్రివెన్స్‌, మ్యూటేషన్‌ దరఖాస్తులన్నీ కలెక్టర్‌ లాగిన్‌కు చేరడంతో ఇరువురి సమన్వయలోపం కారణంగా దరఖాస్తుదారులు భూ సమస్యల్లో చిక్కుకుంటున్నారు. భూ విలువలు రోజురోజుకూ పెరిగిపోతున్న దృష్ట్యా రికార్డులో చోటు చేసుకుంటున్న చిన్నచిన్న తప్పులు భూ యజమానులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పరిష్కారం కోసం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేస్తున్నప్పటికీ తిరస్కరణలతో అవాక్కవుతున్నారు. వేలకు వేల రూపాయలు చలానాలు చెల్లించి తిరిగి పొందేందుకు ఎదురుచూస్తున్నా ఖచ్చితమైన సమాధానం చెప్పేవారు కరువయ్యారు. సీసీఎల్‌ నుంచి ఆదేశాలు వస్తే ఫోన్‌కు మేసేజ్‌ వస్తుందని తమ చేతిలో ఏమి లేదని తహసీల్దార్‌ కార్యాలయాల్లోని అధికారులు పేర్కొనడం దరఖాస్తుదారులను అయోమయానికి గురిచేస్తోంది. మ్యూటేషన్‌ చేసుకోవాలన్న చిన్నచిన్న పొరపాట్లు సరిదిద్దుకునేందుకు గ్రివెన్స్‌ దరఖాస్తులను మీ సేవ కేంద్రాల ద్వారా సమర్పించాలి. అలా సమర్పించిన దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకపోగా కట్టిన చలాన్‌ డబ్బులు నష్టపోతున్నామని ధరణి తీరుపై బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్‌లో 1,760 దరఖాస్తులు
భూ సమస్యలకు సంబంధించి ధరణికి దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం కాక పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో బాధితులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ భూ సమస్యల పరిష్కారం కోసం తిరగాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని 22 మండలాల్లోని 526 గ్రామాల పరిధిలోంచి ఆయా భూ సమస్యలకై ధరణి గ్రివెన్స్‌కు 1,930 దరఖాస్తులు వచ్చినట్లు ఆయా శాఖల రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 170 మాత్రమే పరిష్కారం అయ్యాయి. మిగతా 1,760 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తహసీల్దార్‌ కార్యాలయంలో పని ఒత్తిడితో పాటు అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ధరణి గ్రివెన్స్‌ దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీఆర్‌వోలను భూ సమస్యల పరిష్కారానికి వినియోగించవద్దనే ప్రభుత్వ ఆదేశాలతో ప్రస్తుతం వీఆర్‌ఏలతో పాటు రెవెన్యూ పరిశీలకుల ఆధ్వర్యంలోనే ప్రక్రియ సాగుతోంది. వీరికి భూముల స్థితిగతులపై అవగాహన కోరవడం, దరఖాస్తులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారుతుందని రెవెన్యూశాఖ అధికారులు చెబుతున్నారు.
మూడంచెల విధానంలో పరిశీలన
భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో దాదాపు గత 7 నెలల క్రితం గ్రివెన్స్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టింది. పలువురు రైతులు మీ సేవ ద్వారా ఫోల్డర్‌లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 11 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అధికంగా పరిష్కరించినప్పటికీ ప్రతీరోజు వస్తూనే ఉన్నాయి. నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను సవరించాలని కోరుతూ ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటి కోసం అధికారులు మూడెంచెల విధానంలో పరిశీలన చేపడుతున్నారు. మొదటగా జిల్లా కలెక్టర్‌ సమక్షంలో పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. రెండో దశలో గత రెవెన్యూ రికార్డులను పరిశీలించి వాస్తవాలు తెలుసుకుంటున్నారు. చివరగా ఆయా దరఖాస్తులను తహసీల్దార్‌కు పంపి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని సూచిస్తున్నారు. ఇలా మూడంచెల విధానంలో భూ సమస్యల దరఖాస్తులను పరిశీలించడంలోనూ ఆలస్యం ఎదురవుతుందనే వాదన వినిపిస్తోంది.
పరిష్కారం కాక తప్పని ఎదురుచూపులు
ప్రభుత్వం భూ రికార్డులను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ధరణి పోర్టల్‌ను రూపొందించి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను తహసీల్దార్‌లకు అప్పగించింది. అలాగే భూముల వివరాలను ఆన్‌లైన్‌లో ఎవరైన చేసుకునే వీలు కల్పించింది. మీసేవ కేంద్రాల ద్వారా ధరణిలో మ్యూటేషన్‌లు, గ్రివెన్స్‌ దరఖాస్తుల పరిష్కారం బాధ్యతలు కలెక్టర్‌లకు ఇచ్చారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో మీసేవ కేంద్రాలలో ధరణి సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అయినా గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో చాలామంది రైతులకు ఇబ్బందులే కాకుండా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఎవరికి మొరపెట్టుకున్నా పట్టించుకునే వారే లేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.