Abn logo
Oct 10 2021 @ 23:59PM

ధాన్యం కొనుగోళ్లకు బ్రేక్‌

 గత నెలతో ముగిసిన గడువు

పది రోజులుగా పనిచేయని వెబ్‌సైట్‌

ఇంకా పూర్తికాని కొనుగోళ్లు

భారీగా తగ్గిన ధరలు

అయోమయంలో రైతులు


నెల్లూరు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది జిల్లాలోని రైతుల పరిస్థితి. గతేడాది ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. దాదాపు ఐదు లక్షల ఎకరాలకు సాగునీటి కేటాయింపులు జరిపినా కేవలం అందులో నాలుగో వంతు మాత్రమే పంట వేశారు. అయితే ఆ పంట దిగుబడిని అమ్ముకోవడం కూడా రైతులకు కష్టంగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకుందామంటే గడిచిన పది రోజులుగా వెబ్‌సైట్‌ పనిచేయడం లేదు. దీంతో అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో ధాన్యం ధరలు మరింత దిగజారాయి. పుట్టి ధాన్యాన్ని రూ.11 నుంచి 12 వేలకు మించి దళారులు కొనుగోలు చేయడం లేదు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు రైతులు వాపోతున్నారు. సెప్టెంబరు నెలాఖరుకే ఖరీఫ్‌  ధాన్యం కొనుగోళ్లకు గడువు ముగిసింది. అయితే ఆ తర్వాత గడువును ప్రభుత్వం పొడగించలేదు. జిల్లా నుంచి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఇంకా కొనుగోళ్లకు అనుమతి రాలేదు. 

ఖరీఫ్‌కు సంబంధించి ఆగస్టు నుంచి వరి కోతలు ప్రారం భమయ్యాయి. అదే నెల 16వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 248 రైతు భరోసా కేంద్రా(ఆర్‌బీకే)ల్లో కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మిల్లర్లను ట్యాగ్‌ చేశాక ఆగస్టు 23వ తేదీ నుంచి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈ సీజన్‌కు సంబంధించి రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత నెల చివరినాటికి 1.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 5503 మంది రైతుల నుంచి ఈ ధాన్యాన్ని రూ.232 కోట్లకు కొన్నారు. అయితే జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరి కోతలు జరుగుతున్నాయి. ఇప్పటికే కోతలు కోసిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో కొనకపోవడంతో నిల్వ చేసుకుంటున్నారు. కొంత మంది నిల్వ చేసే అవకాశం లేక దళారులకు తెగనమ్ముకున్నారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆందోళనలో ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే అవకాశం లేకపోవడంతో దళారులకు విక్రయిస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాదని రైతులు వాపోతున్నారు. 


జిల్లాలో ఆలస్యంగా రబీ

సాధారణంగా ఖరీఫ్‌ అన్ని జిల్లాల్లో ముందుగా ప్రారంభమవుతుంది. ఆ జిల్లాల్లో రబీ కోతలు ముందుగానే వచ్చేస్తాయి కాబట్టి మార్చి, ఏప్రిల్‌ నాటికి రెండో పంట సాగు మొదలవుతుంది. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం రబీ సాగు నవంబరు, డిసెంబరులో ప్రారంభమై మార్చి, ఏప్రిల్‌, మే వరకు కొనసాగుతుంది. ఇక రెండో పంట అక్టోబరు వరకు సాగుతుంది. అన్ని జిల్లాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు నెలాఖరు వరకు ఖరీఫ్‌ పంట కొనుగోలు చేసేందుకు అనుమతిస్తుంది. అయితే జిల్లా పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అధికారులకు వివరించి గడువు పొడగించుకుంటుంది. గతేడాది జరిగింది కూడా ఇదే. అప్పుడు ఉపరాష్ట్రపతి  ఎం. వెంకయ్యనాయుడు దృష్టికి ధాన్యం కొనుగోళ్ల సమస్యను పలువురు తీసుకెళ్లడంతో ఆయన స్పందించి కేంద్ర అధికారులతో మాట్లాడి గడువు  పొడగించేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ దఫా మాత్రం కొనుగోళ్ల గడువు ముగిసి పది రోజులైనా ఇంత వరకు పొడగింపుపై నిర్ణయం తీసుకోవడం లేదు. ఓ వైపు రైతులు, మరోవైపు మిల్లర్లు అధికారులకు తమ గోడును వెల్లబోసుకుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితిని అధికారులు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం గడువు పొడగించకపోతే జిల్లాలో వందల మంది రైతులకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులైతే తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తుం డడం విమర్శలకు తావిస్తోంది.